హుజూరాబాద్ రూరల్, ఆగస్టు 31: హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. మండలంలోని జూపాక, బొత్తలపల్లి, రాజపల్లి గ్రామాల్లో మంగళవారం ఆయన మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డితో కలిసి టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో 2001 నుంచి టీఆర్ఎస్ విజయదుందిబి మోగిస్తున్నదని, ఉప ఎన్నికలోనూ విజయం ఖాయమని స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల కరెంట్, రైతు బంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి వంటి పథకాలు ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
ఈటలది అహంకారం: మాజీ మంత్రి పెద్దిరెడ్డి
బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు అహంకారం, అహంభావం ఉంటుందని మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి దుయ్యబట్టారు. కమలాపూర్, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎవ్వరికి కూడా తెలియని ఈటల రాజేందర్‌కు సీఎం కేసీఆర్ బీఫాం ఇచ్చి ఆరుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు మంత్రి పదవి ఇస్తే తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన దుర్మార్గుడని అన్నారు. ప్రభుత్వ, దేవారాంజ భూములను కొనుగోలు చేయకూడదని తెలిసీ కూడా తక్కువ ధరకు కొనుగోలు చేసి పక్కనే ఉన్న భూములను కబ్జా చేసిన ఘనుడు ఈటల అని పేర్కొన్నారు. ఈటల తప్పు చేస్తేనే మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేశారని, దానికి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి రాద్ధాంతం చేస్తున్నాడని అన్నారు. గత ఎన్నికల్లో 16 వందల ఓట్లు కూడా రాని బీజేపీలోకి వెళ్లాడని ఎద్దేవా చేశారు. ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం సైనికుల్లా పని చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జడ్పీటీసీ పడిదం బకారెడ్డి, మాజీ జడ్పీటీసీ విజయారెడ్డి, నాయకులు పోలంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, సురేందర్ రెడ్డి, సంగెం ఐలయ్య, ఎడవెల్లి కొండల్ రెడ్డి, పోరెడ్డి కిషన్‌రెడ్డి, రాజ ప్రతాపరెడ్డి, ఇనుగాల విక్రమ్ రెడ్డి, కంకణాల సమ్మిరెడ్డి, రాజిరెడ్డి, మొలుగూరి ప్రభాకర్, రాజిరెడ్డి, దేవరపల్లి నరసింహాస్వామి తదితరులు పాల్గొన్నారు.
అందరి చూపు టీఆర్ఎస్ వైపే
ప్రతి పక్షాల నాయకులు, కార్యకర్తల చూపు టీఆర్ఎస్ వైపే ఉంటుందని, సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ పేర్కొన్నారు. మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన సుమారు 50 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు సింగాపూర్‌లోని గెస్ట్‌హౌస్‌లో ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ మాట్లాడుతూ, మరికొద్ది రోజుల్లో బీజేపీలో ఈటల రాజేందర్ ఒక్కడే ఉంటాడని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పని చేయాలని పార్టీలో చేరిన వారికి సూచించారు. కార్యక్రమంలో గౌడ సంఘం గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ సురకంటి గిరిజ-సదాన్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కిషన్‌రెడ్డి, నాయకులు ఇనుగాల విక్రమ్‌రెడ్డి, రమేశ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.