The Mukaab | రియాద్, అక్టోబర్ 25: ప్రపంచంలోనే అతి పెద్ద భవన నిర్మాణం ప్రారంభమైంది. ‘ది ముకాబ్’ పేరుతో సౌదీ అరేబియా ఈ నిర్మాణాన్ని చేపట్టింది. రాజధాని రియాద్‌లో చేపట్టిన కొత్త నగరం ‘న్యూ మురబ్బా’లో దీనిని నిర్మిస్తున్నారు. 400 మీటర్ల ఎత్తు, వెడల్పుతో ‘క్యూబ్’ ఆకారంలో ఈ మహా నిర్మాణం ఉండనుంది. సౌదీ విజన్ 2030లో భాగంగా చేపడుతున్న ఈ నిర్మాణానికి ఏకంగా 50 బిలియన్ డాలర్లు (రూ.4.20 లక్షల కోట్లు)ను వెచ్చించనున్నారు. సౌదీ అరేబియా ప్రభుత్వ సంస్థ అయిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(పీఐఎఫ్)లో భాగమైన న్యూ మురబ్బా డెవెలప్మెంట్ కంపెనీ(ఎన్ఎండీసీ) దీనిని నిర్మిస్తున్నది. 20 లక్షల మిలియన్ చదరపు మీటర్ల ఫ్లోర్ స్పేస్‌తో ఈ భవనం ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద భవనాల్లో ఒకటైన న్యూయార్క్‌లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ లాంటివి 20 భవనాలు ఈ ఒక్క భవనంలో పడతాయి.
సంప్రదాయ నాజ్ది నిర్మాణశైలికి ఆధునికతను జోడించి ఈ ఆకాశహర్మ్యాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ భవనం పర్యాటకులను ఆకర్షించే అవకాశం ఉంది. భవనం లోపలి గోడలకు అధునాతన వర్చువల్ రియాలిటీతో పాటు భారీ హోలోగ్రామ్‌లను ఏర్పాటు చేయనున్నారు. లోపలికి అడుగుపెట్టగానే మరో ప్రపంచంలో ఉన్నామా అనే అనుభూతిని ఇవి కల్పించనున్నాయి.
ముకాబ్‌లో అనేక సదుపాయాలు ఉంటాయి. నివాసాలు, హోటళ్లు, షాపింగ్ మాళ్లు, కార్యాలయాలు, థియేటర్లు, మ్యూజియంలు, ఇలా ఒక నగరంలో ఉండాల్సిన అన్ని సదుపాయాలు, నిర్మాణాలు ఈ ఒక్క భవనంలోనే ఉంటాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ నివాస సదుపాయాలు ఇందులో ఉంటాయని పీఐఎఫ్ చెబుతున్నది. దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం చమురుపైనే ఆధారపడకుండా, ఇతర రంగాల వైపు మళ్లించే లక్ష్యంతో సౌదీ అరేబియా చేపట్టిన ప్రాజెక్టుల్లో ముకాబ్ ముఖ్యమైనది. 2030 నాటికి ఈ భవన నిర్మాణం పూర్తవుతుందని పీఐఎఫ్ ప్రకటించింది.