e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, May 12, 2021
Home బతుకమ్మ చేనేత చీరకు సారె

చేనేత చీరకు సారె

చేనేత చీరకు సారె

‘అమ్మ చీరనే కట్టే పాప జ్ఞాపకం..’ ఎంత అందమైన భావనో కదా! కానీ, అమ్మకు చీర కట్టుకునే అలవాటు లేకపోతే? ఆ కూతురికి ఇంత అందమైన జ్ఞాపకం దొరుకుతుందా? ఆ కూతురు కూతురికి చీర సంగతి తెలుస్తుందా! ఆ కూతురి కూతురు తరం వచ్చేసరికి చీర ఉంటుందా! వాటినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న నేతన్నల మాటేమిటి? కట్టుబొట్టులపై ఆధారపడిన మన భారతీయ సంస్కృతి పరిస్థితి ఏమిటి?ఈ దుస్థితి దాపురించొద్దనే ‘శారీ రివైవల్‌’ ఉద్యమం పుట్టుకొచ్చింది. చీరల గొప్పదనాన్ని చాటి చెబుతూ, చేనేత కళకు పెద్దపీట వేస్తూ,  సరికొత్త చీరలకు పురుడు పోస్తున్నారు ఫ్యాషన్‌ డిజైనర్లు, ఆంత్రప్రెన్యూర్లు. కుచ్చిళ్ల నుంచి కొంగు చివరి వరకు వినూత్నంగా ఆవిష్కరించేలా నేతన్నలను ప్రోత్సహిస్తున్నారు. ఎన్నో కళల కల నేతను నేటి వన్నెల రాసికి సరి జోతగా మారుస్తున్నారు చేనేత కళాకారులు. ఆ తరం అపురూప శైలులను ఒడిసి పట్టి చీరలపై కళాత్మంగా చిత్రించి ఈ తరానికి కానుకగా సమర్పిస్తున్నారు.

చీరంటే వార్డ్‌రోబ్‌లో ఓ మూలన పడేసే వస్తువుకింద జమైంది. పండుగలు, పబ్బాలకు అందాన్నిచ్చే చీరలు మిగతా సమయాల్లో అడ్డుతగులుతున్నాయనే భావన ఈ తరం ఆడపడుచుది. కానీ, అలవాటైతే చీరకట్టును మించిన సౌకర్యం లేదనిపిస్తుంది. మేని సౌందర్యాన్ని మేటిగా చూపించే ఏకైక వస్త్ర శ్రేణి చీర. అందాన్ని సగౌరవంగా రెట్టింపు చేసే దివ్య వస్త్రం ఇది. ఒక చీరను తీర్చిదిద్దడం వెనుక ఎందరో కళాకారుల శ్రమ దాగి ఉంటుంది. రంగులు అద్దడం, కుట్లు అల్లికలతో ఎంబ్రాయిడరీ వర్క్‌, సంస్కృతి ఉట్టిపడే పెయింటింగ్స్‌ వంటి వాటితో చీరనే క్యాన్వాస్‌గా మలుచుకొని తమ కళనంతా కుమ్మరించేస్తారు. కానీ, చీరలకు ఆదరణ తగ్గిపోవడంతో మగ్గాల సడుగులిరిగినంత పని అవుతున్నది. ఆదరించే వారు లేక నేతన్నల కౌశలం మృగ్యమవుతున్నది. ఇదిలాగే కొనసాగితే శతాబ్దాల చరిత్ర ఉన్న సంప్రదాయ చీరలను మ్యూజియంలో చూడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఈ ప్రమాదాన్ని గ్రహించిన కొందరు డిజైనర్లు, ఆంత్రప్రెన్యూర్లు ‘శారీ రివైవల్‌’ ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. కొత్త చీరకు పురాతన హంగులు అద్దుతూ ఆ పాతదనంలోని గొప్పదనాన్ని చాటిచెబుతున్నారు. పల్లెల్లోని నేతన్నలకు పని కల్పిస్తూనే చేనేతకు జీవం పోస్తున్నారు. 

శారీ.. రోజుకోసారి

చీరంటే ప్రత్యేక సందర్భాల్లోనే కట్టుకునే రోజులు వచ్చాయి. కానీ, దైనందిన జీవితంలో చీర భాగం కావాలని అంటారు ‘సిక్స్‌ యార్డ్స్‌ ప్లస్‌’ స్టార్టప్‌తో ‘శారీ రివైవల్‌’ కోసం పాటుపడుతున్న హైదరాబాదీ మృణాళిని శాస్త్రి. రెగ్యులర్‌ వేర్‌లో చీరకు చోటు కల్పించినప్పుడే చేనేత కార్మికులకు చేతినిండా పని దొరుకుతుందని చెబుతారు ఆమె. ఉరుకుల పరుగుల జీవితాల్లో చీరతో అయితే కష్టం అనుకుంటారేమో! కానీ, ఏ పనిలోనూ చీరకట్టు అడ్డుకాదు. గతంలో మందిరాబేడి, అదాశర్మ చీరలోనే వర్కవుట్లు చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. అలాగని ఇరవైనాలుగు గంటలు చీరలోనే ఉండాలని కాదు. కానీ, చీరను ఆదరిస్తే దాని వెనుక కొన్ని వందల కుటుంబాలు బాగుపడతాయన్న స్పృహ కలగాలని అంటారు మృణాళిని శాస్త్రి. ఈ తరం తరుణులను ఆకర్షించే విధంగా కొత్తకొత్త డిజైన్లలో చీరలను నేస్తున్నారు నేతన్నలు. పలువురు ఆంత్రప్రెన్యూర్లు, ఫ్యాషన్‌ డిజైనర్ల సహకారంతో సంప్రదాయ చీరలకు కొత్త సొబగులు అద్దుతున్నారు. మామూలు సాధారణ చీరలపై ఎంబ్రాయిడరీ, వర్క్‌ శారీస్‌, చేర్యాల నకాషీ చిత్తరువులను కూడా పరిచి కొంగొత్తగా పరిచయం చేస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నీ చీరలకు పూర్వవైభవం తెచ్చేందుకే!

మార్చాల్సిన తరుణమిది

‘గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్‌’ అంటారు. ఈ నానుడిని సూత్రంగా ఎంచుకొని ‘శారీ రివైవల్‌’కు కృషి చేస్తున్నారు చేనేత కార్మికులు. బనారస్‌, కంజీవరం, ధర్మవరం లాంటి పట్టుచీరలను పెండ్లిళ్లు, పండుగల సందర్భాల్లో కొంటారు. ఎంత ఇష్టమైన పట్టుచీరైనా రెగ్యులర్‌గా ధరించరు. రోజువారీ వస్త్రధారణలో సాధారణ నేత చీరలకే ప్రాధాన్యం ఇస్తారు అతివలు. వాటికి ఉండే డిమాండ్‌ ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఎటొచ్చీ రెగ్యులర్‌ వస్త్రధారణలో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. చీరలకన్నా ఇతర వస్త్రశ్రేణికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అందుకే రెగ్యులర్‌ వేర్‌ శారీలకు కొత్తహంగులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు డిజైనర్లు. ఉదాహరణకు నారాయణపేట చీరలు రోజూ ధరించడానికి బాగుంటాయి. వీటి ధర కూడా తక్కువే. ఎవరైనా కొనగలరు. ఈ చీరలకు ఆదరణ కల్పించడానికి కొత్త డిజైన్లతో తీర్చిదిద్దుతున్నారు నేతన్నలు. ఇదే తరహాలో మంగళగిరి, గొల్లభామ, ఇక్కత్‌, ఉడుపి, కలంకారీ, కోటా, పొందూర్‌ వంటి చేనేత చీరల తీరుతెన్నులు కూడా మారాల్సిన అవసరం ఉందంటున్నారు ఫ్యాషన్‌ డిజైనర్లు. అయితే, ఆధునిక పోకడలపై నేతన్నలకు అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఈ తరహా మార్పులు చేయగలరు.

ఆ రాజసం ఎక్కడ?

డిమాండ్‌ ఉన్నప్పుడే ఏ కళైనా రాణిస్తుంది. చీరలకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. ఇప్పటికిప్పుడు చీరలకు వచ్చిన ముప్పేం లేకపోయినా, ఈ నిర్లిప్త ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఇక్కట్లు తప్పకపోవచ్చు. ఇలాంటి కారణాల వల్లే మన దేశానికి సొంతమైన ఎన్నో కళలు కనిపించకుండా పోయాయి. చేనేత రంగంలోనూ ఒకప్పుడు రాజ్యమేలిన కొన్ని రకాల చీరలు ఇప్పుడు దాదాపు కనుమరుగయ్యాయి. గద్వాల చీరలు ఆ కోవకే చెందుతాయి. గద్వాల చీరలంటే సాదాసీదాగా ఉంటూనే రాజసాన్ని ప్రదర్శించేవి. చీరంతా కాటన్‌తో నేసి, పట్టుతో బార్డర్‌ అటాచ్‌ చేసేవారు. ఇప్పుడు అలాంటి చీరలు నేయడం బాగా తగ్గిపోయింది. కాటన్‌ శారీకి సిల్క్‌ బార్డర్‌ని ఇంటర్‌లాక్‌ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ నేర్పు కొద్దిమంది కళాకారులకు మాత్రమే ఉంటుంది. చీర చివరన ఉన్న కాటన్‌ దారాలకు, సిల్క్‌ పోగులను పొయ్యిలోని బూడిదతో ఓ పద్ధతిలో ఇంటర్‌లాక్‌ చేసేవారు. అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. భార్యాభర్తలు చీరను నేస్తే, ఇంట్లో ఉండే పెద్దమనుషులు చీర, బార్డర్‌ ఇంటర్‌లాక్‌ చేసేవారు. కానీ, శ్రమాధిక్యం కావడం, అందుకు తగ్గ ఆదాయం రాకపోవడంతో చాలామంది ఈ విధానానికి స్వస్తిపలికారు. నేతన్నలకు ఊతమిచ్చి ప్రోత్సహిస్తే గద్వాల చీర పూర్వవైభవాన్ని సంతరించుకుంటుంది అనడంలో సందేహం లేదు.

ఇక్కత్‌ మరింత చక్కగా..

‘శారీ రివైవల్‌’కు అవకాశం ఉన్న మరో రకం ఇక్కత్‌. తెలంగాణలోని చేనేత కార్మికుల పనితనానికి ఉదాహరణ ఇక్కత్‌ చీరలు. పవర్‌లూమ్స్‌పైనా ఇక్కత్‌ శారీలు నేస్తుంటారు. వార్ప్‌ (నిలువు) రకం మాత్రమే పవర్‌లూమ్స్‌పై తయారవుతాయి. కానీ, వెఫ్ట్‌ (అడ్డం) ఇక్కత్‌ హ్యాండ్‌లూమ్‌ మీదే చేయాల్సి ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇక్కత్‌ చీరలు ధరిస్తే ఒకప్పుడు గొప్పగా చూసేవారు. ఈ కాలం మహిళలు వాటిని ధరించడానికి పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. ఇక్కత్‌ శారీల్లో పోచంపల్లి డిజైన్లు ట్రేడ్‌ మార్కు. రివైవల్‌ పేరుతో డిజైన్ల మార్పు మేలు చేయదు. అందుకే, కలర్‌ కాంబినేషన్ల మీద దృష్టి సారిస్తున్నారు డిజైనర్లు. మూస రంగులు కాకుండా డిఫరెంట్‌ కలర్‌ కాంబినేషన్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదే పద్ధతిని నారాయణపేట చీరల్లోనూ పాటిస్తున్నారు. ఒకప్పుడు అందరినీ అలరించిన గళ్లు, రుద్రాక్షల డిజైన్లు వేయించి నారాయణపేట చీరలను తీర్చిదిద్దుతున్నారు.

మార్పుతోనే మనుగడ: ‘నెసెసిటీ ఈజ్‌ మదర్‌ ఆఫ్‌ ఇన్వెన్షన్‌’ అంటారు. మనుగడ కష్టసాధ్యమైనప్పుడే ఎలా బతకాలన్న ఆలోచన వస్తుంది. అందులో నుంచే సృజనాత్మకత వెలుగు చూస్తుంది. ఇప్పుడు చేనేత రంగం అలాంటి దశకు చేరుకుంది. పవర్‌ హ్యాండ్లూమ్స్‌ రాజ్యమేలుతున్న వేళ తమ పూర్వీకుల నుంచి వంశపారంపర్యంగా వచ్చిన చేనేత కళకు మరింత పదును పెడుతున్నారు. కలర్‌ కాంబినేషన్లు మొదలు డిజైన్ల వరకు కొత్తపంథాను అనుసరిస్తున్నారు. అదే సమయంలో తాతల నాటి డిజైన్లకు కొత్తరూపునిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ప్రభుత్వ సహకారం, పలు స్వచ్ఛంద సంస్థలు, ఆంత్రప్రెన్యూర్ల తోడ్పాటుతో చేనేత రంగం పూర్వవైభవం దిశగా కొనసాగుతున్నది. మహిళాలోకం చీరలకు మద్దతుగా నిలిచినప్పుడే వారి ఆశయం పూర్తిస్థాయిలో నెరవేరుతుంది. చీరలను మనస్ఫూర్తిగా హత్తుకున్నప్పుడే నేతన్నల కష్టాలు తీరుతాయి.

చీర గొప్పదనం చెప్పాలి

“నేత చీర దర్పాన్ని ప్రదర్శిస్తుంది, సహజంగా కనిపిస్తుంది. ఆఫీసుకు వెళ్లేటప్పుడు ధరించొచ్చు. ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు కట్టుకోవచ్చు. ఏ సందర్భానికైనా చేనేత చీర సెట్‌ అవుతుంది. కానీ, ఈ మధ్య చాలామంది చేనేత చీరకు దూరమవుతున్నారు. చీరను తక్కువగా చూసే దృష్టి మారాలి. అందులో గొప్పదనాన్ని గుర్తించే మనసు ఉండాలి. చీర గొప్పదనాన్ని పిల్లలకు తల్లులు చెప్పాలి. మన దగ్గర చీరకట్టు ఒకేరకంగా ఉండదు. పొలం పనులకు వెళ్లేటప్పుడు ఒకలా కట్టుకుంటారు. పూజలు చేసే సమయంలో మరో రకంగా ధరిస్తారు. పెండ్లి వంటి వేడుకల్లో కాస్త ట్రెండీగా కట్టుకుంటారు. ఇలా ఒక్కో సందర్భానికి ఒక్కోరకం కట్టుతో అలరిస్తారు. ఈ విషయాలను మన పిల్లలకు చెప్పినప్పుడే వారికి చీరపై ఆసక్తి కలుగుతుంది. మరో తరానికి ఆ చీర గొప్పదనం చేరుతుంది. చేనేత కళాకారుల నైపుణ్యం, గొప్పదనాన్ని పిల్లలకు తెలియజేయాలి. అలా చిన్నాపెద్దా అందరూ చీరతో అనుబంధాన్ని పెంచుకోవాలి. వీటన్నిటికన్నా ముఖ్యంగా చీర గొప్పదనం భవిష్యత్‌ తరాలకు చేరాలంటే వాటిని రివైవల్‌ చేయక తప్పదు. సరికొత్త డిజైన్లతో ఈ తరాన్ని ఆకర్షించగలిగితే చీరలకు ఆదరణ పెరుగుతుంది. తద్వారా నేతన్నలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ‘శారీ రివైవల్‌’ ప్రణాళికతో చేనేత కళాకారులకు నిరంతరం పని కల్పించే ఉద్దేశంతో 2017లో ‘సిక్స్‌ యార్డ్స్‌ ప్లస్‌’ ప్రారంభించాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు పశ్చిమ్‌ బెంగాల్‌, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ర్టాల్లోనూ క్లస్టర్లు ఏర్పాటు చేశాం. ఇప్పుడు మా ప్రాజెక్ట్‌ ఈవ్‌ స్టోర్స్‌ హైదరాబాద్‌, బెంగళూరులో ఉన్నాయి. అలాగే, ఎక్కువ శాతం చీరలను వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నాం.”

–  మృణాళిని శాస్త్రి, ‘సిక్స్‌ యార్డ్స్‌ ప్లస్‌’ స్థాపకురాలు

వీడియోలు చిత్రీకరించి..

చేనేత కార్మికుల నైపుణ్యానికి అవకాశం ఇస్తూ చీరల్లో వైవిధ్యాన్ని తీసుకొచ్చేందుకు పుట్టిన స్టార్టప్‌ ‘ఇండెలూమ్‌’. ‘మేకర్‌ టు మార్కెట్‌’ కాన్సెప్ట్‌తో 2018లో ఈ కంపెనీని హైదరాబాద్‌కు చెందిన సంధ్య తన భర్త సురేన్‌తో కలిసి ప్రారంభించారు. ‘శారీ రివైవల్‌’లో భాగంగా వీరు ఎంచుకున్న పంథా ‘స్లో ఫ్యాషన్‌’. ఈ తరహా ఫ్యాషన్‌ని ఇష్టపడే మహిళలే టార్గెట్‌గా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో చీరలను విక్రయిస్తుంటారు వీళ్లు. అనతి కాలంలోనే విదేశాల నుంచి కూడా ఆర్డర్లు పొందారు. సాఫ్ట్‌ కాటన్‌, నేచురల్‌ ఫైబర్‌తో చీరలను నేయిస్తున్నారు. వీరి నెట్‌వర్క్‌లో 40 మంది రీసెల్లర్స్‌తో స్టార్టప్‌ కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌, విజయవాడ, కొచ్చి, ఢిల్లీ వంటి నగరాలతోపాటు యూఎస్‌, యూకే, పోలాండ్‌ దేశాల్లోనూ బొటిక్స్‌ ఉన్నాయి. ‘శారీ రివైవల్‌’లో భాగంగా కలర్‌ కాంబినేషన్లు, పూల డిజైన్లతో ప్రయోగాలు చేస్తున్నారు. అయితే, సంప్రదాయ డిజైన్ల జోలికి వెళ్లం అంటారు సంధ్య. ‘చీరలు నేయడం అనుకున్నంత తేలిక కాదు. నేతన్నల కష్టం తెలియజేయాలనే ఉద్దేశంతో మగ్గంపై చీరను నేస్తున్నప్పుడు వీడియో చిత్రీకరించి దానిని సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తున్నాం. దీనివల్ల పనిలో వారు చూపే నైపుణ్యం, పడే శ్రమ ప్రపంచానికి తెలుస్తుంది. మేం ప్యూర్‌ ఆర్గాంజా సిల్క్‌, హ్యాండ్‌ పెయింటింగ్స్‌ వాడుతున్నాం. ఒక్కో చీరకు రెండు మూడు నెలల టైం తీసుకుంటాం. అంతేకాదు, కొన్ని చీరలను రెండొందల గ్రాముల కంటే తక్కువ బరువుతో తయారు చేయిస్తాం’ అంటారు సంధ్య. పోచంపల్లి, శ్రీకాళహస్తితోపాటు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌కు చెందిన నేత కార్మికులతో చీరలు నేయిస్తున్నారు. అంతేకాదు, నేతన్నల కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను వారికి చేరవేస్తున్నారు. అలాగే లాభాల్లో సింహభాగాన్ని నేతన్నలకే అందిస్తున్నారు.

చేనేత చీరకు సారె

కట్టుకుంటేనే భవిష్యత్తు

చీరలకు పూర్వ వైభవం రావాలంటే పాతతరం రంగులు, డిజైన్లను కొనసాగిస్తూనే కొన్నిరకాల ప్రయోగాలు చేయాలి. ఇందులో భాగంగా ఇక్కత్‌, గ్రాండ్‌ కంచి, పఠాన్‌ వీవ్స్‌, కోటా, వెంకటగిరి, పైతానీ వంటి చీరల తయారీలో జమ్‌దానీ టెక్నిక్‌ని ఉపయోగిస్తున్నాం. అలాగే మా ‘తారామతి’ శారీ కలెక్షన్స్‌లో సిల్క్‌ దారాలతో పాటు బంగారం, వెండి పోగులను ఎన్నో రకాల టెక్నిక్స్‌ ఉపయోగించి తయారు చేస్తున్నాం. నేను టెక్స్‌టైల్‌ రంగంలోకి వచ్చినప్పుడు జమ్‌దానీ డిజైన్స్‌లో నైపుణ్యం ఉన్నవాళ్లను పట్టుకోవడానికి చాలా కష్టపడ్డాను. తర్వాత కొంతమంది దొరికితే వాళ్లతో ఇంకొందరికి ట్రైనింగ్‌ ఇప్పించాం. ప్రస్తుతం మా దగ్గర 800మంది చేనేత కళాకారులు పని చేస్తున్నారు. వాళ్లకు ఏడాదికి 365రోజులు పని కల్పిస్తున్నందుకు సంతోషంగా ఉంది. అయితే, ఇదే వృత్తిని నమ్ముకున్నవాళ్లు మన దేశంలో కొన్ని లక్షలమంది ఉంటారు. వాళ్లందరికీ పని దొరకాలంటే ఈ తరం అమ్మాయిలు చీరల గొప్పతనాన్ని తెలుసుకోవాలి. చేనేత చీరలను కట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే నేత కళాకారులకు ఉపాధి లభిస్తుంది. తర్వాతి తరం కూడా వృత్తిని కొనసాగిస్తుంది.

– గౌరంగ్‌షా, ప్రముఖ టెక్స్‌టైల్‌ డిజైనర్‌

శారీ మారథాన్‌

చేనేత చీరకు సారెచీరకు పునరుజ్జీవం అంటే విక్రయాలు పెరగడం కాదు. చేనేత చీరకు ఆదరణ పెరగాలి. కళాకారులకు ఉపాధి దొరకాలి. అదే నిజమైన రివైవల్‌. 2015లో స్థాపించిన అభిహార సంస్థ ద్వారా ‘శారీ రివైవల్‌’కు కృషి చేస్తున్నాను. ఈ క్రమంలో తెలంగాణ గొల్లభామ చీరల్లో జాల టెక్నిక్‌ (చీపురుపుల్ల లాంటి పుల్లతో చేసే పని)ని ఉపయోగిస్తున్నాం. నారాయణపేట చీరల్లో ట్రెడిషనల్‌ వెరైటీలను వెలుగులోకి తెస్తున్నాం. నారాయణపేట చీరలను రూ.850 నుంచి రూ.1200 ధరల్లోనే విక్రయిస్తున్నాం. రెండేండ్ల కిందట యాక్టర్‌ కమ్‌ మోడల్‌ మిలింద్‌ సోమన్‌ ఆధ్వర్యంలో కొంతమంది మహిళలకు నారాయణపేట చీరలను కట్టించి మారథాన్‌ నిర్వహించాం. కేవలం పాతతరం డిజైన్లనే కాదు.. చింతపిక్క, గచ్చకాయ, అగ్గిపెట్టె వంటి అమ్మమ్మ కాలంలో వాడిన రంగులనూ మళ్లీ బయటికి తీసుకొస్తున్నాం. మా ప్రయత్నాకి కొవిడ్‌ తీవ్ర విఘాతం కలిగించింది. అన్ని రంగాలలాగా కరోనాతో చేనేత వ్యవస్థ కూడా కుదేలైంది. కొత్తగా ఆలోచించకపోతే చేనేత కోలుకోలేదు. అందుకే, నారాయణపేట చీరలతో కొత్తగా ప్రయోగం చేస్తున్నాం. త్వరలో డ్యాన్స్‌ చీరలను తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. అంటే సంప్రదాయ నృత్యాలు చేసేటప్పుడు ధరించడానికి నారాయణపేట్‌ చీరలను తయారు చేయిస్తున్నాం. కొన్ని శాంపిల్స్‌ కూడా తయారయ్యాయి. మన సంస్కృతిని నిలబెడుతూనే జీవనోపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తున్నాం. ‘శారీ రివైవల్‌’ చేనేత కళాకారుల ఉపాధికి తోడ్పడాలి.

– సుధారాణి, ‘అభిహార’ వ్యవస్థాపకురాలు

‘మహానటి’తో చేనేత ట్రెండ్‌

చేనేత చీరకు సారె

చేనేతకు సినీ ప్రముఖులు సైతం వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. సినీనటి సమంత చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. పలు సినిమాలు సైతం నేతన్నల కౌశలాన్ని తెలియజేస్తూ, చీరలపై మోజును పెంచుతున్నాయి. సినీనటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమాలో చేనేత చీరల వైభవాన్ని చూడొచ్చు. సినిమాలో కనిపించే పాత్రలన్నీ పాతతరానికి చెందినవే! ఈ నేపథ్యంలో ఆనాటి కట్టుబొట్టు వ్యవహారాలను ఇందులో అందంగా చూపించారు దర్శకుడు. ఇందుకోసం వందమంది కళాకారులు ఏడాది పాటు కష్టపడి రకరకాల చీరలను నేసారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఫ్యాబ్రిక్‌ను సేకరించి జమ్‌దానీ లూమ్స్‌పై ఆనాటి మేటి చీరలను ఆవిష్కరించారు. ‘కొన్ని చీరలు నేయడానికి ఏడు నెలలు పడితే, వాటిపై పెయింటింగ్‌, ఎంబ్రాయిడరీ వర్క్‌ కోసం మరో ఏడు నెలల సమయం పట్టింది. అలా మేము పడిన కష్టానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు దక్కింది. ఆ సినిమా ద్వారా చేనేత చీరల గొప్పతనం గురించి తెలుసుకున్నామని యువత చెప్తుంటే ఆనందంగా అనిపిస్తుంది’ అంటారు గౌరంగ్‌ షా.

-నిఖిత నెల్లుట్ల

Advertisement
చేనేత చీరకు సారె
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement