మంగళవారం 09 మార్చి 2021
Kamareddy - Dec 27, 2020 , 00:57:07

అర్హులకే డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు

అర్హులకే డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు

పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక

స్పష్టం చేసిన ఎంపీపీ, నాయకులు

కామారెడ్డి టౌన్‌: కామారెడ్డి మండలంలోని లింగాయపల్లి గ్రామంలో శుక్రవారం రాష్ట్ర మంత్రులు వేముల ప్రశాంత్‌ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ప్రారంభించిన 40 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను అర్హులకే పంపిణీ చేశామని కామారెడ్డి ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, వైస్‌ ఎంపీపీ కురుదొండ నరేశ్‌ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇండ్లను అనర్హులకు కేటాయించారని కొందరు మహిళలు, ప్రతిపక్ష నాయకులు ఆందోళన చేయడం శోచనీమన్నారు. ఇండ్ల కోసం 125 మంది దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్‌, గిర్దావర్లు సమగ్ర విచారణ చేపట్టి 56 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారని తెలిపారు. ఇందులో మొదటి విడుతగా 40 మందికి ఇండ్లు అందజేసినట్లు చెప్పారు. 21 దళిత కుటుంబాలతోపాటు బీసీ, మైనారిటీ పేద కుటుంబాలకు డ్రా పద్ధతిలో కేటాయించినట్లు వివరించారు. మిగతా లబ్ధిదారులకు రెండో విడుతలో పంపిణీ చేస్తామన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని హంగులతో ఇండ్లను నిర్మించి అందజేశామని తెలిపారు. గ్రామానికి చెందిన భూరెడ్డి బాలమణి, శ్యామల తదితర మహిళలు దరఖాస్తు చేసుకోగా.. విచారణలో వారికి సొంత ఇండ్లు, భూములు ఉన్నట్లు గుర్తించి దరఖాస్తులను తిరస్కరించినట్లు స్పష్టం చేశారు. దీనిని జీర్ణించుకోలేని బాలమణి తదితరులు ఆందోళన చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను పారదర్శకంగా, అందరి సమక్షంలో డ్రా పద్ధతిలో ఎంపిక చేసిన అర్హులకే అందజేస్తున్నామని తెలిపారు. సమావేశంలో కామారెడ్డి మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ గట్టగోని గోపీగౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు బలవంత్‌రావు, రవి, అంజల్‌రెడ్డి, లింగం, స్వామి, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo