కమలాపూర్, అక్టోబర్ 12: మొన్న ఉప్పల్ క్రాస్‌రోడ్డు వద్ద ఆటోను ఢీకొట్టిన కారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దోస్తుదైతే.. టీఆర్ఎస్పై బట్టకాల్చి మీదేయడం ఎందుకని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం మండలంలోని వంగపల్లిలో ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ సతీమణి శ్వేతతో కలిసి ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదానికి కారణం బీజేపీ నాయకులైనప్పటికీ.. ఈటల రాజేందర్, వివేక్, జితేందర్‌రెడ్డి రోడ్డుపై ధర్నా పేరిట ఐదు గంటల పాటు హంగామా చేశారంటూ మండిపడ్డారు. కారుతో ఆటోను ఢీకొట్టింది బండి సంజయ్ దోస్తుదని చెప్పకుండా, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచరులదంటూ దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. కారులో ఎన్ని డబ్బులు ఉన్నాయో? వారే చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకుల కుట్రలను ప్రజలు గమనించాలని.. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని కోరారు.
బీజేపీ ఏం చేసిందని ఓటెయ్యాలి
‘బీజేపీ ఏం చేసిందని ఓటెయ్యాలి.. పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినందుకా? అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రశ్నించారు. మంత్రిగా ఉండి పనులు చేయని ఈటల.. ఇప్పుడు గెలిస్తే ఏం చేస్తడో ప్రజలు ఆలోచించాలన్నారు. దళితుల భూములు కబ్జా చేసిన ఈటలను పార్టీలో ఎలా చేర్చుకున్నడో ప్రజలకు బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. బండి సంజయ్ ఎంపీగా గెలిచి రెండున్నరేండ్లయినా నియోజకవర్గంలో ఒక్క రూపాయి పని కూడా చేయలేదన్నారు. ఎన్నికలో గెలిచేందుకు బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మరని, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సర్పంచ్ పోడేటి కమలమ్మ, ఎంపీటీసీ రామస్వామి, విండో చైర్మన్ సంపత్‌రావు, డైరెక్టర్ సత్యనారాయణరావు, కేడీసీసీబీ డైరెక్టర్ కృష్ణప్రసాద్, నాయకులు అశోక్, సాంబయ్య, సదానందం, రమేశ్‌రెడ్డి ఉన్నారు.