Nigeria floods | నైజీరియాను వరదలు ముంచెత్తాయి. పలు పట్టణాలు, గ్రామాలు వరదలతో మునిగిపోయాయి. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 600 కు పైగా జనం మృతిచెందారు. లక్షలాది మంది నిరాశ్రయులుగా మారి రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయం కోసం ఎదురుచూస్తున్నారు. సరిగ్గా పదేండ్ల క్రితం ఇదే మాదిరిగా వరదలు సంభవించి దాదాపు 360 మంది చనిపోగా.. 2 లక్షల మంది నిరాశ్రులయ్యారు.
దశాబ్దంలో ఎన్నడూ లేనంతగా భారీ వరదలు నైజీరియాను చుట్టుముట్టాయి. ‘ఇది చాలా దురదృష్టకరం. ఈ వరదలకు 600 కన్నా ఎక్కువ మంది చనిపోయారు. అదేవిధంగా 13 లక్షలకుపైగా ప్రజానీకం ఇళ్లను విడిచిపెట్టారు’ అని నైజీరియా హ్యుమానిటేరియన్ అఫైర్స్ మంత్రిత్వశాఖ వెల్లడించింది.
గత నాలుగురోజులుగా వరదలు ముంచెత్తుతున్నా పలు రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు చేపట్టకపోవడంతో మృతుల సంఖ్య పెరిగిపోయినట్లుగా తెలుస్తున్నది. దాదాపు 2.72 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వానాకాలం సాధారణంగా జూన్లో ప్రారంభమై.. ఆగస్టు వరకు కొనసాగుతుంది.