న్యూఢిల్లీ, జనవరి 26 : చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తన సన్నిహిత మిత్రుడు, అత్యంత శక్తివంతమైన సైనికాధికారి జనరల్ జాంగ్ యూజియాను పదవి నుంచి తొలగించారు. చైనాకు చెందిన సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ) ఉపాధ్యక్షుడిగా జాంగ్ వ్యవహరిస్తున్నారు. కాగా, ఇటీవలే మరో నలుగురు సీఎంసీ జనరల్స్‌ని చైనా పదవుల నుంచి తప్పించింది. అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కి వ్యతిరేకంగా జాంగ్, ఇతర జనరల్స్ తిరుగుబాటుకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ జనరల్స్‌లో కొందరు హత్యకు గురైనట్లు తెలుస్తున్నది.
చైనాలో ఏక పార్టీ వ్యవస్థ అమలులో ఉంది. చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) ప్రధాన కార్యదర్శే సెంట్రల్ మిలిటరీ కమిషన్(సీఎంసీ) అధ్యక్షుడు, చైర్మన్ పదవుల్లో ఉండడం విశేషం. చైనా సైన్యం సీఎంసీ నియంత్రణలో ఉంటుంది. ప్రస్తుతం జిన్‌పింగ్ ఈ మూడు కీలక పదవులనూ తానే నిర్వహిస్తున్నారు. జీ కన్నా ఒక ర్యాంకు తక్కువగా సీఎంసీ ఉపాధ్యక్షుడి హోదాలో జాంగ్ ఉన్నారు. చాలాకాలంగా వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. వారిద్దరూ మంచి స్నేహితులు కూడా. జాంగ్ తండ్రి జాంగ్ జోంగ్జన్, జీ పిన్‌పింగ్ తండ్రి జీ జోంగ్జన్ ఇద్దరూ షాన్జీ ప్రావిన్సులోని వైనాన్ ప్రాంతానికి చెందినవారు. 1949లో మావో జెడాంగ్ సారథ్యంలో జరిగిన చైనా విప్లవ కాలంలో వారిద్దరూ సైన్యం జనరల్స్‌గా పనిచేశారు. ఈ విప్లవమే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా స్థాపనకు దారితీసింది. విప్లవ కాలం నాటి కీలక నాయకులు, ప్రముఖ సైనికాధికారుల కుమారులను యువరాజులుగా ప్రస్తావిస్తుంటారు. జాంగ్ కూడా అలాంటి యువరాజులలో ఒకరు. 1968లో తన 18వ ఏట చైనా సైన్యంలో చేరిన జాంగ్ 1979 నాటి చైనా-వియత్నాం యుద్ధంలో ఆయన క్షేత్రస్థాయిలో పనిచేశారు. యుద్ధానంతరం ఆయన వృత్తిపరంగా వేగంగా ఎదిగారు. 2000 ఆగస్టులో 13వ గ్రూపు ఆర్మీ కమాండర్‌గా బాధ్యతలు చేపట్టిన జాంగ్ 2011లో పూర్తిస్థాయి జనరల్‌గా పదోన్నతి పొందారు. 2012లో జీ జిన్‌పింగ్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక చైనా ఆయుధ వ్యవస్థలకు చెందిన జనరల్ ఆర్మమెంట్స్ డిపార్ట్మెంట్ అధిపతిగా నియమితులయ్యారు. 2017 అక్టోబర్‌లో పార్టీకి చెందిన అత్యున్నత నిర్ణాయక మండలి అయిన పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నియమితులైన జాంగ్ 2020లో సీఎంసీ వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు.
అమెరికాకు కీలకమైన అణ్వస్ర్తాలకు సంబంధించిన సమాచారాన్ని లీక్ చేశారన్న ఆరోపణలపై జనరల్ జాంగ్ యూజియాపై చైనా దర్యాప్తు ప్రారంభించింది. క్రమశిక్షణ, చట్ట ఉల్లంఘనలకు సంబంధించిన తీవ్రమైన ఆరోపణలపై జాంగ్‌పై దర్యాప్తు చేపట్టినట్లు చైనా రక్షణ శాఖ వెల్లడించింది. అయితే ఇతర వివరాలను తెలియజేయలేదు.