జమ్మికుంట/హుజూరాబాద్ టౌన్, అక్టోబర్10: హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నిక శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ తెలిపారు. ఆదివారం ఆయన హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 163, 164, 170, 171పోలింగ్ కేంద్రాలను, ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్, స్ట్రాంగ్ రూంలను , జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సత్యనారాయణలతో కలిసి పరిశీలించారు. అధికారుల ఏర్పాట్లపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత సీఈవో మాట్లాడారు. పోలింగ్ కేంద్రాలన్నీ ఒకే దారిలో ఉన్నందున ఓటర్లు క్రమ పద్ధతిలో నియంత్రించాలని సూచించారు. కొవిడ్ నిబంధనలు తప్పని సరిగా పాటించాలని, మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఉప ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిందని, ఉపసంహరణ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని చెప్పారు.
ఈ నెల 30న పోలింగ్ ముగిసేంత వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అధికారులు కచ్చితంగా అమలు చేస్తారని స్పష్టం చేశారు. సభలు, సమావేశాలకు ఆర్వో నుంచి అనుమతులు తీసుకోవాలని చెప్పారు. అందరూ రెండు డోసుల వ్యాక్సినేషన్ తీసుకోవాలని, ఇందుకోసం వ్యాక్సినేషన్ కేంద్రాలను విరివిగా ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, వీఎస్టీ, వీవీటీ బృందాలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. కటాఫ్ తేదీ వరకు ఓటర్లుగా నమోదు అయ్యేందుకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఓటు వేసే అవకాశం ఉంటుందని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా ఉండేందుకు, ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని చెప్పారు. కేంద్ర పోలీస్, పారా మిలటరీ, బలగాలను వినియోగిస్తున్నామని తెలిపారు. ప్రచారంలో రాజకీయ పార్టీలు అభ్యర్థులు పెట్టే ఖర్చులపై సాధారణ పరిశీలకులు, పోలీస్ పరిశీలకులు, ఎక్స్పెండీచర్ పరిశీలకుల నిఘా ఉంటుందని అన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఇక్కడ అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్, గరీమా అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, హుజూరాబాద్ ఆర్వో రవీందర్‌రెడ్డి, ఏసీపీ వెంకట్‌రెడ్డి, నోడల్ అధికారులు, తదితరులున్నారు.