గురువారం 02 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 22, 2020 , 00:43:55

సర్వం సిద్ధం..

సర్వం సిద్ధం..
  • -పోలింగ్‌ కేంద్రాలకు చేరిన సామగ్రి, సిబ్బంది
  • -డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ
  • -అధికారులకు పలు సూచనలు
  • -ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్‌ షురూ
  • -అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు

జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో నేడు (బుధవారం) నిర్వహించనున్న పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మంగళవారం కామారెడ్డిలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బాన్సువాడ ఎస్‌ఆర్‌ఎన్‌కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల్లో సిబ్బందికి పోలింగ్‌ సామగ్రిని పంపిణీ చేశారు. బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. పోలింగ్‌ సందర్భంగా అధికారులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.
- నమస్తే తెలంగాణ/యంత్రాంగం

బాన్సువాడ రూరల్‌ : బాన్సువాడ మున్సిపాలిటీకి బుధవారం నిర్వహించనున్న ఎన్నికలకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఎస్‌ఆర్‌ఎన్‌కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి జేసీ యాదిరెడ్డి, ఆర్డీవో రాజేశ్వర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ కుమారస్వామి, ఎన్నిల  పరిశీలకుల పర్యవేక్షణలో ఎన్నికలకు కావాల్సిన సామగ్రిని సిబ్బందికి అందజేశారు. వార్డుల వారీగా  సిబ్బందికి ఎన్నికల సామగ్రిని అందజేశారు. బాన్సువాడ మున్సిపాలిటీలో 19 వార్డులకు గాను ఒక వార్డు ఏకగ్రీవం కాగా, మరో 18 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. 66 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికలలో 20,544 మంది తమ ఓటు హక్కు ను వినియోగించుకోనున్నారు.
 ఇందుకు గాను 36 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 210 మంది ఎన్నికల సిబ్బంది ఎన్నికల నిర్వహణలో పాల్గొంటున్నారు. మధ్యాహ్నం భోజనం అనంతరం పోలింగ్‌ సామగ్రితో ఎన్నికల సిబ్బంది ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో బాన్సువాడ పట్టణానికి తరలి వెళ్లారు. డీఎస్పీ దామోదర్‌రెడ్డి, టౌన్‌, రూరల్‌ సీఐలు మహేశ్‌గౌడ్‌, టాటా బాబు బందోబస్తును ఏర్పాటు చేశారు.logo
>>>>>>