రామడుగు, అక్టోబర్ 10: మండల కేంద్రంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విరాట్ యువజన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవీ మండపంలో ఆదివారం మహిళలు కుంకుమ పూజ చేశారు. గోపాల్రావుపేట అంబేద్కర్ చౌరస్తా సమీపంలోని దుర్గాదేవి మండపంలో కుంకుమ పూజ నిర్వహించగా ఎంపీపీ కలిగేటి కవిత, భక్తులు పాల్గొన్నారు. అలాగే, ఏఎంసీ చైర్మన్ గంట్ల వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ఎడవెల్లి నరేందర్‌రెడ్డి దుర్గాదేవీ మండపాల్లో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
కరీంనగర్ రూరల్, అక్టోబర్ 10: కరీంనగర్ రూరల్ మండలం నగునూర్‌లోని దుర్గాభవానీ ఆలయంలో దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారు వైష్ణవి అవతారంలో గురుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితుడు పురాణం మహేశ్వర శర్మ పర్యవేక్షణలో అర్చకులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని ఒడిబియ్యం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. భవానీ దీక్షాభక్తులకు అన్న ప్రసాదం అందజేశారు. పూజల్లో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.