సోమవారం 25 మే 2020
Kamareddy - May 24, 2020 , 01:43:47

కల్లాల వద్దే పంటకు డిమాండ్‌ ధర..

కల్లాల వద్దే పంటకు డిమాండ్‌ ధర..

ఇదే లాభసాటి వ్యవసాయ విధానం 

వానకాలం సాగు విస్తీర్ణంలో మార్పులేదు

జిల్లాలో కరోనా కట్టడిలోనే ఉంది

విలేకరుల సమావేశంలో మంత్రి   ప్రశాంత్‌రెడ్డి

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ: నూతన వ్యవసాయ విధానం ద్వారా కల్లాల వద్దే పంటలకు డిమాండ్‌ ధర వచ్చి కొనుగోలు చేసేలా చేస్తామని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. శనివారం కలెక్టర్‌ నారాయణరెడ్డి చాంబర్‌లో.. అర్బన్‌, రూరల్‌ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌, జడ్పీ చైర్మన్‌ దాదాన్నగారి విఠల్‌రావు, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ మార గంగారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షురాలు మంజుల, డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం ప్రగతిభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. వానకాలం సీజన్‌ యాక్షన్‌ప్లాన్‌లోని విస్తీర్ణాన్ని ఏమాత్రం తగ్గించలేదని, ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా పంటల విస్తీర్ణాన్ని డిమాండ్‌ మేరకు వేసుకునేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. త్వరలో నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో సమావేశాలు  నిర్వహించి రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు.

కంట్రోల్‌లో.. కరోనా 

జిల్లాలో కరోనా కంట్రోల్‌లోనే ఉందని మంత్రి తెలిపారు. ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం, అత్యవసర సేవల సిబ్బంది సమన్వయంతో పనిచేసి కరోనా రహిత జిల్లాగా మార్చినందుకు వారిని అభినందించారు. ఇతర జిల్లాలు, రాష్ర్టాల నుంచి వచ్చిన వలస కూలీలతో అప్రమత్తంగా ఉండాలన్నారు.  ఇప్పటి వరకు మొత్తం 4,747 మందిని హోం క్వారంటైన్‌ చేశామన్నారు. ఇతర దేశాల నుంచి జిల్లాకు వస్తున్న వారికి హైదరాబాద్‌లో పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్‌ వచ్చిందని, వీరిని గాంధీకి తరలించినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 5.54 లక్షల మెట్రిక్‌ టన్నుల లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 85 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు.  జిల్లాలోని పసుపు రైతుల కోసం నిజామాబాద్‌ మార్కెట్‌ యా ర్డును రెండు మూడు రోజుల్లో తెరవనున్నామని  తెలిపారు.  రైతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తాను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు.


logo