బీజింగ్: చైనాకు చెందిన జాంగ్ జుక్వియాంగ్(25) అనే కుర్రాడు యువతకు ఆదర్శంగా నిలిచాడు. చేసేది ఫుడ్ డెలివరీ బాయ్ ఉద్యోగమైనా రోజుకు 13 గంటల పాటు పని చేస్తూ 5 ఏండ్ల కాలంలో రూ.1.42 కోట్లు కూడబెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. షాంఘై లాంటి నగరంలో సాధారణ జీవితం జీవిస్తూ అనుకున్నది సాధించాడు. అయితే అతడి ప్రస్థానం నల్లేరు మీద బండి నడకలాగా సాగలేదు.
2020లో తన సొంతూరిలో అతడు ఒక బ్రేక్‌ఫాస్ట్ సెంటర్ ప్రారంభించి సుమారు రూ.6 లక్షలు అప్పుల పాలయ్యాడు. ఆ అప్పులు తీర్చి తన కాళ్ల మీద తాను నిలబడాలనే పట్టుదలతో షాంఘైకి వలస వచ్చి ఫుడ్ డెలివరీ ఏజెంట్ గా చేరాడు. అప్పులు తీర్చడమే కాకుండా కనీసం కోటి రూపాయలు పొదుపు చేయాలన్నది అతడి లక్ష్యం.
జాంగ్ ప్రతిరోజూ 13-14 గంటల పాటు పని చేస్తాడు. ఉదయం 10.40 నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు ఆర్డర్లు డెలివరీ చేస్తాడు. సెలవులు తీసుకోకుండా పని చేస్తాడు. డెలివరీ సమయంలో ఎప్పుడూ పరిగెడుతూనే ఉంటాడు. దీంతో తోటి రైడర్లు అతడిని గౌరవంగా ఆర్డర్ కింగ్ అని పిలుస్తారు. డబ్బు పొదుపులో భాగంగా జాంగ్ వ్యసనాలకు, లగ్జరీ ఖర్చులకు దూరంగా ఉన్నాడు. డబ్బు ఆదా కోసం విద్యుత్తు బైక్ వాడాడు. అయిదేండ్లలో సుమారు 3.24 లక్షల కిలోమీటర్లు ప్రయాణించాడు. ప్రస్తుతం తన దగ్గర ఉన్న సేవింగ్స్‌తో షాంఘైలో రెండు రెస్టారెంట్లు ప్రారంభించాలనేది అతడి ప్రణాళిక.