రాష్ట్ర హైకోర్టు జడ్జి డాక్టర్ షమీమ్ అక్తర్
సిరిసిల్లలో పోక్సోకోర్టు ప్రారంభం
హాజరైన ఉమ్మడి కరీంనగర్, సిరిసిల్ల జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జడ్జిలు ఎంజీ ప్రియదర్శిని, ఎం జాన్సన్, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్‌హెగ్డే
గాంధీచౌక్, ఫిబ్రవరి19: చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల సత్వర పరిష్కారానికే పోక్సో కోర్టును ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర హైకోర్టు జడ్జి డాక్టర్ షమీమ్ అక్తర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోక్సో కోర్టును శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని, సిరిసిల్ల జిల్లా కోర్టు తొమ్మిదో అదనపు జిల్లా జడ్జి ఎం జాన్సత్ కలిసి ప్రారంభించారు. అంతకుముందు సిరిసిల్లకు చేరుకున్న న్యాయమూర్తికి జా న్సన్ ఆధ్వర్యంలో పూజారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం సర్వమత ప్రార్థనలు చేసి దీవెనలు అందించారు. ఈ సందర్భంగా శిలఫలకాన్ని అవిష్కరించి, పోక్సో కోర్టును ప్రారంభించారు. జాన్సన్ పోక్సో కోర్టు ఇన్చార్జి జడ్జీగా బాధ్యతలు స్వీకరించి బెంచీని ప్రారంభించారు. ఆనంతరం కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో హైకోర్టు న్యాయమూర్తి షమీమ్ అక్తర్ మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులు సత్వర పరిష్కారానికి న్యాయవాదులు సహకరించాలని కోరారు. పోక్సో చట్టం ప్రధాన ఉద్దేశం లైంగిక నేరాల నుంచి బాలలను కాపాడి, బాధితులకు సత్వర న్యాయం అందించడమేనన్నారు.
18ఏండ్ల లోపు బాల,బాలికలపై లైంగిక నేరాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేందుకు పోక్సో చట్టం ఆయుధంగా ఉపయోగపడుతుందన్నారు. న్యాయవాదులు, న్యాయమూర్తులు సమన్వయంతో కేసులను పరిష్కరించాలని సూచించారు. సిరిసిల్ల జిల్లాలో సుమారు 200 పోక్సోకేసులు పెండింగ్‌లో ఉన్నయన్నారు. గతేడాది సిరిసిల్ల జిల్లాలో పోక్సో కోర్టు మంజూరు కాగా, కరోనా కారణంగా ఏర్పాటులో జాప్యం జరిగిందన్నారు. పోక్సో కేసుల్లో చిన్నారులు, సాక్షులు భయపడకుండా సాక్ష్యం చెప్పాలన్నారు. హైకోర్టు జడ్జి నవీన్‌రావు వర్చువల్‌గా నిర్వహించిన కార్యక్రమంలో హైదరాబాద్ నుంచి మాట్లాడుతూ పోక్సో కోర్టు ఏర్పాటు న్యాయవ్యవస్థలో మరో ముందడుగుగా అభివర్ణించారు. కార్యక్రమంలో కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహు ల్ హెగ్డే, తెలంగాణ బార్‌కౌన్సిల్ సభ్యుడు కే లక్ష్మణ్‌కుమార్, సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వసంతం,న్యాయవాదులు పాల్గొన్నారు.