Ukraine | ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ తమ దేశంలో యుద్ధాన్ని ఆపి శాంతి స్థాపన కోసం భారత్ కీలకంగా వ్యవహరించాలని కోరారు. తక్షణమే కాల్పుల విరమణ జరిగేలా చర్యలు తీసుకోవాలని, రాబోయే షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు వేదికగా రష్యాకు బలమైన సందేశం పంపాలని ఆయన ప్రధాని నరేంద్ర మోదీని అభ్యర్థించారు. చైనా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు ఫోన్ చేసి మాట్లాడారు. గడిచిన నెల రోజుల్లో ఇద్దరు నేతలు ఫోన్లో మాట్లాడుకోవడం ఇది రెండోసారి. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ప్రకటన ప్రకారం.. జెలెన్స్కీ ఉక్రెయిన్‌లోని తాజా పరిణామాలు, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు యూరప్ నేతలతో చర్చల వివరాలు ప్రధానితో పంచుకున్నారు. దీనికి ప్రతిస్పందనగా మోదీ, ఈ సంక్షోభానికి శాంతియుత పరిష్కారమే సరైన మార్గమని భారత్ ఎల్లప్పుడూ విశ్వసిస్తుందని పునరుద్ఘాటించారు.
శాంతి సాధన కోసం చేపట్టే అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతు ఇస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ఇరువురూ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని కూడా ఈ సందర్భంగా చర్చించారు. ఫోన్ సంభాషణ అనంతరం జెలెన్స్కీ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘మా పట్టణాలపై వరుస దాడులు జరుగుతున్న సమయంలో శాంతి చర్చలు ఫలప్రదం కావు. తక్షణ కాల్పుల విరమణ జరగాలి. ఈ యుద్ధానికి ముగింపు ఇక్కడి నుంచే మొదలవ్వాలి’ అని పేర్కొన్నారు. ఎస్సీవో సదస్సులో భారత్ రష్యా సహా ఇతర దేశాలకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వగలదని ఆశిస్తున్నట్లు తెలిపారు. అలాగే, త్వరలోనే ప్రధాని మోదీని ప్రత్యక్షంగా కలుసుకోవాలనే ఆకాంక్ష వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రధాని మోదీ చైనాలోని టియాంజిన్‌లో షాంఘై సహకార సంస్థ హాజరవుతున్నారు. ఈ వేదికపైనే ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. ఈ కీలక భేటీకి ముందు జెలెన్స్కీ ప్రధాని మోదీకి ఫోన్ చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది.