కైరో, జూన్ 1: సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి సహకరించారన్న ఆరోపణతో యెమన్లోని హౌతీ తిరుగుబాటుదారుల ఆధ్వర్యంలో నడిచే న్యాయస్థానం 44 మందికి శనివారం మరణశిక్ష విధించింది. శిక్షపడిన వారిలో ఆ గ్రూపులకు సహాయం చేశారని, గూఢచార్యం నడిపారన్న ఆరోపణలు ఎదుర్కొన్న అద్నాన్ అల్-హజారీ అనే వ్యాపారవేత్త కూడా ఉన్నారు. శత్రుత్వం కారణంగా 2015 నుంచి సౌదీ ప్రభుత్వం నేతృత్వంలోని కొన్ని సంస్థలతో హౌతీలకు యుద్ధం నడుస్తున్నది. కాగా, యెమెన్లో అంతర్యుద్ధం కారణంగా వేలాది మందిని హౌతీలు జైలులో ఉంచారు. సౌదీ అరేబియా దేశానికి చెందిన సంస్థలతో సంబంధాలు పెట్టుకున్న వారికి కోర్టులు కఠిన శిక్షలు విధిస్తూ ఉంటాయి.