న్యూయార్క్, ఆగస్టు 17 : రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు జరుగుతున్న తీవ్ర ప్రయత్నాల్లో తుది అడుగుగా భావించే చర్చలకు అమెరికా వేదిక కానున్నది. ఇరు దేశా ల సంఘర్షణకు తెరదించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రం ప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, యూరోపియన్ నేతలు సోమవారం సమావేశం కానున్నారు. అలస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చల తర్వాత ట్రంప్ నేరుగా జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడారు. యుద్ధానికి ఒక ముగింపు పలికేందుకు సోమవారం చర్చలు జరపాలని ప్రతిపాదించగా, దానికి జెలెన్స్కీ అంగీకరించారు. దీంతో సోమవారం నాటి చర్చల్లో జెలెన్స్కీతో పాటు ఆయనకు మద్దతుగా పలువురు యూరోపియన్ నేతలు కూడా పాల్గొంటున్నారు. అలస్కా చర్చలు పూర్తి ఫలవంతంగా జరిగాయని ప్రకటించిన ట్రంప్, ఆ సమావేశంలో ఎలాంటి ఒప్పందం కుదరలేదని వెల్లడించారు.
కాగా, తాను ట్రంప్‌తో సుదీర్ఘమైన, ముఖ్యమైన సంభాషణ జరిపానని, యూరోపియన్ నేతలు కూడా తనతో కలిశారని, చాలా ముఖ్యమైన అంశాలు చర్చించినట్టు జెలెన్స్కీ తెలిపారు. రెండు దేశాల మధ్య యుద్ధానికి ముగింపు పలికేందుకు సోమవారం తాను యూఎస్‌కు బయలుదేరుతున్నట్టు ఆయన చెప్పారు. చర్చలకు ఆహ్వానం పలికిన ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి అంతం పలికేందుకు, సాధారణ ప్రజల మరణాలకు ముగింపు పలికే దిశగా ట్రంప్‌తో సమగ్రంగా చర్చిస్తానని జెలెన్స్కీ సామాజిక మాధ్యమంలో పోస్ట్ పెట్టారు. ఉక్రెయిన్-రష్యా సంఘర్షణను తెరదించడానికి యూరోపియన్ దేశాలు సహకరించాలని ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు. అమెరికాతో పాటు యూరోపియన్ దేశాల నుంచి తమ భద్రతకు హామీ కోరుతున్నామన్నారు. సెక్యూరిటీ గ్యారంటీ కావాలని ఉద్ఘాటించారు.
అలస్కా సమావేశంలో యుద్ధం పూర్తిగా ముగించడానికి పుతిన్ ఒక ప్రధాన డిమాండ్‌ను ట్రంప్ ముందుంచారు. ఉక్రెయిన్ తూర్పు డాన్బాస్ ప్రాంతంలోని మిగిలిన భాగాన్ని తమకు వదిలేయాలని, దీనికి ప్రతిగా రష్యా ఆక్రమించిన చిన్ని ప్రాంతాలను ఉక్రెయిన్‌కు తిరిగి ఇచ్చేస్తుందని ఆయన ట్రంప్‌నకు ప్రతిపాదించారు. రష్యా అధ్యక్షుడి డిమాండ్‌కు తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ తెలిపారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ప్రస్తుతం డొనెట్స్క్లో 30 శాతం మాత్రం ఉక్రెయిన్ చేతిలో ఉంది. ఎక్కువ భాగం ఇప్పటికే రష్యా సొంతం చేసుకుంది. దీంతో మిగిలిన భాగం ఆక్రమణకు రష్యా కన్నేసింది. బొగ్గు, ఇతర ఖనిజ నిల్వలు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. సమావేశం తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఫోన్ చేసినప్పుడు ట్రంప్ రష్యా డిమాండ్ గురించి తెలియజేయగా, ఆయన తిరస్కరించినట్టు తెలిసింది.
యూఎస్‌లో సోమవారం నాటి చర్చల్లో ట్రంప్, జెలెన్స్కీతో పాటు ఆయ నకు మద్దతుగా యూరప్ నేతలు కూడా పాల్గొంటున్నారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్, జర్మన్ చాన్స్‌లర్ ఫ్రెడ్రిచ్ మెర్జ్, ఫిన్నీష్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సుల వాండర్ లేయన్, నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే తదితరులు చర్చల్లో పాల్గొంటున్నారు.