e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 9, 2021
Home News పుస్తక సమీక్ష

పుస్తక సమీక్ష

పుస్తక సమీక్ష

లింగార్చనకు దిక్సూచి

పుస్తక సమీక్ష

పరమశివుడు భక్త సులభుడు. చెంబుడు నీళ్లు పోసినా అనుగ్రహిస్తాడు. ఒక్క మారేడు దళంతోనూ ప్రసన్నుడు అవుతాడు. ఆద్యంత రహితుడైన లింగమూర్తిని కొలిచేందుకు ప్రణవ నాదం మొదలు వేదోక్తమైన రుద్రాధ్యాయం వరకు ఎన్నో మంత్రాలున్నాయి. అప్పటికప్పుడు సైకతంతో లింగాన్ని తీర్చిదిద్ది అర్చించే పద్ధతీ ఉంది, మహోత్కృష్టమైన మహాలింగార్చన చేసే విధానమూ ఉంది. శివలింగార్చన విధివిధానాల గురించి వ్యాసుడు శివపురాణంలో విస్తృతంగా తెలియజేశారు. మనిషి కామ్యాన్ని బట్టి ఏ రకమైన శివలింగాన్ని పూజించాలో కూడా అందులో వివరించారు. అన్ని రకాలైన కోరికలను తీర్చే శివలింగం ‘పార్థివ లింగం’ (మట్టితో చేసినది) అని నిర్ధారించారు. కోరికలు తీరడం అంటే.. కోరికలు లేని ఉన్నతస్థితికి చేరుకోవడమే! పార్థివ లింగార్చనతో అంతటి సిద్ధి లభిస్తుంది. అందుకే, శివారాధనలో పార్థివ లింగార్చనకు విశేషమైన ప్రాశస్త్యం ఉన్నది. దీనిని నిర్వహించే విధానమూ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. అయితే మనం ఆచరించే విధానం శాస్త్రీయంగా ఉండాలి. అచంచలమైన విశ్వాసం ఉన్నా, అనంతమైన భక్తిప్రపత్తులు ఉన్నా ఏ విధమైన దోషాలకు తావులేకుండా అర్చన చేయగలిగితే దైవానుగ్రహం తప్పక సిద్ధిస్తుంది. ఈ ప్రయత్నంలో భాగంగానే పార్థివ లింగార్చన విధివిధానాలను క్రోడీకరించి ఈ గ్రంథాన్ని తీర్చిదిద్దారు ప్రకాశకులు. యతివర మాధవానంద సరస్వతీ స్వామి వారి పర్యవేక్షణలో ‘శ్రీమహాలింగార్చన సేవా పరిషత్‌’ ఆధ్వర్యంలో ఈ మహత్కార్యం విజయవంతంగా పూర్తయింది. పార్థివ లింగార్చనలో రకాలు, ఒక్కోదానికి అనుసరించాల్సిన పద్ధతులను సమూలంగా విశదీకరించిన తీరు అభినందనీయం.

శివరహస్య ప్రోక్త

శ్రీపార్థివలింగార్చనా కల్ప ద్రుమము

(బోధాయనోక్త మహాన్యాస సహితము)

పరిష్కారం: పురాణం మహేశ్వర శర్మ, గౌరీభట్ల సత్యనారాయణ శర్మ

పేజీలు: 317 ధర: అమూల్యం

ప్రతులకు: దేశపతి అనంతకుమార శర్మ

98852 93121, 90526 22020

మహాత్ముడిని దర్శిద్దాం
పుస్తక సమీక్ష

‘అసలైన విప్లవవాది, సిసలైన సిద్ధాంత కర్త గాంధీజీ’ పేరుతో డా.నాగసూరి వేణుగోపాల్‌ వెలువరించిన ఈ పుస్తకం బాపూజీ ‘కొండంత వ్యక్తిత్వాన్ని’ అద్దంలో చూపింది. గాంధీజీ గురించి తెలియని ఎన్నో విషయాలను సాధికారంగా ఉదాహరణలతో చూపారు రచయిత. నేడు గాంధీ ప్రాసంగికత కోల్పోయారని జరుగుతున్న దుష్ప్రచారాలకు ఈ పుస్తకం సిసలైన తోకచుక్క. శాస్త్ర సాంకేతిక విజ్ఞానానికి ఆయన వ్యతిరేకి అనీ, కేవలం మతాన్ని పట్టుకు వేలాడే మనిషి అనీ, స్వాతంత్ర సముపార్జన వరకే చరఖా అవసరపడిందని మిడిమిడి జ్ఞానంతో విమర్శించే వారికి ఇది కనువిప్పు. గాంధీ నూరేండ్ల క్రితమే ఎంత క్రాంతదర్శిగా ఉండేవాడో, ఎంత దూరదృష్టితో ఆలోచించేవాడో చెబుతుంది. అన్ని రంగాలపైనా సాధికారత, అభినివేశం ఆయనకు ఎంతగా ఉండేదో తేట పరుస్తుంది. అలాగే కస్తూర్బా గురించి తెలియని ఎన్నో విషయాలు మనం ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. బ్రహ్మచర్య వ్రతం- గాంధీ ప్రయోగాలు, దేశీ, విదేశీ వైద్యశాస్ర్తాలకి సంబంధించిన అభిప్రాయాలు ఇందులో కూలంకషంగా చర్చించారు. పైకి ఆయనకు వ్యతిరేకంగా కనిపించినా లోహియా, ఐన్‌స్టీన్‌ లాంటి వాళ్లు బాపూపట్ల ఎంత గౌరవంగా ఉండేవారో రచయిత చెప్పారు. సి.వి.రామన్‌, జగదీశ్‌ చంద్రబోస్‌ తదితర శాస్త్రవేత్తలు గాంధీజీ  సైన్సు పరిజ్ఞానంపై ఏమన్నారో కూడా ఈ పుస్తకం తెలియచేస్తుంది. అన్నింటికన్నా ముఖ్యం ఈ తరానికి గాంధీ భావజాలం ఎంత అవసరమో ఇది చదివిన వారికి అర్థమవుతుంది.

-చంద్ర ప్రతాప్‌

అసలైన విప్లవవాది సిసలైన 

సిద్ధాంత కర్త గాంధీజీ 

రచన: డా॥నాగసూరి వేణుగోపాల్‌, 

పేజీలు: 111 ధర: రూ.100

ప్రతులకు: గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన 

ప్రతిష్ఠాన్‌, నాంపల్లి, హైదరాబాద్‌, ఫోన్‌ : 8185844999;  నవోదయ బుక్‌ హౌస్‌, కాచిగూడ

Advertisement
పుస్తక సమీక్ష
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement