మార్కెట్ స్థితిగతుల ఆధారంగా యూనిట్లను ఎంచుకోవాలి
చివరి లబ్ధిదారుడి వరకూ దళిత బంధు కొనసాగింపు
కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు
ఉన్నత స్థితికి ఎదగాలి: కలెక్టర్ రవి
మెట్పల్లి రూరల్, ఫిబ్రవరి 24: దేశంలో ఏ రా ష్ట్రంలో కూడా ‘దళితబంధు’ లేదని, దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని తెలంగాణలో అమలు చేస్తున్నారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు స్పష్టం చేశారు. కోరుట్ల నియోజకవర్గ పరిధిలోని దళితబంధు పథకం లబ్ధిదారులకు దళిత బంధు యూనిట్ల ఎంపికపై మెట్పల్లి మండలం వెల్లుల్ల శివారులోని వీఆర్ఎం ఫంక్షన్హాల్లో గురువారం నిర్వహించిన అవగాహన సమావేశంలో కలెక్టర్ రవితో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొదటి విడుతలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి పైలెట్ ప్రాజెక్టు కింద వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలిపారు. మార్చిలో ప్రవేశపెట్టే బడ్జెట్లో ఈ పథకానికి రూ. 20 వేల కోట్లకు పైగా నిధులు కేటాయిస్తారని, అప్పుడు నియోజకవర్గానికి రెండువేల మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పారు. పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన లబ్ధిదారులు పథకాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని కోరారు. మార్కెట్ స్థితిగతులకు అనుగుణంగా యూనిట్లను ఎంపిక చేసుకోవాలని, రానున్న రెండేళ్లలో రెండింతలు సంపాదించే దిశగా ప్రణాళిక రూపొందించుకోవాలని పేర్కొన్నారు. సూచిం చారు. అంతకు ముందు కలెక్టర్ రవి మాట్లాడు తూ, ఈ పథకం ద్వారా దళితులు ఆర్థికంగా ఎదగాలని తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక సమయంలో వారికి ఆసక్తి ఉన్న యూనిట్ల వివరాలను సైతం సేకరించామన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న యూనిట్లను ఎంపిక చేసుకోవాలని సూచించారు. సమావేశంలో మెట్పల్లి ఆర్డీవో వినోద్‌కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ లక్ష్మీనారాయణ, ఎంపీపీలు మారు సాయిరెడ్డి, తోట నారాయణ, కాటిపెల్లి సరోజ, జాజాల భీమేశ్వరి ఉన్నారు.