Ukraine Presendent : పశ్చిమాసియా (Wesia Asia) లో యుద్ధంవల్ల అమెరికా (US) ప్రాధాన్యతలు మారుతున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు (Ukraine President) వ్లాదిమిర్ జెలెన్స్కీ (Vlodimir Zelensky) ఆందోళన వ్యక్తంచేశారు. ఇన్నాళ్లు తమకు అమెరికా నుంచి అందిన సైనిక, ఆయుధ సరఫరాను ఆ యుద్ధం కారణంగా తగ్గించి, వాటిని ఇజ్రాయెల్ (Israel) కు మళ్లిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే అగ్రరాజ్యం నుంచి తమకు వస్తున్న మద్దతు భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశం ఉందన్నారు.
రష్యా ప్రయోగిస్తున్న బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోవడానికి ఇన్నాళ్లు తాము అమెరికా సరఫరా చేసే పేట్రియాట్ వైమానిక రక్షణ వ్యవస్థలను ఉపయోగించామని జెలెన్స్కీ చెప్పారు. ఇప్పుడు వాటి సరఫరా నిలిచిపోవడంతో యుద్ధంలో తీవ్రంగా నష్టపోతున్నామని అన్నారు. తమ ఆయుధ నిల్వలు రోజురోజుకు తగ్గిపోతున్నాయని జెలెన్స్కీ వాపోయారు. కొద్దికాలంగా అమెరికా మద్దతు తగ్గుతుండటంతో స్వదేశీ డ్రోన్ల తయారీని పెంచామని చెప్పారు. కాగా డ్రోన్లు, క్షిపణుల ఉత్పత్తికి అంతరాయం కలిగించడానికి రష్యా తమ ఇంధన నిల్వలను టార్గెట్ చేయడం ఇబ్బందికరంగా మారిందన్నారు.
పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడటంతో మిత్ర దేశాల నుంచి కూడా ఎలాంటి సాయం అందట్లేదని జెలెన్స్కీ అన్నారు. మరోవైపు యుద్ధం ముగింపునకు అమెరికా మధ్యవర్తిత్వంతో జరుగుతున్న చర్చల్లోనూ పురోగతి కనిపించట్లేదని ఆవేదన వ్యక్తంచేశారు. అదే అదునుగా తీసుకొని రష్యా తమపై దాడులను మరింత తీవ్రం చేస్తోందని అన్నారు. పశ్చిమాసియా యుద్ధంవల్ల రష్యా ఆర్థిక ప్రయోజనాలు పొందుతోందని జెలెన్స్కీ ఆరోపించారు. ఇరాన్ హర్మూజ్‌ను మూసివేయడంతో ప్రపంచ దేశాలు మళ్లీ రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తున్నాయని అన్నారు.
దాంతో ఆర్థికంగా లబ్ధి పొందుతున్న మాస్కో తమ సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నదని జెలెన్స్కీ అన్నారు. ఇరాన్ ప్రయోగిస్తున్న డ్రోన్లను ఎదుర్కోవడానికి తమ సైనిక నిపుణులు గల్ఫ్ దేశాలకు సాయం చేస్తున్నట్లు జెలెన్స్కీ తెలిపారు. తద్వారా ఆయా దేశాలు తమవద్ద ఉన్న యాంటీ-బాలిస్టిక్ క్షిపణులను తమకు సరఫరా చేసే అవకాశం ఉందని అన్నారు.