Chandrabose Interview | నాటు నాటు పాటకు ఆస్కార్ అందుకోవడంపై చంద్రబోస్ మనోగతం ఇదీ | 2018.. లాస్ఏంజెల్స్.. ఓ స్నేహితుడితో కలిసి ఆస్కార్ అవార్డుల వేదిక డాల్బీ థియేటర్‌ను చూడటానికి వెళ్లాడు గీత రచయిత చంద్రబోస్.లోపలికి వెళ్లడానికి అనుమతి దొరకలేదు. నిరాశతో వెనుదిరుగాల్సి వచ్చింది.కాలం గిర్రున తిరిగింది.. 2023 మార్చి 13న అదే థియేటర్లో రెడ్ కార్పెట్‌పై సగర్వంగా నడుచుకుంటూ వెళ్లి ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్నాడు చంద్రబోస్.‘విసుగును వీడి విజయముకోరి విరామమెరుగక పనిచేయాలోయ్.. అసాధ్యమనేది అసలే లేదని చరిత్ర నేర్పెను పవిత్రపాఠం’ అన్న కవి మాటలను అక్షరాలా నిజం చేశాడు చంద్రబోస్. నాడు ఏ గుమ్మం ముందైతే తిరస్కారానికి గురయ్యాడో నేడు అదే వేదికపై ‘పొలం గట్టు దుమ్ములోన.. పోట్లగిత్త దూకినట్టు.. పోలేరమ్మ జాతరలో..పోతరాజు ఊగినట్టు.. నాటు నాటు’ అంటూ ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్నాడు. విశ్వ వేదికపై తెలుగు జెండాను రెపరెపలాడించాడు. ఇది కాలమహిమ కాదు ప్రతిభకు జరిగిన పట్టాభిషేకం. పంతం వీడని కఠోర శ్రమకు దక్కిన ప్రతిఫలం. 95వ అకాడమీ అవార్డుల్లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా పురస్కారం దక్కించుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ పాటకు సాహిత్యం అందించినచంద్రబోస్ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణితో కలిసి ఆస్కార్ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబోస్‌తో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ ..
శుభాకాంక్షలు చంద్రబోస్ గారు… ఆస్కార్ అవార్డు అందుకున్న ఆనందాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు?
ధన్యవాదాలు… తెలుగు సినిమాతోపాటు సంపూర్ణ భారతీయ చలనచిత్రానికి ఓ విభాగంలో వచ్చిన మొట్టమొదటి ఆస్కార్ ఇది. ఎన్నో భాషల్లో, ఎన్నో సినిమాల్లో మన సినిమాకు ఆస్కార్ వరించడం అదృష్టంగా భావిస్తున్నా. ఇది భారతీయులందరూ గర్వించదగిన విషయం.
ఆస్కార్ అందుకున్న వేళ మీ అనుభూతి ఏమిటి?
ఆస్కార్‌కు ముందు గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ అవార్డులు వచ్చిన వారికి ఆస్కార్ వరించే అవకాశం ఉందని గత విశ్లేషణలు చెబుతున్నాయి. ఎంత నమ్మకం ఉన్నా.. ఏదైనా జరగొచ్చు. ఎందుకంటే అక్కడ పోటీలో ఉన్నవి ఆషామాషీ సినిమాలు కావు. సాధారణ పాటలు అంతకన్నా కాదు! అన్నీ గొప్పపాటలే. వీటిలో మన పాట నామినేషన్‌కు వచ్చినప్పుడు ఓ నమ్మకం, ధైర్యం కలిగాయి. కానీ, అవార్డు ప్రకటించడానికి పది క్షణాల ముందు నా ధైర్యం సడలింది. భయం వేసింది. ఇక ఎప్పుడైతే వేదిక మీద ‘ఆర్ఆర్ఆర్’ అని ప్రకటించారో ఆ క్షణం భారతీయ సినీ పరిశ్రమకు ఓ సువర్ణ క్షణం అనిపించింది. 75 ఏండ్ల తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో ఇన్ని ఏండ్లలో.. అన్ని క్షణాల్లో ఆ ఒక్క క్షణం బంగారు క్షణం! 95 ఏండ్ల ఆస్కార్ చరిత్రలో తెలుగు చిత్రానికి అవార్డు రావడం తెలుగువారందరూ గర్వించదగిన క్షణం.
‘నాటు నాటు’ పాటను ఆస్కార్ వరించడానికి కారణం ఏమిటని భావిస్తున్నారు?
అవార్డు విషయాన్ని పక్కన పెడితే.. ప్రపంచవ్యాప్తంగా ‘నాటు నాటు’ పాట తెలియని వారంటూ లేరు. అన్ని భాషల్లో గొప్పగొప్ప పాటలు, ఎంతోమంది గొప్ప రచయితలు ఉన్నా అన్నిటిలో ఈ పాట ప్రజాదరణ పొందడానికి కారణాలు ఉన్నాయి. ఈ పాటలో అర్థంతోపాటు నాదం కూడా గొప్పగా ఉంటుంది. ఈ పాటలో ఒక్కొక్క వాక్యానికి ఒక్కో అర్థం ఉంది. ఆధ్యాత్మికత, ఒక ఊపు, వేగం, సాహస విన్యాసాలు, సంఘటిత శక్తి, వ్యవసాయ నేపథ్యం, మన ఆహారపు సంస్కృతి, ఆర్థికస్థితి ఇన్ని అంశాలు ఈ పాటలో ఉన్నాయి.
దీనితోపాటు అద్భుతమైన చిత్రీకరణతో ఈ పాటను విశ్వ వేదికపైకి తీసుకెళ్లారు. పాట ఉద్దేశాన్ని ప్రేక్షకులు సంపూర్ణస్థాయిలో అర్థం చేసుకున్నారు. అందరినీ ఉర్రూతలూగించాలనే లక్ష్యంతో ఈ పాటకు రూప కల్పన చేశాం. అది నెరవేరింది. ఈ పాట పురస్కారానికి అర్హ త సాధించింది. ఆస్కార్ అనేది అందరికి గగన కుసుమం. ఆస్కార్ కల కనడానికి కూడా ఆ ధైర్యం, సాహసం ఎవరూ చేయలేదు. ఇప్పుడు నిస్సందేహంగా, నిరభ్యంతరంగా ఆస్కార్ కలను అందరూ కనొచ్చు. ఆ కలను నిజం చేయడానికి ప్రయత్నించవచ్చనే ఓ ద్వారం తెరిచింది ఈ పురస్కారం.
ఆస్కార్ నామినేషన్స్‌లో ‘నాటు నాటు’ పాట ఉందని తెలిసినప్పటి నుంచి యావత్ తెలుగు సినీ పరిశ్రమతో పాటు నా బంధువులు, స్నేహితులు అందరూ మనస్ఫూర్తిగా అవార్డు దక్కాలని కోరుకున్నారు. వారి కల ఫలించింది. వారిలో కొంతమంది అవార్డు వచ్చిన తరువాత మొక్కులు చెల్లిస్తున్నారు. మరికొంత మంది యాత్రలకు వెళుతున్నారు.
‘నాటు నాటు’కు ఆస్కార్ పురస్కారం లభించడంలో గీత రచయితగా మీ కృషి ఎంతవరకు ఉందనుకుంటారు?
ఇది సాహిత్యంతోపాటు సహనానికి, లక్ష్యం చేరడానికి ఎక్కడా విసుగు, విరామం లేకుండా చేసిన కృషికి లభించిన పురస్కారం. సాహిత్యంతోపాటు నా సహనం కూడా ఇందులో మిళితమై ఉంది. ఈ పాట కోసం రామ్‌చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి, కీరవాణి, ప్రేమ్క్ష్రిత్, కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ అందరూ కష్టపడ్డారు. ఇంతమంది తదేక దీక్ష, కఠోర శ్రమకు లభించిన గౌరవం ఇది.
అవార్డుల విషయంలో మీ ఆలోచనలు ఎలా ఉండేవి?
గీత రచయితగా మీ స్వప్నం ఏమిటని ఎవరైనా ప్రశ్నించినప్పుడు జాతీయ అవార్డు సాధించడం అని చెప్పేవాడిని. ప్రతి సంవత్సరం ఎదురుచూసేవాణ్ని. అయితే ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు జాతీయ పురస్కారం కాకుండా గోల్డెన్‌గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్, హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డు, ఆస్కార్ల రూపంలో నాలుగు అంతర్జాతీయ పురస్కారాలు లభించడం ఆనందంగా ఉంది.
నాటు నాటు పాట రాయడానికి మీకు ఎంత సమయం పట్టింది?
‘నాటు నాటు’ పాట రాయడానికి 19 నెలల సమయం పట్టింది. 90 శాతం పాటను 45 నిమిషాల్లో పూర్తి చేశాను. కానీ, మిగతా పదిశాతం పాటకు 19 నెలల సమయం పట్టింది. ఇందుకు ఎన్ని కారణాలు ఉన్నా అత్యుత్తమంగా ఆ పాట ఉండాలనేది మా అంతిమ లక్ష్యం. చివరికి ఉక్రెయిన్‌లో పాట చిత్రీకరణ జరుగుతున్నప్పుడు కూడా కొన్ని పదాలు మార్చాను. పాట నన్ను వదల్లేదు.. పాటను నేను వదల్లేదు!
ఇప్పటివరకు మీరు ఎన్నో స్ఫూర్తివంతమైన గీతాలు రాశారు? వాటితో పోల్చుకుంటే ‘నాటు నాటు’కు ఉన్న ప్రత్యేకత ఏమనుకుంటున్నారు?
ఇప్పటివరకు 29 స్ఫూర్తివంతమైన గీతాలు రాసే అదృష్టం కలిగింది. అయితే వాటికి రాని అవార్డు ‘నాటు నాటు’కు రావడానికి కారణం ఉంది. ఈ పాట ఉద్దేశం వేరు. సాధారణంగా పాట సినిమాలో ఒక భాగం. కానీ, ఈ పాటే ఒక చిన్నపాటి సినిమా! ఇందులో అవమానం, ధైర్యం, ఆవేశం, సాహసం, స్నేహం, ప్రేమ, త్యాగం, విజయం అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ పాట ఆస్కార్ వరకు వెళ్లింది. అన్ని రకాల ఉద్వేగాలు మిళితమైన పాట ఇది. అందుకే ఇంతమంది హృదయాలను చూరగొంది. ఈ పాట విజయంలో అందరి భాగస్వామ్యం సమానంగా ఉన్నా.. ఇందులో పూర్తిభాగం రాజమౌళిది. ఈ పురస్కారం ఆయనకే చెందుతుంది.
ఎప్పుడైనా ఆస్కార్ అవార్డు అందుకోవాలనే ఆలోచన కలిగిందా?
పొరపాటున కూడా ఆలోచన రాలేదు. కనీసం ఆస్కార్ పేరు విన్నాను. కానీ గోల్డెన్ గ్లోబ్, హాలీవుడ్ క్రిటిక్స్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల పేర్లు కూడా తెలియదు. 2018లో నేను ఒకసారి లాస్ఏంజెల్స్ వెళ్లినప్పుడు, ఒక స్నేహితుడు డాల్బీ స్టూడియోను చూపిస్తూ ఇక్కడే ఆస్కార్ అవార్డులు ఇస్తారని చెప్పాడు. ‘చూద్దాం రా’ అంటే మనకు సంబంధం లేదు కాబట్టి రానని చెప్పాను. కాసేపటికి చూద్దాం అనుకుంటే ఆ రోజు అనుమతి లభించలేదు. ఇప్పుడు అదే డాల్బీ థియేటర్లో రెడ్‌కార్పెట్ మీద నడుచుకుంటూ వెళ్లాను. విశ్వ యవనికపై తెలుగు పాట మెరిసింది. అదే జీవితమంటే! మారుమూల పల్లెటూరిలో అక్షర జ్ఞానం లేని వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నేను నేడు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కృషి, తపన, పట్టుదల, ఆసక్తి, నిరంతర జ్వలన, నిత్యసాధనం, అధ్యయనం, అన్వేషణ కారణం. పట్టు వదలకుండా ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో, లక్ష్యసాధన కోసం పనిచేస్తే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికైనా ఎదగవచ్చు అనడానికి ఇదొక ఉదాహరణ.
ఈ విజయంలో మీ శ్రీమతి పాత్ర?
నాకు జన్మనిచ్చింది నా తల్లిదండ్రులైతే.. నాలో చైతన్యాన్ని, నిత్యస్ఫూర్తిని కలిగించింది మాత్రం నా శ్రీమతి సుచిత్ర. నా కుటుంబాన్ని ఆమె గొడుగులా కాపాడుతుంటే, నేను పాటల మీద దృష్టి పెట్టేవాణ్ని. నా పురస్కారం ఆమెకే అంకితం. అంతేకాదు నా కెరీర్ ఎదుగుదలకు సినీ పరిశ్రమ పెద్దలు, నా కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ కారణమే.
ఆస్కార్ అవార్డ్ మీపై ఎలాంటి బాధ్యత పెంచిందనుకుంటున్నారు?
మనలో తెలియకుండా ఓ మెట్టు ఎక్కామనే భావన కలుగుతుంది. మనం ఇది చేయాలి.. ఇది చేయకూడదు, ఇది రాయాలి.. ఇది రాయకూడదు అనే నిబంధనలు వచ్చి చేరతాయి. ఇంకా అర్థవంతమైన, స్ఫూర్తినిచ్చే గీతాలు రాయాలి అనే విధంగా మానసికంగా ప్రిపేర్ అవుతాం. ఆస్కార్ లాంటి పురస్కారాలు భవిష్యత్తునే కాదు, గతాన్ని కూడా మారుస్తాయి. బాధ్యతను పెంచుతాయి. గతంలో రాసిన పాటలకు ఇప్పుడు ఇంకా ఎక్కువ గుర్తింపు వస్తుంది. గతాన్ని మార్చేసే శక్తి కూడా ఇలాంటి అవార్డుకు ఉంది.
ఆస్కార్ అవార్డు తెలుగు భాషకు లభించిన పురస్కారం అనుకుంటున్నారా?
కచ్చితంగా… విశ్వవేదికపై నేను పలికిన ఒకే ఒక మాట ‘నమస్తే’. అక్కడినుంచి తెలుగు వెలుగును ప్రపంచానికి ప్రసరింపజేశాను. తెలుగు అనే భాష ఒకటుంది అని విశ్వమంతా తెలిసిపోయింది. ‘నమస్తే’ అని ఆ వేదికపై పలకడం ఓ చరిత్ర. అందుకు నేను గర్వపడుతున్నాను. ఓ తెలుగువాడిగా మురిసిపోతున్నాను.
భవిష్యత్‌లో మీ నుంచి ఎలాంటి పాటలు ఆశించవచ్చు?
వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్లాలి. పురస్కారాలు వస్తే ఆనందంగా స్వీకరించాలి. అయితే అవార్డులు రాకపోయినా రాయకుండా ఆగలేను.. కుంగిపోను. ఎన్నో అద్భుతమైన, జనరంజకమైన పాటలు రచించాను. మన పని మనం నిజాయితీగా చేసుకుంటూ వెళ్తే రావాల్సిన గుర్తింపు అదే వస్తుంది.
Chandrabose1
ఈ పురస్కారం అందుకునే దిశగా మిమ్మల్ని నడిపించిన పాటలు ఏమైనా ఉన్నాయని భావిస్తున్నారా? వాటి గురించి వివరించండి.
నాకు నేను అవార్డులు ఇచ్చుకున్న గొప్ప పాటలు ఎన్నో ఉన్నాయి. ఉపోద్ఘాత గీతాలు, పరిచయ గీతాలు అన్ని అవార్డులకు అర్హత ఉన్నవే. తెలుగు సాహిత్యంలో
పాట రాయడానికి ఎన్నో సందర్భాలున్నాయి. స్ఫూర్తినింపే గీతాలు, ప్రబోధాత్మక గీతాలు, దైవభక్తి, దేశభక్తి, ప్రేమ, ఎడబాటు, సరసం, శృంగారం, అల్లరి, కట్టుబాట్లు, భాష, ఆచారాలు, సంప్రదాయాలు, బంధాలు, అనుబంధాలు, విలువలు, ఇన్ని రకాలుగా… ఎన్నో సందర్భాలకు తగినట్లుగా రాసే అవకాశం దక్కింది. ఇది మన భారతీయ భాషల్లోనే సాధ్యం. మన సాహిత్యం, మన పాట ఎంతో గొప్పది. నేను ఇన్ని భావోద్వేగాలు మేళవించిన పాటలు రచించిన సంగతి ఆస్కార్ వాళ్లు గమనించారో లేదో తెలియదు. కానీ, భగవంతుడు గమనించాడు. నాకు అర్హత ఉంది అని నిర్ణయించాడు. అందుకే ఈ పురస్కారం వరించింది.
రంగస్థలంలోని ‘ఓరయ్యో.. నా అయ్యా’ లాంటి పాటను రాయడానికి ఎవరూ సాహసించరు. అలాంటి పాట రాసే అవకాశం నాకు దొరికింది. అలాగే ‘పుష్ప’లో ‘ఊ.. అంటావా మామ.. ఉఊ అంటావా మామ’ కూడా ఎంతో గొప్ప పాట. ఆడవాళ్లను కొందరు మగవాళ్లు చూసే కోణాన్ని తెలిపే గీతం అది. మహిళల విషయంలో మగాళ్ల బుద్ధి ఎలా ఉంటుందో పాట రూపంలో చెప్పే సాహసం చేశాను. ఇప్పటి వరకు నా కెరీర్లో 860 సినిమాల్లో 3,600 పాటలు రాశాను.
నాటు నాటు పాటలో ఆధ్యాత్మిక శక్తి, వేగం, చిన్న గగుర్పాటుతో పాటు ఊపు, నాటుదనం, సంఘటిత శక్తి, వ్యవసాయ నేపథ్యం, మన ఆహార సంస్కృతి, ఆర్థికస్థితి.. ఇలా అన్ని ఉద్వేగాలు కలగలిసి ఉన్నాయి.
…? మడూరి మధు
సి.ఎం. ప్రవీణ్