త్వరలో 70 వేల ఉద్యోగాల భర్తీ

- ఉద్యోగుల వేతనాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌దే
- ఉద్యోగాల భర్తీ తప్పని నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా..
- తెలంగాణ సినిమాలో హీరో కేసీఆరే..
- విలన్ల భరతం పడుతాం
- ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం, ప్రచారంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
జయశంకర్ భూపాలపల్లి, జనవరి 23 (నమస్తేతెలంగాణ)/కృష్ణకాలనీ : త్వరలో 70 వేల ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు చేస్తున్నామని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాల భర్తీ తప్పు అని నిరూపిస్తే పట్టభద్రుల ఎమ్మెల్సీ పోటీ నుంచి తప్పుకుంటానని ప్రతిపక్షాలకు సవాల్ చేశారు. శనివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఎస్ఆర్ గార్డెన్లో భూపాలపల్లి, గణపురం, రేగొండ మండలాలకు చెందిన గ్రాడ్యుయేట్ ఓటర్లు, టీఆర్ఎస్ శ్రేణులతో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం ఎమ్యె ల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అధ్యక్షతన జరిగింది. అలాగే సింగరేణి జీఎం కార్యాలయంలో గ్రాడ్యుయేట్ కార్మికులు, సంఘమిత్ర డిగ్రీ, పీజీ కళాశాల, తేజస్విని గాంధీ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రైవేట్ అధ్యాపకులు, టీచర్లతో విడివిడిగా సమావేశమై విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా పల్లా మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో లక్షా 31వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల భర్తీ అసత్యమని కొందరు బుద్ధి, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉద్యోగులకు వేతనాలు పెం చిన ఘనత సీఎందేనన్నారు. సింగరేణిలో ఏ ప్రభు త్వం చేయని విధంగా 15 వేల మందికి వారసత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. రూ. 300 ఉన్న గ్యాస్‌ను రూ. 900 చేసిన పాపం బీజేపీకే దక్కుతుందన్నారు. నిరుద్యోగ భృతి ఇప్పించేందుకు తన వంతు సహాయ సహకారం అందిస్తానని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ గురించి కొందరు అవివేకంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఇదే పట్టభద్రుల స్థానంలో శాసన మండలికి పంపించారని, తాను ఎమ్మెల్సీగా విఫలం చెందలేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కౌన్సిల్లో ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందువరుసలో ఉండి పోరాటం చేశానన్నారు.
రాష్ట్ర పునర్నిర్మాణంలో కేసీఆరే హీరో ...
రాష్ట్రంలో అభివృద్ధి జరుగలేదని, ఉద్యోగాల భర్తీ చేపట్టలేదని కొంత మంది దగుల్బాజీలు తెలంగాణ సినిమా తీస్తామని మాట్లాడుతున్నారని, వారు తీసే సినిమాలో హీరో, రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ హీరో కేసీఆరేనన్నారు. రాష్ట్రంలో విలన్లు ఎక్కువగా పుట్టుకొస్తున్నారని, వారి భరతం పట్టి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ సైనికుడిగా తనకు తిరిగి అవకాశం ఇవ్వాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో భూపాలపల్లి, వరంగల్ రూరల్, పెద్దపల్లి, జనగామ జిల్లా పరిషత్ చైర్మన్లు జక్కు శ్రీహర్షిణి, గండ్ర జ్యోతి, పుట్ట మధుకర్, సంపత్‌రెడ్డి, వరంగల్ ఎంపీ దయాకర్, రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవారెడ్డి, జడ్పీ వైస్ చైర్పర్సన్ కళ్లెపు శోభ, భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరాణి, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావు, ఉపాధ్యక్షుడు కొక్కుల తిరుపతి, ఎంపీపీ మందల లావణ్య, టీఆర్ఎస్ యూత్ అర్బన్ అధ్యక్షుడు బుర్ర రాజు, టీజేఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాడ హరీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- నేడు దేశవ్యాప్త బంద్
- శభాష్ నర్సింలు..
- ఒక్క రోజు నెట్ బిల్లు రూ. 4.6 లక్షలు
- జాగ్రత్తతో సైబర్‌నేరాలకు చెక్: సీపీ సజ్జనార్
- ప్రభుత్వం పారిశ్రామికరంగానికి ప్రోత్సాహం
- అమ్మాయి మా బంధువే.. రూ.90 కోట్ల కట్నమిప్పిస్తాం..
- వేసవి తట్టుకునేలా.. మరో సబ్‌స్టేషన్
- ఎంఎస్ఎంఈ ద్వారా ఆన్లైన్లో టాయ్ ఫేయిర్
- వ్యాక్సినే సురక్షితమైన ఆయుధం
- రాష్ట్రంలో పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు