శుక్రవారం 04 డిసెంబర్ 2020
Jagityal - Oct 31, 2020 , 00:45:45

వర్షాలు, వాతావరణ మార్పులతో పంటలకు చీడపీడలు

వర్షాలు, వాతావరణ మార్పులతో పంటలకు చీడపీడలు

వరి, పత్తి, కందికి పొంచి ఉన్న ముప్పు

దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం

జాగ్రత్తలు తీసుకుంటేనే మేలు: పొలాస శాస్త్రవేత్తలు

కోటి ఆశలతో ఈ యేడు సరికొత్తగా సాగుబాట పట్టిన రైతాంగానికి తెగుళ్ల గండం ముంచుకొస్తున్నది. వరుస వర్షాలు.. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో చీడపీడలు దాపురించే ప్రమాదం ముంచుకొస్తున్నది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా ఈ సారి వర్షాలు దంచికొట్టడం, అందులోనూ వరి పొట్ట దశలో విజృంభించడంతో 

రైతన్నకు పెను ముప్పుగా మారింది. వేలాది ఎకరాల్లోని పొలాలు, పత్తి, కంది చేన్లలో నీరు చేరడం అనేక రకాల చీడపీడలు సోకే పరిస్థితులు ఏర్పడగా, జాగ్రత్తలు 

తీసుకుంటేనే మేలని పొలాస యంత్రాంగం చెబుతున్నది. లేదంటే దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నది.   - జగిత్యాల, నమస్తే తెలంగాణ 

 వరుస వర్షాలు.. వాతావరణ  మార్పులు అన్నదాతను కంటిమీద కనుకులేకుండా చేశాయి. ఐదు నెలలు కష్టపడి పనిచేసిన రైతన్నల ఆశలు ఆవిరయ్యే ప్రమాదం పొంచి ఉన్నది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల పరిధిలో పడాల్సిన దాని కంటే అధికంగా కురిసింది. దీనికి తోడు కాలానుగుణంగా కాకుం డా, వరి చేతికివచ్చే దశలో విజృంభించడం పంటలకు గొడ్డలి పెట్టులా మారింది. వేలాది ఎకరాల్లో పొలాలు, పత్తి, కంది చేన్లలో నీరు చేరడం, ఇటీవల వాతావరణ మార్పులు రావడం వంటి కారణాలతో పంటలకు అనేక రకాల చీడపీడలు సోకే ముప్పు ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో వివిధ ప్రాం తాల్లో వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించిన పొలా స వ్యవసాయ శాస్త్రవేత్తలు, చీడపీడలు, వాటి నుంచి కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతుల కోసం సస్యరక్షణ వివరాలు

 వరి: పంట చిరుపొట్ట దశ నుంచి కంకి వెలువడే దశలో ఉంది. ఇప్పుడు వివిధ రకాల చీడపీడలు ఆశించి పంటను నష్టపరుస్తున్నాయి. సరైన సమయంలో తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.

సుడిదోమ: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి లో ముఖ్యంగా సన్న గింజ రకాల్లో దోమ ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున రైతులు పంట పొలం లోపలికి వెళ్లి గమనించాలి. ఉధృతి కనిపిస్తే వెం టనే కంగారుపడి యూరియా మోతాదును మించి వాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరికాదు. మోతాదుకు మించి యూరియాను వాడరాదు.  

తడిసిన వరి పొలాన్ని ఆరబెట్టాలి.

పురుగుల సంఖ్య తక్కువగా ఉన్నట్లయితే 300గ్రాముల ఎసిఫేట్‌ లేదా 320 మి.లీ. బుఫ్రోజిన్‌ను ఎకరాకు పిచికారీ చేయాలి.

దోమ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఎకరానికి 80గ్రా.. డైనోటెఫ్యూరాన్‌, 120 గ్రా. పూవిట్రోజెన్‌, 98 మి.లీ. ట్రైప్లుపెజోమెరమ్‌ను పిచికారీ చేయాలి

దోమ ఉన్నప్పుడు క్లోరి పైరిపాస్‌, లిప్టోసహలొడ్రిన్‌, సైపర్‌ మైత్రిన్‌, డెల్టామైత్రిన్‌ వంటి మందులను పిచికారీ చేయరాదు. 

మొగి(కాండం తొలిచే) పురుగు..

వరిలో మొగి పురుగు ఉధృతి సైతం ఎక్కువగా ఉం డే అవకాశం ఉంది. దీనివల్ల పొలంలో తెల్ల కంకు లు ఏర్పడతాయి. నివారణకు అంకురం నుంచి చిరుపొట్ట దశలో ప్రతి ఎకరాకు 400గ్రా. కార్టాప్‌ హైడ్రోక్లోరైడ్‌ లేదా 60 మి.లీ. క్లోరాంద్రనిలిప్రోల్‌ పిచికారీ చేయాలి. తెల్ల కుంకి వచ్చిన త ర్వాత ఏ మందు కొట్టినా ప్రయోజనం ఉండదు. 

ఆకు ముడత..

పొట్ట దశలో ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉం టుంది. లద్దె పురుగు ఆకుల అంపను మండలాగా చేసి పత్రహరితాన్ని గోకి తినడంతో తెల్లటి పొడవాటి మచ్చలు ఏర్పడతాయి. నివారణకు ఎకరాకు 60 మి.లీ. క్లోరాంద్రినిలిప్రోల్‌ లేదా 40 మి.లీ. ప్లూబెండియమైడ్‌ లేదా 400 గ్రా. కార్టాప్‌ హైడ్రోక్లోరైడ్‌ను పిచికారీ చేయాలి.

 బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు.. 

ప్రస్తుత పరిస్థితుల్లో వరిలో ముఖ్యంగా సన్నగింజ రకాల్లో బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు ఆశిస్తుంది. ఈ తెగులు వల్ల ఆకుల కొనలు ఎండిపోయినట్లు కనబడతాయి. ఆకుల కొన నుంచి తెగులు మొదలై ఆకు కిందికి విస్తరిస్తుంది. ఇటువంటి లక్షణాలు గమనించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తెగులును గమనించిన వెంటనే యూరియా చల్లవద్దు. పొలంలోని నీటిని వేరే పొలంలోకి పంపవద్దు. కాగా, నివారణకు ఎకరాకు 40గ్రా. ప్లాంటామైసిన్‌ లేదా 80గ్రా. అగ్రిమైసిన్‌ ను  60గ్రా. ఆక్సిక్లోరైడ్‌తో కలిపి వారం రోజుల్లో రెండుసార్లు పిచికారీ చేయాలి. 

  అగ్గి తెగులు..

కొన్ని ప్రాంతాల్లో వరి పంటకు అగ్గితెగులు ఆశిస్తుంది. ఆకులపై కండెపు ఆకారపు మచ్చలు ఏర్పడతాయి. అంతేకాకుండా కంకి ఏర్పడిన తర్వాత కనుపుల దగ్గర విరిగిపోతాయి. దీనినే మెడవిరుపు అంటారు. నివారణకు ఎకరాకు 120 గ్రా. ట్రైసైక్లోజోల్‌ లేదా 300 మి.లీ. ఐసోప్రొథమిలిన్‌ను పిచికారీ చేయాలి. యూరియాను మోతాదుకు మించి వాడరాదు.

 కంకినల్లి, గింజ మచ్చ తెగులు..

వరిలో కంకినల్లి, గింజ మచ్చ తెగులు సోకుతుంది. కంకినల్లి ఆశించిన గింజలు గోధుమ రంగులోకి మారి తాలుగా మారతాయి. ఈ లక్షణాలను గమనించినగానే ఎకరాకు 200 మి.లీ. స్పైలోమెసిఫెన్‌, 200 మి.లీ. ప్రాపికొనజోల్‌ను పిచికారీ చేయాలి.

  కాటుక తెగులు..

ప్రస్తుత పరిస్థితుల్లో వరిలో కాటుక తెగులును గమనించారు. ఇది సోకిన వరి గింజలు పసుపు ముద్దలుగా మారి ఆ తర్వాత నల్లబడతాయి. నివారణకు 200 మి.లీ లేదా ట్రైప్రొక్సీస్ట్రాటిన్‌, 80 గ్రా. టెబుకానజోల్‌ను పిచికారీ చేయాలి. 

  పత్తిలో..

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో రెండో ప్రధాన పంటగా పత్తిని సాగు చేస్తున్నారు. విపరీతంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో ఈ పంటలో వివిధ రకాల చీడ పురుగులను శాస్త్రవేత్తలు గుర్తించారు. 

  రసం పీల్చే పురుగు..

ప్రస్తుత పరిస్థితుల్లో పత్తిలో పచ్చదోమ ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో పాటు అక్కడక్కడ తెల్లదోమ ఆశిస్తుంది. నివారణకు 40 గ్రా. అసిటామిప్రైడ్‌ లేదా 60 మి.లీ. ఇడియాక్లోప్రిడ్‌ లేదా 250 గ్రా. డైపెంథియురాన్‌ను పిచికారీ చేయాలి. పిండి పురుగు గమనించినట్లయితే 600 గ్రా. ప్రాపికొనజోల్‌ను 200 గ్రా. సాండోవిట్‌గమ్‌తో కలిపి పిచికారీ చేయాలి.

  గులాబీరంగు కాయతొలుచు పురుగు..

ఈ పురుగు ఉధృతిని తొలిదశలో గుర్తిస్తేనే.. దీని ద్వారా కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. 

ఎకరానికి నాలుగు లింగాకర్షక బుట్టలు పెట్టి వరుసగా మూడు నుంచి నాలుగు రోజుల్లో ఏడు నుంచి ఎనిమిది రెక్కల పురుగులు గమనిస్తే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.

తొలి దశలో వేప సంబంధిత నూనెను ఎకరాకు లీటరు పిచికారీ చేయాలి.

పురుగు ఉధృతిని గమనిస్తే 500 మి.లీ. క్లోరిఫైరిఫాస్‌ పిచికారీ చేయాలి. 

ఉధృతి ఎక్కువ ఉంటే ఎకరాకు 200 మి.లీ. లామ్డాసహలోథిన్‌ లేదా 200 మి.లీ. సైపర్‌మైత్రిన్‌ను పిచికారీ చేయాలి. 

  బ్యాక్టీరియా నల్లమచ్చ తెగులు..

వర్షాకాలంలో మబ్బులు పట్టినప్పుడు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. 

ఆకులపై నల్లని మచ్చలు ఏర్పడతాయి. కొమ్మలు నల్లగా మారి ఎండిపోయి ఉంటే బ్లాక్‌ ఆర్మ్‌ అంటారు. 

ఈ తెగులు లక్షణాలు గమనించిన వెంటనే 15 రోజుల వ్యవధిలో 10 లీటర్ల నీటికి సైప్ట్రోసైక్లిన్‌ లేదా 1 గ్రా. ప్లాంటామైసిన్‌తో పాటు 30 గ్రా. కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ కలిపి పిచికారీ చేయాలి.

ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు:

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఇది ఎక్కువగా సోకే ప్రమాదం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నివారణకు లీటరు నీటికి 1 మి.లీ. ప్రాపికొనజోల్‌ లేదా కాప్టాన్‌తో 1 గ్రా.. హెక్సాకొనజోల్‌ను కలిపి పదిహేను రోజుల్లో రెండు నుంచి మూడు సార్లు పిచికారీ చేయాలి. 

  వడలు తెగులు..  

ఎదిగిన మొక్కలు  పుష్పించే దశలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. చేనులో ఉన్న నీటిని తీసివేయాలి. లీటరు నీటికి 3 గ్రా. కాపర్‌ ఆక్సిక్లోరైడ్‌ కలిపిన ద్రావణాన్ని తెగులు సోకిన మొక్కల మొదల్ల చుట్టూ నేలపై పోయాలి. పత్తిలో అక్కడక్కడ గూడు రాలుతుంటే నివారణకు 1.మి.లీ ప్లానోపిక్స్‌ను 5 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. 

  కందిలో..

ప్రస్తుతం కంది పంట శాఖీయ దశ నుంచి మొ గ్గలు వేసే దశలో ఉంది. ఈ దశలో శనగపచ్చ పు రుగు, మరుక మచ్చల పురుగు ఆశించి నష్టపరిచే అవకాశం ఉన్నందున సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. ఎకరాకు 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చే సుకోవాలి. తొలి దశలో వేప సంబంధిత నూనెను ఎకరాకు  లీటరు చొప్పున పిచికారీ చేయాలి. తొలి దశలో ఉధృతి గమనించినట్లయితే ఎకరాకు  500 మి.లీ. క్లోరిపైరిపాస్‌ లేదా 60 మి.లీ. క్రోఆంథ్రనిలిప్రోల్‌ను పిచికారీ చేయా లి.