Zelensky : మూడేళ్లుగా రష్యా (Russia) తో జరుగుతున్న యుద్ధంలో ఉపయోగిస్తున్న ఆయుధాల్లో 60 శాతం తమ దేశంలో ఉత్పత్తి చేసినవేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు (Ukraine president) జెలెన్స్కీ (Zelensky) చెప్పారు. ఇతర దేశాల నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నప్పటికీ.. స్వదేశీ ఉత్పత్తులపైనే ఎక్కువగా దృష్టి పెట్టామన్నారు. ఓ వైపు సంఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ కీవ్ బలమైన, అత్యాధునిక ఆయుధాలను తయారుచేసే స్థాయికి ఎదగడం గర్వకారణమని చెప్పారు.
అయితే తాము సాధించాల్సిన లక్ష్యాలు ఇంకా ఉన్నాయని జెలెన్స్కీ అన్నారు. ప్రస్తుతం గగనతల రక్షణ వ్యవస్థల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇతర దీర్ఘశ్రేణి ఆయుధాలు, క్షిపణుల కోసం మిత్ర దేశాలతో త్వరలో చర్చలు జరపనున్నట్లు చెప్పారు. రష్యా దాడులను తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్ తన దేశీయ రక్షణ పరిశ్రమలను గణనీయంగా విస్తరించినట్లు కీవ్ అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఇందులో భాగంగానే ఇటీవల గగనతల రక్షణ వ్యవస్థలతోపాటు రెండు కొత్త బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధి చేసినట్లు కీవ్ వర్గాలు తెలిపాయి. విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు 2025 బడ్జెట్లో ఉక్రెయిన్ సర్కారు భారీ కేటాయింపులు చేసినట్లు తెలిసింది. ఇదిలావుంటే చైనా పర్యటన అనంతరం రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ.. యుద్ధం ముగింపుపై చర్చలు జరపడానికి మాస్కోకు రావాలని జెలెన్స్కీని ఆహ్వానించారు.
దీనిపై జెలెన్ స్కీ స్పందిస్తూ తమ పౌరుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న ఆ ఉగ్రరాజధానిలో తాను ఎన్నటికీ కాలు మోపనని స్పష్టంచేశారు. చర్చలను మరింత ఆలస్యం చేయడానికే పుతిన్ ఇలాంటి రాజకీయ యుక్తులు పన్నుతున్నారని, అమెరికాతోనూ ఆటలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. యుద్ధం ముగింపు కోసం ఓ నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన పుతిన్‌కు ఉంటే ఆయనే కీవ్‌కు రావాలన్నారు.