బుధవారం 08 ఏప్రిల్ 2020
Jagityal - Mar 02, 2020 , 01:40:57

సర్వం సిద్ధం

సర్వం సిద్ధం

జగిత్యాల లీగల్‌: ఈ నెల 4న ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షల కోసం సర్వం సిద్ధమైంది. జిల్లాలో మొత్తం 18,207మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా అధికారయంత్రాంగం 28కేంద్రాలు ఏర్పాటు  చేసి మౌలిక వసతులు కల్పిస్తున్నది. ఇప్పటికే ఫిబ్రవరి 1నుంచి 20వరకు నాలుగు విడతల్లో సైన్స్‌ విద్యార్థులకు, ఒకేషనల్‌ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ పరీక్షలు నిర్వహించారు.  జిల్లాలో 15 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో, 12ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో, ఒక మోడల్‌ స్కూల్‌లో మొత్తంగా 28 సెంటర్లు ఏర్పాటు చేశారు.  పరీక్షలను ఉదయం 9గంటల నుం చి మధ్యాహ్నం 12వరకు నిర్వహించనున్నారు.  పరీక్షకు ఉదయం 8:30గంటల నుంచే లోనికి అనుమతిస్తారు. ఉదయం 8:45లోపు విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లాలి. 9గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించరు. అన్ని కేంద్రాల వద్ద 144సెక్షన్‌ విధించి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. 28మంది చీఫ్‌ సూపరింటెండెంట్లను, 28మంది డిపార్ట్‌మెంటల్‌ అధికారులను, 12మంది అడిషనల్‌ చీఫ్‌ సూపరింటెండెంట్లను, నలుగురు కస్టోడియన్లను, రెండు ఫ్లయింగ్‌ స్కాడ్‌ బృందాలను, ము గ్గురు సిట్టింగ్‌ స్కాడ్‌లను నియమించారు. సెంటర్లలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు విద్యార్థులకు వైద్య సదుపాయం అందించేందుకు ఏఎన్‌ఎంలను మందులతో సహా అందుబాటులో ఉంచనున్నారు.  ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడపనున్నారు.   


18,207మంది విద్యార్థులు

జిల్లాలో ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల జనరల్‌, ఒకేషనల్‌ రెగ్యులర్‌ విద్యార్థులు 16,692మంది పరీక్షలు రాయనుండగా ప్రైవేట్‌గా 1,515మంది, మొత్తంగా 18,207మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ప్రథమ సంవత్సరం జనరల్‌ విభాగంలో 7,179మంది,  ఒకేషనల్‌ విభాగంలో 1,586మంది, మొత్తం 8,765మంది, ద్వితీయ సంవత్సరం జనరల్‌ విభాగంలో 6,399మంది, ఒకేషనల్‌ విభాగంలో 1,528మంది, మొత్తంగా 7,927మంది పరీక్షలు రాయనున్నారు. 


హై పవర్‌ కమిటీ 

పరీక్షలను విజయవంతం చేసేందుకు ప్రభుత్వం హై పవర్‌ కమిటీని నియమించింది. కలెక్టర్‌  రవి, ఎస్పీ సింధూశర్మ, వరంగల్‌ ఆర్జేడీ జయప్రదాబాయి,  జిల్లా ఇంటర్మీడియెట్‌ విద్య నోడల్‌ అధికారి బీ నారాయణ సభ్యులుగా ఉన్నారు. డిస్ట్రిక్ట్‌ ఎగ్జామినేషన్‌ కమి టీ (డెక్‌) కూడా ఏర్పాటైంది. ఇందులో జిల్లా నోడల్‌ అధికారి బొప్పరాతి నారాయణ కన్వీనర్‌గా, డెక్‌ 1గా ధర్మపురి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ వై రమేశ్‌బాబు, డెక్‌ 2గా మల్యాల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల లెక్చరర్‌ దాసరి నాగభూషణం, డెక్‌ 3గా పీ మనోహర్‌ రెడ్డి వ్యవహరించనున్నారు. 


సిట్టింగ్‌, ఫ్లైయింగ్‌ స్కాడ్‌ బృందాలు 

పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుఉ రెండు ఫ్లయింగ్‌ స్కాడ్‌ బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో జూనియర్‌ లెక్చరర్‌, డిప్యూటీ తాసిల్దార్‌,  సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉంటారు. పరీక్ష జరిగే 3గంటల వ్యవధిలో జిల్లాలోని వివిధ పరీక్షా కేంద్రాలను వీరు ఆకస్మికంగా తనిఖీ చేస్తారు. ముగ్గురిని సిట్టింగ్‌ స్కాడ్‌గా నియమించారు. పరీక్ష ప్రారంభమైనప్పటి నుంచి పరీక్ష ముగిసేంత వరకు కళాశాలలోనే ఉండి పకడ్బందీ నిర్వహణకు సహకరిస్తారు. డెక్‌ సభ్యులు కూడా ఎప్పటికప్పుడు పరీక్ష కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేస్తారు. 


ఇన్విజిలేటర్లుగా ఎస్జీటీలు  

పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్ల కొరత ఏర్పడిన పక్షంలో ప్రభుత్వ పాఠశాలల సెకండరీ గ్రేడ్‌ టీచర్లను ఇన్విజిలేటర్‌ విధులకు నియమించుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. జిల్లా వ్యాప్తంగా పరీక్షలకు 589మంది ఇన్విజిలేటర్లు అవసరం ఉండగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 420మంది ఇన్విజిలేటర్లు అందుబాటులో ఉన్నారు. మిగిలిన 169మంది ఇన్విజిలేటర్లను ప్రభుత్వ పాఠశాలల నుంచి వినియోగించుకోనున్నారు. 


సమయానికి చేరుకోవాలి

విద్యార్థులు ఉదయం 8నుంచి 8:30గంటలలోపు పరీక్ష కేంద్రాలకు చేరుకొని 8:45కల్లా తమతమ స్థానాల్లో కూర్చోవాలి. 9తర్వాత  నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు. సెల్‌ఫోన్లు, కాలిక్యులేటర్లు, పేజర్లు, ఎలక్ట్రానిక్‌ డివైజ్లు తీసుకురావద్దు. చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, ఇన్విజిలేటర్లూ సెల్‌ఫోన్లు పరీక్ష కేంద్రంలోకి తీసుకురావద్దు. ఆన్‌లైన్‌ హాల్‌టికెట్‌ ఉన్నవారినీ పరీక్షలకు అనుమతించాలి. ఒక రోజు ముందే పరీక్ష కేంద్రాన్ని చూసుకోవాలి. విద్యార్థుల సౌకర్యం కోసం డ్యూయల్‌ డెస్క్‌లు ఏర్పాటు చేశాం. అన్ని కేంద్రాల్లో నాలుగు సీసీ కెమెరాలు అమర్చాం. ప్రశ్నా పత్రా ల సీల్డ్‌ కవర్లను సీసీ కెమెరాల ముందే తెరుస్తాం. చీఫ్‌ సూపరింటెండెంట్లు పరీక్ష కేంద్రానికి వంద మీటర్ల పరిధిలో ఉన్న జిరాక్సు సెంటర్లను మూసివేసేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఆర్వో ప్లాంట్ల ద్వారా, ప్రైవేట్‌ కళాశాలల్లో మినరల్‌ వాటర్‌ ద్వారా తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నాం.

- బొప్పరాతి నారాయణ, ఇంటర్మీడియెట్‌ విద్య జిల్లా నోడల్‌ అధికారి 


logo