శనివారం 04 ఏప్రిల్ 2020
Jangaon - Mar 03, 2020 , 02:33:35

జీఎస్టీ చెల్లింపునకు సహకరించాలి

జీఎస్టీ చెల్లింపునకు సహకరించాలి

భూపాలపల్లి టౌన్‌, మార్చి 02 : వ్యాపార వాణిజ్య వర్గాలు జీఎస్టీ సక్రమంగా చెల్లింపునకు సహకరించాలని హైదరాబాద్‌ జోన్‌ సెంట్రల్‌ జీఎస్టీ చీఫ్‌ కమిషనర్‌ వాస శేషగిరిరావు కోరారు. జిల్లా కేంద్రంలోని దేవీ ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం సాయంత్రం వ్యాపార వర్గాలతో జీఎస్టీపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై అవగాహన కల్పించారు. ‘జిల్లా జిల్లాకో కేంద్రం జీఎస్టీ మీ వద్దకు’ అనే కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో కొనసాగించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని, ఇప్పటికే 15 జిల్లాల్లో కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. చాలా మంది వ్యాపారులకు జీఎస్టీపై అవగాహన లేదన్నారు. వ్యాపారులందరికీ జీఎస్టీపై అవగాహన కల్పించడంతో పాటు వారి సందేహాలను, సమస్యలను నివృత్తి చేయనున్నట్లు తెలిపారు. వివిధ డిపార్ట్‌మెంట్లకు సంబంధించి 17 రకాల ట్యాక్స్‌లు ఉంటాయని, వాటన్నింటినీ ఒకే ట్యాక్స్‌ కిందికి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా క్లాత్‌ షో రూం అసోసియేషన్‌ అధ్యక్షులు ఈగ రవికిరణ్‌తో పాటు కిరాణ అసోసియేషన్‌, ఇతర అసోసియేషన్‌ నేతలు తమ సందేహాలను, సమస్యలను కమిషనర్‌ ముందుంచారు. వారి సమస్యలకు కమిషనర్‌ పరిష్కారం చూపారు. రెగ్యులర్‌గా ట్యాక్స్‌ చెల్లించే వాళ్లను ఇబ్బంది పెడుతున్నారని, చెల్లించని వారిని పట్టించుకోవడం లేదని, ప్రతిఒక్క వస్తువును జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి అప్పుడు ట్యాక్స్‌ వసూలు చేయాలన్నారు. కార్యక్రమంలో సికింద్రాబాద్‌ కమిషనరేట్‌ కమిషనర్‌ ఎంఆర్‌ఆర్‌ రెడ్డి, అధితి కమిషనరేట్‌ కమిషనర్‌ డీవీ రెడ్డి, జీఎస్టీ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఇన్‌చార్జి నాగనాథ్‌, వరంగల్‌ జీఎస్టీ ఇన్‌చార్జి ఓంప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.



logo