పెద్దపల్లి-జయశంకర్ భూపాలపల్లి జిల్లాల సరిహద్దు మానేరు తీరం ఓడేడ్- గర్మిళ్లపల్లి వద్ద టోల్గేట్ పేరిట వసూళ్ల దందా సాగుతున్నది. నదిలో కిలోమీటర్ మేర తాత్కాలిక మట్టిరోడ్డు వేసి, ఆపై అనధికార టోల్గేట్ పెట్టి దండుకుంటున్నట్టు వెలుగుచూస్తున్నది. ఒక్కో వాహనానికి ఒక్కో రేటు నిర్ణయించడం, పైగా ద్విచక్రవాహనాలకు సైతం వసూలు చేయడంపై వాహనదారుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఇదంతా కండ్ల ముందే కనిపిస్తున్నా పట్టించుకునేవారే లేకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
పెద్దపల్లి, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): ముత్తారం మండలం ఓడేడ్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గర్మిళ్లపల్లి వద్ద మానేరుపై వేసిన తాత్కాలిక రోడ్డు మీదుగా పెద్దపల్లి, భూపాలపల్లితోపాటు కరీంనగర్ జిల్లాలోని సుమారు 80 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే, ఇదే అదునుగా ఓడేడ్‌కు చెందిన కొంతమంది దోపిడీ చేస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. అనధికారికంగా (ఓడేడ్- గర్మిళ్లపల్లి) మానేరు నదిలో తాత్కాలిక మట్టిరోడ్డు వేసి, టోల్ గేట్‌ను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున వసూళ్లకు దిగుతున్నారు. ఒక్కో వాహనానికి ఒక్కో రేటును నిర్ణయించి ఇష్టారాజ్యంగా దండుకుంటున్నారు. సాధారణంగా 70 నుంచి 100 కిలోమీటర్ల రహదారులకు 35 నుంచి 75 వరకు వసూలు చేస్తారు. ద్విచక్రవాహనాలకు ఎక్కడా టోల్ గేట్ వద్ద వసూళ్లు ఉండవు కానీ, ఇక్కడ వాటికి సైతం డబ్బులు తీసుకుంటున్నారు. ఒక్క రోజు అటు దాటాలన్నా.. ఇటు దాటాలన్నా ఇక్కడ టోల్ కట్టాల్సిందే. లేని పక్షంలో ఆ మానేరు దాటడం కుదరదు.
ఆలయ అభివృద్ధి కమిటీ పేరిట..
టోల్గేట్ నిర్వహిస్తున్న నిర్వాహకులు ఓడేడ్ మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ పేరిట రసీదులు ఇస్తున్నారు. ఇక్కడ రోజువారీగా వసూలు చేసే డబ్బులను ఆ ఆలయ అభివృద్ధి కోసం వినియోగిస్తామనే విధంగా వసూళ్లకు దిగుతున్నారు. అయితే, గతేడాది గర్మిళ్లపల్లి గ్రామస్తులు ఇదే తీరుగా వసూళ్లు చేయగా.. ఈ ఏడాది ఓడేడు చెందిన కొంతమంది వసూళ్లు చేస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు.
వేలం వేసిందెవరు?
టోల్గేట్ నిర్వహించేందుకు పెద్దఎత్తున డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకుగాను గ్రామంలో అనధికారికంగా టెండర్లు పిలిచినట్టు తెలుస్తున్నది. ఒక ప్రైవేట్ డాక్టర్ 18లక్షలకు ఈ టెండర్‌ను దక్కించుకున్నాడనే ప్రచారం జరుగుతున్నది. టోల్గేట్ డబ్బులు వసూలు చేసే కలెక్షన్ బాయ్స్ కూడా ఇదే చెబుతున్నారు. అయితే ఈ అనధికారిక వేలం ఎవరు వేశారు? ఆ డబ్బులు ఎవరి ఖాతాలోకి వెళ్తాయి? టెండర్ వేసేందుకు వారికున్న అర్హతలేమిటి? అనే విషయంపై ప్రభుత్వ అధికారులకు ఇప్పటికే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయినా పట్టించుకునే వారే లేరనే విమర్శలున్నాయి.
రోజుకు లక్ష వరకు వసూళ్లు?
రెండు జిల్లాల సరిహద్దు మానేరు నదిపై వేసిన తాత్కాలిక మట్టి రోడ్డు కాసులు కురిపిస్తున్నది. ఇక్కడ నిత్యం వందలాది వాహనాలు మానేరు దాటుతుండడంతో అనధికార టోల్ నిర్వాహకులు పెద్ద ఎత్తున దండుకుంటున్నారు. ప్రతి రోజూ పగలు ఇద్దరు, రాత్రి ఇద్దరు కలెక్షన్ బాయ్స్‌ను పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. నిత్యం కలెక్షన్ 80వేల నుంచి లక్ష వరకూ ఉంటున్నట్టు తెలుస్తున్నది. ఇటీవల శివరాత్రి సందర్భంగా మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాలలో కొలువైన గట్టుమల్లన్న జాతరకు భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నుంచి వందలాది మంది వెళ్లగా, ఆ రోజు వసూళ్లు సైతం పెద్ద ఎత్తునే సాగాయి. రాత్రి వేళల్లో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు హైమాస్ట్ లైట్‌ను సైతం ఏర్పాటు చేశారు. దీనికితోడు గేటు వద్ద ఉన్న గుడిసెకు ఒక సీసీ కెమెరాను సైతం అమర్చి, ఎవరూ నిలదీయకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. అయితే, ఆ సీసీ కెమెరా ముత్తారం పోలీసులు ఏర్పాటు చేశారని, రాకపోకలపై నిఘా కోసం ఏర్పాటు చేసినట్లుగా కలెక్షన్ బాయ్స్ చెబుతున్నారు.
అదనపు భారం
భూపాలపల్లి జిల్లా పరిధిలోని చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, పర్కాల, కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలాల ప్రజలు మంథనికి రావాలన్నా, గోదావరిఖనికి రావాలన్నా.. కాల్వశ్రీరాంపూర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఓడేడ్ తాత్కాలిక రోడ్డు నుంచి కాకుండా ఇలా వస్తే అదనంగా 30 నుంచి 40 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది. పెద్దపల్లి జిల్లాలోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్, గోదావరిఖని, మంచిర్యాల, శ్రీరాంపూర్, జైపూర్, చెన్నూర్, బెల్లంపల్లి ప్రాంతాల ప్రజలు అటు వెళ్లాలన్నా అంతే దూరం అదనంగా ప్రయాణించాల్సి వస్తుంది. ఓడేడ్-గర్మిల్లపల్లి మానేరు నదిలో వేసిన మట్టి రోడ్డుతో దూరం తగ్గుతున్నా, టోల్ వసూలుతో అదనపు భారం మీదపడుతున్నది. కేసీఆర్ హయాంలో వాహనదారుల వ్యయప్రయాసలను దృష్టిలో పెట్టుకొని మాజీ ఎమ్మెల్యేలు మధుసూధనచారి, పుట్ట మధూకర్ ఇదే మానేరుపై మట్టి రోడ్డు వేసి, ఉచిత ప్రయాణాలకు వీలు కల్పించారు. కానీ, ప్రస్తుతం పెద్ద ఎత్తున వసూళ్లకు దిగుతుండడంతో ప్రజలు, సింగరేణి ఉద్యోగులు, రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి రోజూ భూపాలపల్లి జిల్లా పరిధిలోని చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి గ్రామాల నుంచి సింగరేణి కార్మికులు గోదావరిఖని, యైటిైంక్లెన్‌కాలనీ, సెంటినరీకాలనీ, శ్రీరాంపూర్ ప్రాంతాల్లోని భూగర్భ గనులు, ఓపెన్ కాస్టుగనుల్లో విధులకు వెళ్తుండగా, జేబులు గుల్ల అవుతున్నాయని వాపోతున్నారు. అధికారులు స్పందించాలని, వసూళ్లు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఒక్కో వాహనానికి ఒక్కో రేటు!
అనధికార టోల్ గేట్ వద్ద ఒక్కో వాహనానికి ఒక్కో ధరను నిర్ణయించారు. అందులో లోడ్ లారీకి 500, ఖాళీ లారీకి 300, వ్యాన్‌కు 150, కారుకు 100, ఆటోకు 50, బైక్‌కు 30 వసూలు చేస్తున్నారని వాహనదారులు చెబుతున్నారు. రాష్ట్ర, జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన టోల్గేట్ల వద్ద కూడా ఇంతగా వసూలు చేయడం లేదంటున్నారు. కానీ, ఇక్కడ మాత్రం అనధికారికంగా ఏర్పాటు చేయడమే కాదు, అడ్డంగా దండుకుంటున్నారని మండిపడుతున్నారు.
కిలోమీటర్ కూడా లేదు.. రూ.వందనా..?
హైవేల మీద వంద కిలో మీటర్లకు కూడా 100 తీసుకోరు. ఇంత అన్యాయంగా ఇక్కడ తిప్పి తిప్పి కొడితే కిలో మీటర్ ఉండదు. ఈ మానేరు దాటి నందుకు వంద తీసుకుంటున్నరు. ఏదో ఓ ఇరవై రూపాయలంటే ఏం కాదు. కానీ, ఇలా పెద్ద ఎత్తున వసూళ్లు చేయడం అన్యాయం. మల్ల ఈ రిసిప్ట్ ఇవ్వాలనే పని చేస్తదట. రేపు వస్తే పనిచేయదట. ఇంత ఘోరం ఎక్కడన్నా ఉంటదా? ప్రభుత్వమే ఈ వంతెనను త్వరగా పూర్తి చేయాలి.
-శ్రీనివాస్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
మట్టి రోడ్డుకు వంద తీసుకుంటున్నరు..
మానేరు మీద మట్టి రోడ్డు వేసి రూ. 100 వసూలు చేస్తున్నారు. తప్పని సరి కాబట్టి డబ్బులు ఇచ్చి వెళ్లాల్సి వస్తున్నది. అనధికారిక టోల్ టాక్స్ అయినా ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. అధిక వసూళ్లు మానేయాలి. మట్టి రోడ్డే కదా.. తక్కువగా తీసుకోవాలి.
-శ్రీనివాస్, ప్రభుత్వ ఉద్యోగి ఘన్పూర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా.