బుధవారం 23 సెప్టెంబర్ 2020
Jayashankar - Aug 11, 2020 , 02:21:48

జోరువాన

జోరువాన

  • ఉమ్మడి జిల్లాలో దంచికొట్టిన వర్షం
  • మత్తళ్లు పోస్తున్న చెరువులు
  • పొంగుతున్న వాగులు, వంకలు
  • నిండుకుండలా జలాశయాలు
  • రైతుల్లో హుషారు 
  • అత్యధికంగా నల్లబెల్లిలో 124.8 మి.మీ వర్షం
  • వరంగల్‌ నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం

రెండు రోజులుగా ముసురుతో మొదలైన వాన జోరందుకుంది. ఈ సీజన్‌లో ఎప్పుడూలేనంతగా దంచికొట్టింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శనివారం నుంచి ఎడతెరపి లేకుండా కురవడంతో వాగులు పొంగిపొర్లగా చెరువులు మత్తళ్లు పోశాయి. ఇటు వరద నీటితో రిజర్వాయర్లు నిండుకుండలను తలపిస్తున్నాయి. అత్యధికంగా నల్లబెల్లిలో 124.8 మి.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా అధికారులు స్థానికులను అప్రమత్తం చేశారు.

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జోరువాన కురిసింది. భూపాలపల్లి సింగరేణి ఏరియాలో సోమవారం మూడు షిఫ్ట్‌లలో రెండు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. అలాగే బొగ్గుల వాగు, భీం గణపూర్‌, నర్సింగపూర్‌, గణపసముద్రం రిజర్వాయర్లు నిండుకుండలను తలపిస్తున్నాయి. మోరంచ వాగు పొంగిపొర్లింది. టేకుమట్ల పెద్ద చెరువు మత్తడి పోయగా, చలివాగు మానేరు వాగుల్లో నీటి ప్రవాహం పెరిగింది. మహాముత్తారం మండలంలో పెద్దవాగు, శనిగల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పెగడపల్లి- కేశవపూర్‌, కనుకునూర్‌-కొత్తపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోగా జిల్లాలో 48.3 వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్‌ జిల్లాకేంద్రంలో మున్నేరువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. బయ్యారం పెద్ద చెరువు, తులారాం, గౌరారం, కురవి పెద్దచెరువు, చింతపల్లి, బలపాల, రాజోలు, పాలేరు వాగు మత్తడి పోసున్నాయి. వట్టివాగు, పాకాల పొంగి ప్రవహిస్తున్నాయి. గంగారం మండల పరిధిలోని కాటినాగారం-కోమట్లగూడెం గ్రామాల మధ్య గల లోలెవల్‌ బ్రిడ్జి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోగా జిల్లా వ్యాప్తంగా 43.8 వర్షపాతం కురిసింది. ములుగు జిల్లాలోని లక్నవరం, రామప్ప సరస్సుల్లోకి భారీగా వరద నీరు చేరింది. మంగపేట మండలం కమలాపురం ఇన్‌టేక్‌ వెల్‌ వద్ద గోదావరి ప్రవాహం పెరిగింది. దస్రుమాటు హైలెవల్‌ బ్రిడ్జ్‌ వద్ద వేసిన సైడ్‌ రోడ్‌ వాగునీటి ప్రవాహానికి కొట్టుకపోయి రాకపోకలు నిలిచిపోగా జిల్లాలో సగటున 60.9 మి.మీ వర్షపాతం నమోదైంది. రూరల్‌ జిల్లాలో 65.7 మి.మీ సగటు వర్షపాతం కురిసింది. నల్లబెల్లిలో అత్యధికంగా 124.8 మిల్లీమీటర్లు నమోదైంది. 105 చెరువులు మత్తడి దుంకుతున్నాయి. అర్బన్‌ జిల్లాలో 86 మి.మీ వర్షపాతం నమోదైంది. వరంగల్‌ నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.


logo