UK Elections | లండన్, జూన్ 19: కృత్రిమ మేథాతో రూపొందిన ‘ఏఐ అభ్యర్థి’ బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచాడు. ఒకవేళ అతడు గెలిస్తే.. ప్రపంచంలోనే మొట్టమొదటి ‘ఏఐ చట్టసభ సభ్యుడు’ అవుతాడని మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జూలై 4న జరగనున్న బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డ వ్యాపారవేత్త స్టీవ్ ఎండాకోట్(59)కు మరో రూపమే ‘ఏఐ స్టీవ్’. ఇతర అభ్యర్థుల మాదిరిగా కాకుండా, తన రూపాన్ని ‘ఏఐ’తో రూపొందించి ప్రచారంలోకి తీసుకొచ్చాడు.
కరపత్రంపైనా ముద్రించి పంచుతున్నాడు. ఈ ఎన్నికల తర్వాత పార్టీని స్థాపించి.. దేశవ్యాప్తంగా ‘ఏఐ అభ్యర్థుల’ను తీసుకొస్తానని స్టీవ్ ఎండాకోట్ చెబుతున్నాడు. ప్రస్తుతం నెలకొన్న రాజకీయాలతో విసుగుచెంది.. ‘బ్రైటన్ పెవిలియన్’ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలబడినట్టు చెప్పాడు. ఇదిలా ఉండగా, ఎన్నికల్లో గెలిస్తే.. ఎండాకోట్ ఎంపీ అవుతాడని, అతడి ఏఐ వెర్షన్ కాదని ఆ దేశ ఎలక్టోరల్ కమిషన్ స్పష్టతనిచ్చింది.