కేన్స్/పోక్రోవ్స్, మే 21: ఫ్రాన్స్‌లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక కేన్స్ సినీ వేడుకల్లో శుక్రవారం అనూహ్య ఘటన చోటుచేసుకున్నది. ఉక్రెయిన్‌పై యుద్ధం పేరుతో రష్యా సైనికులు అక్కడి మహిళలపై సాగిస్తున్న లైంగిక హింసకు వ్యతిరేకంగా ఓ మహిళ ఆందోళనకు దిగింది. సభ రెడ్కార్పెట్కి వచ్చి దుస్తులు చింపేసుకొని అర్ధనగ్నంగా నిరసన వ్యక్తం చేసింది. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది సదరు మహిళకు బట్టలు కప్పి పక్కకు తీసుకెళ్లారు. నిరసన చేపట్టిన మహిళ చాతీ, పొట్టపై ఉక్రెయిన్ జెండా రంగులతో ‘Stop Raping Us(మాపై లైంగికదాడులు ఆపండి)’ అని రాసి ఉన్నది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా ‘త్రీ థౌజండ్ ఇయర్స్ ఆఫ్ లాంగింగ్’ మూవీ ప్రీమియర్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకున్నది.
అజోవ్‌స్తల్ ఫైటర్లు లొంగిపోయారు: రష్యా
ఉక్రెయిన్‌లోని కీలక పోర్టు నగరమైన మరియుపోల్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్టు రష్యా ప్రకటించింది. అజోవ్‌స్తల్ స్టీల్ ప్లాంట్‌కు విముక్తితో ఇది పూర్తయిందని పేర్కొన్నది. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు రక్షణ మంత్రి సెర్గేయ్ షోయిగు నివేదించారని అధికార ప్రతినిధి ఇగోర్ కొనాషెంకోవ్ శుక్రవారం పేర్కొన్నారు. అయితే రష్యా ప్రకటనపై ఉక్రెయిన్ ఇప్పటి వరకు స్పందించలేదు. సోమవారం నుంచి ప్లాంట్‌లో ఉన్న మొత్తం 2,439 మంది ఉక్రెయిన్ ఫైటర్లు లొంగిపోయారని, రష్యా సేనలు వారిని బందీలుగా తీసుకున్నదని రష్యా ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ ఆర్ఐఏ నొవోస్తి పేర్కొన్నది.
అమెరికా 40 బిలియన్ డాలర్ల సాయం
అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు మరో 40 బిలియన్ డాలర్ల (దాదాపు 3 లక్షల కోట్లు) సాయం అందనున్నది. అధ్యక్షుడు జో బైడెన్ దీనికి సంబంధించిన బిల్లుపై శనివారం సంతకం చేశారు.