Zhuhai Accident | చైనాలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. జుహైలో జనంపైకి వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 35 మంది దుర్మరణం చెందగా.. 43 మందికిపైగా గాయపడ్డారు. చైనా ప్రతిష్టాత్మక ఎయిర్ షో ప్రస్తుతం జుహైలో కొనసాగుతున్నది. దీంతో నగరంలో భారీగా రద్దీ ఉన్నది. హై ప్రొఫైల్ ఈవెంట్ నేపథ్యంలో.. ఓ కారు స్పోర్ట్స్ సెంటర్లో వ్యాయామం చేస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. అయితే, ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందా? అన్నది తెలియరాలేదు. 62 సంవత్సరాల డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ప్రతిష్టాత్మకంగా జుహై ఎయిర్ షోకు ఒక రోజు ముందు ఈ ఘటన చోటు చేసుకున్నది.
డ్రైవర్ పేరును ఫ్యాన్‌గా గుర్తించారు. జియాంగ్జౌలోని స్పోర్ట్స్ సెంటర్‌కు జనం క్రమం తప్పకుండా వందలాది మంది వెళ్తుంటారు. అక్కడ ఉండే ట్రాక్‌పై పరుగెత్తడంతో పాటు సాకర్ ఆడొచ్చు. అలాగే, ఇతర వ్యాయామాలతో పాటు డ్యాన్స్ సైతం చేసే అందుకు అవకాశం ఉంటుంది. ఈ ఘటన అనంతరం స్పోర్ట్స్ సెంటర్‌ని మూసివేశారు. ఈ ఘటనపై అధ్యక్షుడు జిన్‌పింగ్ సంతాపం ప్రకటించారు. జుహై నగరంలో జరిగిన కారు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు అధ్యక్షుడు జి జిన్‌పింగ్ సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారి చికిత్సకు అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. నిందితుడిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని జీ జిన్‌పింగ్ ఆదేశాలు కూడా ఇచ్చారని జిన్హువా నివేదిక పేర్కొంది.