కార్పొరేషన్, మే 16: ఇతర ప్రాంతాల నుంచి వచ్చి జిల్లా కేంద్రంలో వివిధ పనులు చేసుకునే గిరిజన మహిళలు ఉండేందుకు వీలుగా హాస్టల్ భవనం నిర్మిస్తున్నామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. సోమవారం నగరంలోని పద్మనగర్‌లో గిరిజన మహిళా వర్కింగ్ హాస్టల్ భవనానికి, భవిత వృద్ధ్దాశ్రమ భవనానికి, రాంనగర్ మున్నూరుకాపు భవనం పనులకు భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి గిరిజన మహిళలు ఎంతో మంది కరీంనగర్‌కు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారని, వారి కోసం రూ.2.75 కోట్లతో ప్రత్యేకంగా హాస్టల్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇందులో 100 మంది ఉండే అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థినులకు కూడా ఇందులో అవకాశం ఇస్తామన్నారు. ఏడాదిలోగా ఈ భవనం పూర్తి అయి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ కర్ణన్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయ, మేయర్ వై సునీల్‌రావు, కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, కంసాల శ్రీనివాస్, ఎంపీటీసీ తిరుపతినాయక్, టీఆర్ఎస్ నాయకులు చల్ల హరిశంకర్, ఎల్ రూప్సింగ్, శ్రీరాములు పాల్గొన్నారు.