శనివారం 04 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 22, 2020 , 00:40:50

ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలి

ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలి
  • -జిల్లాలో 80 వార్డులకు 188 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు
  • -విధుల్లో పాల్గొననున్న 1130 మంది ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు

బాన్సువాడ, నమస్తే తెలంగాణ : అర్హులైన ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా రాజకీయ పార్టీల అభ్యర్థులు, నాయకులు, ప్రజలు సహకరించాలని కలెక్టర్‌ సత్యనారాయణ కోరారు. బాన్సువాడలోని ఎస్‌ఆర్‌ఎన్‌కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బ్యాలెట్‌ బాక్సుల పంపిణీ కేంద్రాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు. పోలింగ్‌ సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇటీవల నిర్వహించిన ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా జరిగాయని, బుధవారం నిర్వహించనున్న ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సహకరించాలని కోరారు. జిల్లాలో సుమారు లక్షా 18 వేల మంది ఓటర్లు ఉన్నారని, 80 వార్డులకు గాను 188 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల్లో విధులు నిర్వహించేందుకు ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు, పోలింగ్‌ బూత్‌కు ఐదుగురు చొప్పున కలిపి మొత్తం 1130 మంది పోలింగ్‌ సిబ్బందిని నియమించామని వివరించారు. జిల్లాలో 28 రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను నియమించామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 67 సమస్యాత్మక, అతి సమస్యాత్మకమైన పోలింగ్‌ కేంద్రాలను గుర్తించామని, ఆ పోలింగ్‌ కేంద్రాల వద్ద లైవ్‌ వెబ్‌ కాస్టింగ్‌, వీడియోగ్రఫీ, ఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌తో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో తనతో పాటు నలుగురు అధికారులు, ఎస్పీ ఆధ్వర్యంలో ఎన్నికల పర్యవేక్షణ ఉంటుందన్నారు. కామారెడ్డిలో 11, ఎల్లారెడ్డిలో 2, బాన్సువాడలో 3 రూట్లలో జోనల్‌స్థాయి అధికారులను నియమించామని చెప్పారు. ప్రతి మున్సిపాలిటీ కార్యాలయం పరిధిలో ఒక ప్రత్యేకాధికారిని నియమించామని వివరించారు. బాన్సువాడకు జేసీ యాదిరెడ్డి, కామారెడ్డికి అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, ఎల్లారెడ్డికి వెంకటేశ్‌ దోత్రేను నియమించామని తెలిపారు.

ఓటరు స్లిప్‌ లేకపోయినా..

ఓటు వేసేందుకు వచ్చిన ఓటరు తన పేరుతో స్లిప్‌ లేకపోయినా ఆ వార్డులో ఓటరుగా ఉంటే వారిని అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో గుర్తించి ఏ, ఎస్‌, డీ లిస్టు ప్రకారం ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపడుతామని తెలిపారు. 22న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ నెల 25న బాన్సువాడలో ఎస్‌ఆర్‌ఎన్‌కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎల్లారెడ్డిలోని మోడల్‌ డిగ్రీ కళాశాల, కామారెడ్డిలోని గోదాములో ఓట్ల కౌంటింగ్‌ను చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే సిబ్బందికి కౌంటింగ్‌పై రెండు విడతల్లో శిక్షణ ఇచ్చామని, 24న తుది విడత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆయన వెంట జేసీ యాదిరెడ్డి, ఎస్పీ శ్వేతారెడ్డి, ఆర్డీవో రాజేశ్వర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ కుమారస్వామి, తహసీల్దార్‌ గంగాధర్‌, గిర్దావర్‌ రామకృష్ణ పాల్గొన్నారు. 
నిబంధనల ప్రకారం పోలింగ్‌ జరగాలి

ఎల్లారెడ్డి, నమస్తే తెలంగాణ : ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు పోలింగ్‌ జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. పోలింగ్‌ రోజు స్ట్రైకింగ్‌ ఫోర్స్‌, ఫ్లయింగ్‌ స్కాడ్‌ల పర్యవేక్షణ ఉంటుందని, అధికారులు ఎన్నికల నియమావళి పాటించకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఎన్నికల విధులకు హాజరయ్యే అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ నెల 25న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఓటర్లకు వంద శాతం పోలింగ్‌ స్లిప్పులు పంపిణీ చేశామని చెప్పారు. ఈ నెల 25న జరుగనున్న ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాటు చేసిన కేంద్రాన్ని, కేంద్రంలో ఏర్పాటు చేసిన టేబుళ్లు, ఏజెంట్ల కోసం చేసిన ఏర్పాట్లను కలెక్టర్‌ పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీవో దేవేందర్‌రెడ్డి ఉన్నారు. logo