నమస్తే తెలంగాణ, జగిత్యాల/ జగిత్యాల అర్బన్, సెప్టెంబర్ 6: దేశచరిత్రలో ఎక్కడాలేని విధంగా జగిత్యాల వైద్య కళాశాల ఏర్పడిన తొలిరోజు నుంచే సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రానున్నాయని రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్‌రెడ్డి తెలిపారు. జగిత్యాలలో మెడికల్ కాలేజీ కోసం కేటాయించిన స్థలంతో పాటు, జగిత్యాల జిల్లా దవాఖాన, మాతా శిశు సంరక్షణ కేంద్రం, నర్సింగ్ కాలేజీ భవనాలను ఆయన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, పబ్లిక్ హెల్త్ సీఎం ఓఎస్డీ డాక్టర్ తుమ్మనపల్లి గంగాధర్, టీఎస్ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి సోమవారం పరిశీలించారు. అనంతరం వైద్య కళాశాల స్థలం, మౌలిక వసతుల కల్పనపై కలెక్టర్ గుగులోత్ రవితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ జగిత్యాలలో ఒకేసారి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, వైద్య విద్యా బోధనను ప్రారంభిస్తున్నామన్నారు. గతంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన తర్వాత పది సంవత్సరాలకు ఆ కాలేజీలకు అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ దవాఖానలు ఏర్పాటయ్యేవని, జగిత్యాలలో తొలి రోజు నుంచే ఈ సేవలు అందుబాటులోకి రావడం గొప్ప విషయమన్నారు. మెడికల్ కాలేజీలతో పాటు, సూపర్ స్పెషాలిటీ దవాఖానలను సైతం కాలేజీలతో పాటే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. రోగులకు నయా పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన సేవలందించడమే సర్కారు ధ్యేయమన్నారు.
జగిత్యాలలో వైద్య కళాశాలతో పాటు 650 బెడ్లతో సూపర్ స్పెషాలిటీ దవాఖానను ప్రారంభిస్తామని చెప్పారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ వైద్యుడు కావడంతో మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ దవాఖానకు సమకూర్చాల్సిన వసుతలపై అవగాహన కలిగి ఉన్నారని చెప్పారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారికి సమీపంలో 27 ఎకరాల స్థలాన్ని కేటాయించారని చెప్పారు. ఈ స్థలానికి నాలుగు వైపుల రహదారులు ఉన్నాయని, ప్రధాన పట్టణాలను అనుసంధానం చేసేందుకు మంచి మార్గాలు ఉన్నాయన్నారు. ఇంత మంచి స్థలాన్ని ఎంపిక చేసిన ఎమ్మెల్యే అభినందనీయులన్నారు. పట్టణ నడిబొడ్డున మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ దవాఖాన, నర్సింగ్ వసతి గృహాలు అన్నీ ఒకే క్యాంపస్‌లో నిర్మించే విధంగా స్థలాన్ని కేటాయించడం గొప్ప విషయమన్నారు. జగిత్యాలలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి బోధన, వైద్యం ప్రారంభించేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. ఇప్పటికే నిర్మించిన మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని వినియోగించుకుంటామన్నారు. వచ్చే ఏడాది 150 వైద్య విద్యార్థులు ఇక్కడ విద్యాభ్యాసం చేస్తారన్నారు. సూపర్ స్పెషాలిటీ దవాఖానకు అనుమతి లభించడంతో వైద్య విద్యలో పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సులు, సీనియర్ ఫ్రొఫెసర్లు, నిపుణులైన వైద్యుల సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ వల్లే జగిత్యాల అభివృద్ధి పథంలో సాగుతుందన్నారు.
ఉద్యమ సమయంలో ప్రకటించిన మేరకు 2016లో జగిత్యాలను జిల్లా చేశారని చెప్పారు. నిజమాబాద్ ఎంపీ కవితతో కలిసి తాను జగిత్యాల జిల్లాకు మెడికల్ కాలేజీ ఇవ్వాలని విన్నవించానని, అడిగిన వెంటనే సీఎం కేసీఆర్ జగిత్యాలకు త్వరలోనే మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని ప్రకటించారన్నారు, సీఎం ఇచ్చిన హామీకి అనుగుణంగానే మెడికల్ కాలేజీని, సూపర్ స్పెషాలిటీ దవాఖానను సైతం మంజూరు చేశారన్నారు. జగిత్యాల ప్రజల తరఫున సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జగిత్యాల జిల్లాతో పాటు, నిజమాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల ప్రజలకు, మెడికల్ విద్యార్థులకు, ప్రొఫెసర్లకు అనుకూలంగా ఉండేలా ధరూర్ క్యాంపులో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ సూచించారన్నారు. ఈ మేరకు 27.05 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మెడికల్ కాలేజీ, వైద్య సేవలు ప్రారంభమవు తాయన్నారు. జగిత్యాలకు గతంలోనే నర్సింగ్ కాలేజీ మంజూరైందని, దానికి స్థల కేటాయింపు జరగలేదని, రాష్ట్ర ఏర్పాటు అనంతరం ధరూర్ క్యాంపులో స్థలాన్ని కేటాయించడంతో పాటు నిర్మాణానికి రూ. 15 కోట్లు అప్పటి ఎంపీ కవిత మంజూరు చేయించారన్నారు.
నర్సింగ్ కాలేజీ భవనం దాదాపు పూర్తయిందని, వచ్చే ఏడాది ఈ భవనం, మెడికల్ కాలేజీ మహిళ విద్యార్థినులకు వసతిగృహంగా ఉపయోగపడే అవకాశం ఉందన్నారు. మెడికల కాలేజీకి అనుబంధంగా ఏర్పాటు చేయనున్న నర్సింగ్ కాలేజీకి సైతం పూర్తిస్థాయి స్టాఫ్‌ను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. పాత నర్సింగ్ కాలేజీకి పూర్తిస్థాయిలో స్టాఫ్ మంజూరు కాలేదని, ఈ విషయాన్ని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని, త్వరలోనే పూర్తిస్థాయి స్టాఫ్ పోస్టులు మంజూరవు తాయన్నారు. పాత నర్సింగ్ కాలేజీలో కేవలం 40 మంది విద్యార్థినులకు మాత్రమే ప్రవేశాలు ఉన్నాయని, దీన్ని వందకు పెంచాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ టీఎండీని కోరారు. ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, జగిత్యాల ప్రధాన దవాఖాన పర్యవేక్షకురాలు డాక్టర్ సుదక్షిణాదేవి, జగిత్యాల ప్రధాన వైద్యశాల ఆర్ఎంవో డాక్టర్ రామకృష్ణతోపాటు తదితరులు పాల్గొన్నారు.