ఇల్లందకుంట, సెప్టెంబర్ 6: బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు ఓటమి భయం పట్టుకున్నదని, అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నాలుగు వేల డబుల్బెడ్రూం ఇళ్లు మంజూరు చేస్తే ఒక్కటి కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు. ఇల్లందకుంట మండల కేంద్రంలో సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని, మొన్నటికి మొన్న దళితబంధుపై విషం కక్కాడని, తనపై నోరు జారాడని, ఇలాంటి నాయకుడు గెలిస్తే నిజంగా దళితులకు ఏమన్నా చేస్తాడా? అని ప్రశ్నించారు. బడుగు, బలహీన వర్గాలంటేనే ఈటలకు ఎలర్జీ అని, ఇప్పుడు ఓట్ల కోసం అందరినీ కలుసుకుంటూ తిరుగుతున్నాడని మండిపడ్డారు. గెలిస్తే మళ్లీ ఎలక్షన్ల దాకా ఎవరి మొహం చూడడని తెలిపారు. తన అక్రమాస్తులను కాపాడుకునేందుకు తన భావ జాలాన్ని కూడా పకన పెట్టి బీజేపీలో చేరాడని ఆరోపించారు. ఎంతో ఆదరించి మంత్రి పదవి ఇచ్చి గౌరవించిన కేసీఆర్‌కే సున్నం బెట్టాలని చూసిన మోసకారి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మాయ మాటలు నమ్మితే ఎప్పటి చిప్ప ఎనుగులనే ఉంటదని సూచించారు. అధికార పార్టీలో పదవిలో ఉండి హుజూరాబాద్‌కు ఏం చేయలేని ఆయన, ఇప్పుడేం చేస్తాడని అని ప్రశ్నించారు.
ఆయన బామ్మర్ది దళిత బిడ్డలను తిట్టింది చూశామని, ఆయన కొడుకు భూమి కోసం దళిత మహిళను బెదిరించింది విన్నామని, ఈ రోజు ఆయన దళిత ఎమ్మెల్యేలను పరుష పదజాలంతో తిట్టింది చూశామని, వేల కోట్లు ఉన్నాయనే అహంకారంతో ఇలా ప్రవర్తిస్తున్నాడని ధ్వజమెత్తారు. ఆయన అహంకారాన్ని హుజూరాబాద్ దళిత బిడ్డలే బొంద పెడుతారని హెచ్చరించారు. 2018లో టీఆర్ఎస్లో ఉండి చొప్పదండిలో తనను ఓడించడానికి ఎంత డబ్బులు పంపించాడో ప్రజలందరికీ తెలుసు అని, అందుకే ఆయన భాగోతం మొత్తం సీఎం కేసీఆర్‌కు అర్థమయ్యే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారని మండిపడ్డారు. కన్న తల్లి లాంటి పార్టీని మోసం చేసిన ఆయన, రేపు బీజేపీని కూడా నాశనం చేస్తాడని, అందుకే ఆయనకు ఆ పార్టీ సపోర్ట్ లేదని తెలిపారు. దళితులను తిట్టిన ఈటల నాశనమైపోతాడని శాపనార్థాలు పెట్టారు. ఎంపీటీసీలు సంజీవరెడ్డి, విజయ్‌కుమార్, చిన్నరాయుడు, మాజీ ఎంపీటీసీ రాంస్వరణ్‌రెడ్డి, సిరిసేడు సర్పంచ్ రఫీఖాన్, టీఆర్ఎస్ నాయకులు సరిగొమ్ముల వెంకటేశ్, అనిల్, తిరుపతి పాల్గొన్నారు.