Bangladesh | ఢాకా : సైన్యం, రాజకీయ పార్టీల నుంచి విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న మహమ్మద్ యూనస్ సారథ్యంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి మరో కొత్త సవాలు ఎదురైంది. గత శనివారం నుంచి సివిల్ సర్వెంట్స్ సమ్మె చేస్తుండగా తాజాగా తమ జీతాలు పెంచాలని డిమాండు చేస్తూ ప్రైమరీ అసిస్టెంట్ టీచర్స్ యూనిటీ కౌన్సిల్ పేరుతో టీచర్లు సోమవారం నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించారు.
దేశంలో త్వరితంగా ఎన్నికలు నిర్వహించాలని సైన్యాధ్యక్షుడు జనరల్ వకర్ ఉజ్ జమాన్ ఆదేశించిన దరిమిలా తన పదవికి రాజీనామా చేస్తానని యూనస్ బెదిరించినట్లు వార్తలు వచ్చిన కొన్ని రోజుల్లోనే ఆపద్ధర్మ ప్రభుత్వానికి అన్ని వైపుల నుంచి నిరసనలు ఎదుర్కొనే పరిస్థితి తలెత్తింది. దుష్ప్రవర్తనకు పాల్పడిన సివిల్ సర్వెంట్స్‌ని 14 రోజుల్లోగా ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేసేందుకు అనుమతినిస్తూ యూనస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. దీనిపై బ్యూరోక్రసీ నుంచి తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలకు తమ ఆందోళనను విస్తరిస్తామని సివిల్ సర్వెంట్స్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
గడచిన కొన్ని వారాలుగా యూనస్ ప్రభుత్వం రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. త్వరితంగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండు చేస్తూ బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ(బీఎన్పీ)తోసహా వివిధ రాజకీయ పార్టీలు ఇటీవల నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. తాను చేపట్టనున్న కీలకమైన సంస్కరణలకు రాజకీయ పార్టీల నుంచి మద్దతు లేని కారణంగా తన పదవికి రాజీనామా చేస్తానని మే 23న యూనస్ హెచ్చరించారు. ఎన్నికల కార్యాచరణను ప్రకటించాలని బీఎన్పీ డిమాండు చేస్తుండగా డిసెంబర్‌లోగా ఎన్నికలు నిర్వహించాలని జమాన్ హెచ్చరికలు జారీ చేసింది.
అధికారాన్ని పట్టుకుని వేళ్లాడేందుకే యూనస్ ఎన్నికలను జాప్యం చేస్తున్నారని ఖలీదా జియా నేతృత్వంలోని బీఎన్పీ ఆరోపించింది. కాగా, యూనస్ మద్దతుదారులైన విద్యార్థి నాయకులకు చెందిన నేషనల్ సిటిజన్స్ పార్టీ ఢాకాలో యూనస్‌కు మద్దతుగా ర్యాలీ నిర్వహించాలని సంకల్పించింది. తమ ప్రభుత్వానికి ఆటంకాలు కల్పిస్తే ప్రజల మద్దతుతో చర్యలు తీసుకుంటామని కూడా యూనస్ ప్రభుత్వం హెచ్చరించింది. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం కోసం వివిధ రాజకీయ పార్టీలతో యూనస్ గత వారాంతంలో అనేక సమావేశాలు నిర్వహించారు. దేశంలో సాధ్యమైనంత త్వరలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడాలని రాజకీయ పార్టీలు, సైన్యాధ్యక్షుడు జమాన్ పట్టుపడుతున్న నేపథ్యంలో దేశంలో రోజురోజుకూ రాజకీయ అనిశ్చితి పెరుగుతున్నది.