కరీంనగర్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్‌లో దళితబంధు అంకురార్పణ సభ విజయవంతమైంది. లక్షకుపైగా మంది తరలిరావడంతో జాతరను తలపించింది. ఈ సభకు లక్షకుపైగా మంది వస్తారని యంత్రాంగం ముందుగానే ఏర్పాట్లు చేసింది. అయితే, ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు జోరు వాన పడడంతో సభా ప్రాంగణం బురదమయమైంది. సభ వాయిదా వేస్తారు కావచ్చు అని అందరూ భావించారు. ఎంత వాన పడినా సభ జరిగి తీరుతుందని, ఒంటి గంట వరకు ప్రజలంతా సభా స్థలికి చేరుకోవాలని మంత్రి హరీశ్‌రావు అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులకు టెలీకాన్ఫరెన్స్ ద్వారా ముందురోజు వివరించారు. అలాగే, రాత్రంతా కష్టపడి సభా ప్రాంగణం వద్ద నిలిచిన వర్షపునీటిని తీసివేసి.. సభకు వచ్చే ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. నిజానికి ఉదయం నుంచే దళిత కాలనీల్లో పండుగ వాతావరణం నెలకొనగా, దళితులంతా జాతరలా కదిలారు. స్వచ్ఛందంగా ఎవరికి వారే తమ ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి.. వాకిళ్లలో ముగ్గులువేసి.. ఇండ్లకు తాళాలు వేసి సభకు తరలివచ్చారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి దళితవాడ ఉదయం 11 గంటలకే నిర్మానుష్యంగా కనిపించింది. సభకు జనం పోటెత్తగా, జాతరను తలపించింది. సీఎం కేసీఆర్ సభా స్థలికి వచ్చే వరకే లక్షకుపైగా కుర్చీలు నిండిపోయాయి. రోడ్లపై బస్సులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. చాలావరకు ప్రజలు బస్సుల్లో ఉండిపోయారు. సభా ప్రాంగణం పూర్తిగా నిండిపోవడంతో వేలాది మంది జమ్మికుంట-హుజూరాబాద్ రోడ్డుపై నిలబడి సీఎం ప్రసంగాన్ని విన్నారు.
హుజూరాబాద్ ఒక ప్రయోగశాల
దేశానికి ఒక దిక్సూచిగా నిలిచే దళితబంధు పథకానికి హుజూరాబాద్ నియోజకవర్గం ఒక ప్రయోగశాలగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. అంతేకాదు అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. అందుకోసం ప్రత్యేక బ్యాంకు ఖాతా తీయించి.. అందులో వేస్తామని చెప్పడమే కాకుండా.. ఆ డబ్బులతో ఎవరి స్వేచ్ఛానుసారం వారు వ్యాపారాలు పెట్టుకోవచ్చని తెలిపారు. అలాగే, రక్షణ నిధి ఒకటి ఏర్పాటు చేస్తామని, ఇచ్చే డబ్బులతో కేవలం హుజూరాబాద్‌లోనే కాదు ఎక్కడైనా దుకాణాలు పెట్టుకోవచ్చని సూచించారు. పథకం అమలులో భాగంగా వచ్చే మార్పులు చేర్పులు, పెట్టబోయే వ్యాపారాలు, తద్వారా దళిత బిడ్డలకు వచ్చే ఆదాయాలు, అధికారుల తర్ఫీదు, శిక్షణ వంటి అనేక అంశాలకు హుజూరాబాద్ ఒక ప్రయోగశాల అవుతుందని చెప్పారు. ఇక్కడ నుంచి వచ్చే అనుభవాలు, సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకొని పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.
అనుమానాలన్నీ పంటాపంచలు
దళితబంధుపై ఆది నుంచీ ప్రతిపక్షాలు అయోమయానికి గురి చేస్తున్నాయి. దళితులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. ఓట్ల కోసమే పథకం ప్రవేశ పెడుతున్నారని, హుజూరాబాద్‌లో కొంత మందికే ఇస్తారని, పైరవీ చేసుకున్న వాళ్లకే మాత్రమే ఇస్తున్నారని, గులాబీ కండువా కప్పుకుంటేనే ఇస్తారని.. ఇలా రకరకాలుగా తప్పడు ప్రచారాలు చేశాయి. సదరు సామాజికవర్గాల సానుభూతి పొందేందుకు తప్పడు జాబితా పత్రాలు సృష్టించి ఆందోళనకు గురిచేశాయి. ఇచ్చే డబ్బులపై ఆంక్షలు పెడుతారని, ప్రభుత్వం, అధికారులు చెప్పిన వ్యాపారాలు మాత్రమే పెట్టుకోవాలని, ఇంటి వద్దనే బిజినెస్‌లు చేయాలని అంటారంటూ నోటికొచ్చినట్లుగా తప్పుడు ప్రచారం చేశాయి. ఈ విషయంలో మంత్రి హరీశ్‌రావు ఇప్పటికే రెండుసార్లు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరించగా, సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ అపోహలు, అనుమానాలన్నింటినీ పటాపంచలు చేశారు. ప్రతిపక్షాల డొల్లమాటలు, దొంగముచ్చట్లను, రెచ్చగొట్టే ప్రయత్నాలను బయటపెట్టి, పథకం అమలు తీరుపై పూర్తి స్పష్టతనిచ్చారు. దళితబంధు కింద ప్రత్యేక అకౌంట్లు ఓపెన్ చేసి అందులో డబ్బులు వేస్తామని, పాత బకాయిలు ఏమైనా ఉన్నా బ్యాంకులు తీసుకోకుండా ఉంటుందని చెప్పారు. లబ్ధిదారులు పూర్తి స్వేచ్చతో ఇష్టమైన వ్యాపారం పెట్టుకోవచ్చని, అది హుజూరాబాద్‌లోనే కాదు.. ఎక్కడైనా పెట్టుకోవచ్చని, అందుకు తగిన సహకారం సంపూర్ణంగా అధికారులు అందిస్తారని చెప్పారు. ప్రతి అర్హత ఉన్న కుటుంబానికి ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు, ఈ పథకం కేవలం హుజూరాబాద్‌కు మాత్రమే పరిమితం చేస్తారని, రాష్ట్రంలో ఇతరులకు ఇవ్వరంటూ ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు ఘాటైన సమాధానం చెప్పారు. రాష్ట్రంలో అన్ని దళిత కుంటుంబాలకు లబ్ధి చేకూరుస్తామంటూ వివరాలతో సహా చెప్పి చెంప చెల్లుమనిపించారు.
ప్రతిపక్షాల్లో గుబులు
అంచనాలకు మించి సభ విజయవంతం కావడంతో ప్రతిపక్ష పార్టీల్లో గుబులు మొదలైంది. లక్ష మందితో సభ నిర్వహిస్తామని ముందు నుంచీ టీఆర్ఎస్ చెబితే.. జనం సాదాసీదాగా వస్తారని ప్రతిపక్షాలు భావించాయి. అంతేకాదు, దళిత వాడలు తరలిరావంటూ ప్రగల్భాలు పలికాయి. లేని పోని కుట్రలు, కుతంత్రాలు చేసి.. సభకు దళితులు తరలిరాకుండా ఉండేందుకు ప్రయత్నించాయి. అలాగే, లేనిపోని అపోహలను సృష్టించాయి. వీటన్నింటినీ తుంగలో తొక్కి జనం సభవైపు అడుగులు వేసింది. జాతరలా తరలివచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అండగా నిలబడింది. సభలో పథకం గురించి వివరిస్తున్నంత సేపు ఆసక్తిగా విన్న ప్రజలు.. పథకాన్ని విజయవంతం చేసుకోవడానికి అన్ని వర్గాలూ కలసి రావాలంటూ ముఖ్యమంత్రి పిలుపునివ్వడంతో సభా ప్రాంగంలోని లక్షలాది చేతులు ఒక్కసారిగా పైకి లేచాయి. విజయవంతం చేసుకుందామంటూ చెప్పిన మాటలు సభా ప్రాంగణం నలుమూలలా మారుమోగాయి. ఇదే సమయంలో సీఎం ఇతర వర్గాలకు కూడా అప్పీలు చేశారు. రైతుబంధు, దళిత బంధును అమలు చేస్తున్నాం. ‘భవిష్యత్‌లో మరిన్ని పథకాలు తీసుకొస్తాం. అందరినీ ఆదుకోవడం ప్రభుత్వ లక్ష్యం’ అంటూ చెప్పడంతోపాటు దళిత బంధును సక్సెస్ చేసే విషయంలో అన్నివర్గాలూ సహకరించాలంటూ చేసిన విజ్ఞప్తిపై సభికులందరూ సానుకూలంగా స్పందించారు. జనం కదలివచ్చిన తీరుతోపాటు ఇన్నాళ్లుగా చేసిన కుట్రలు, కుతంత్రాలు, అనుమానాలను పటాపంచలుచేస్తూ ముఖ్యమంత్రి చేసిన ప్రసంగం.. ప్రజల నుంచి వ్యక్తమైన హర్షం.. వంటి విషయాలు ప్రతిపక్షాలకు గుబులు పుట్టించగా, గులాబీ శ్రేణుల్లో జోష్‌ను పెంచాయి. సోమవారం సభ విజయవంతం కావడంతో ఉత్సాహంగా వెనుదిరిగాయి. మంగళవారం ఉదయమే హుజూరాబాద్ నియోజకవర్గంలో రంగంలోకి దిగి, ఇంటింటా తిరిగాయి.