టోక్యో: రష్యాలో వచ్చిన భూకంపంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో జపాన్‌లోని ఫుకుషిమా అణు కేంద్రాన్ని (Fukushima Nuclear Power Plant) ఖాళీ చేస్తున్నారు. దాంట్లో పనిచేస్తున్న వర్కర్లను తరలిస్తున్నారు. 2011లో వచ్చిన సునామీతో ఆ అణు కేంద్రం దెబ్బతిన్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ కామ్చట్టా ద్వీపంలో 8.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ నేపథ్యంలో పసిఫిక్ తీర దేశాలకు అమెరికా జియోలాజికల్ సర్వే హెచ్చరికలు జారీ చేసింది. టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ .. తమ వర్కర్లకు అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ అణు కేంద్రంలో ఎటువంటి నష్టం జరగలేదు. కానీ స్థానిక అధికారులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్లాంట్ సమీపంలో ఉన్న న్యూక్లియర్ ట్యాంకర్లలో భారీగా అణు పదార్ధాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ప్లాంట్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఫుకుషిమా ప్లాంట్‌కు కనీసం 30 కిలోమీటర్ల దూరం వరకు ఎవరూ ఉండవద్దు అని ఆదేశాలు జారీ చేశారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం గ్రిడ్లాక్ ఉంది. ట్రాఫిక్ జామ్ అవుతోంది. కోస్టల్ ప్రాంతాల్లో కీలకమైన రైలు మార్గాలను మూసివేశారు.