Japan woman : ఆమె పని ప్రదేశంలో వేధింపులు (Harassment) ఎదుర్కొన్నది. మాటలు మితిమీరడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యయత్నం (Suicide attempt) చేసింది. ఆ తర్వాత డిప్రెషన్‌తో కోమాలోకి వెళ్లింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనపై విచారణ జరిపిన న్యాయస్థానం సంచలన తీర్పు వెల్లడించింది. బాధితురాలి కుటుంబానికి రూ.90 కోట్ల పరిహారం చెల్లించాలని కంపెనీ యాజమాన్యాన్ని ఆదేశించింది.
వివరాల్లోకి వెళ్తే.. జపాన్ రాజధాని టోక్యోకు చెందిన కాస్మోటిక్స్ బ్రాండ్ ‘డి-యూపీ కార్పొరేషన్’ సంస్థలో 25 ఏళ్ల సటోమి అనే మహిళ విధులు నిర్వర్తించేవార. 2021 ఏప్రిల్‌లో ఉద్యోగంలో చేరిన ఆమె అదే ఏడాది డిసెంబర్లో ఒక మీటింగ్‌లో పాల్గొన్నారు. ఆ మీటింగ్‌లో కంపెనీ ప్రెసిడెంట్ మిత్సురు సకై ఆమెను పరుష పదజాలంతో దూషించారు. ముందస్తు అనుమతి లేకుండా క్లయింట్లను కలిసినందుకు ఆమెపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
అంతటితో ఆగకుండా ఆమెను ‘వీధి కుక్క’ అని దూషించారు. సంస్థ నిబంధనలను పాటించలేదని మండిపడ్డారు. మరుసటి రోజు కూడా అలాంటి మాటలతోనే ఆమెను అవమానపర్చారు. దాంతో ఆమె మానసికంగా కుంగిపోయారు. ఆ మాటలతో డిప్రెషన్లోకి వెళ్లిపోయిన ఆమె.. చికిత్స నిమిత్తం కొన్ని రోజులు సెలవు తీసుకున్నారు. కానీ రోజురోజుకూ ఆమె పరిస్థితి క్షీణించింది. దాంతో 2022 ఆగస్టులో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది.
కానీ కుటుంబసభ్యులు ఆమెను రక్షించారు. ఆ తర్వాత డిప్రెషన్ మరింత పెరగడంతో సటోమీ కోమాలోకి వెళ్లిపోయింది. చికిత్స పొందుతూ 2023 అక్టోబర్ ప్రాణాలు విడిచింది. బాస్ మాటలతో తమ కుమార్తె ఎదుర్కొన్న దుస్థితిపై తల్లిదండ్రులు న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. ఆ కాస్మోటిక్స్ కంపెనీతో పాటు ప్రెసిడెంట్పైనా కేసు పెట్టారు. మిత్సురు సకై వ్యాఖ్యలకు, సటోమీ మానసిక పరిస్థితి దిగజారడానికి సంబంధం ఉందని దర్యాప్తులో వెల్లడైంది.
ఈ ఘటనను పని ప్రదేశంలో జరిగిన ఒక ప్రమాదంగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. దీనిపై తాజాగా టోక్యో జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆమె మృతికి డి-యూపీ కార్పొరేషన్‌దే బాధ్యత అని పేర్కొంది. యాజమాన్యం బాధిత కుటుంబానికి 150 మిలియన్ యెన్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.90 కోట్ల) పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అలాగే మిత్సురు సకై వెంటనే తన పదవి నుంచి దిగిపోవాలని ఆదేశాలు ఇచ్చింది.
కోర్టు తీర్పు అనంతరం సకై తన పదవికి రాజీనామా చేశారు. కంపెనీ బహిరంగ క్షమాపణలు తెలిపింది. తమ విధానాలను సమీక్షించి, మెరుగుపర్చుకుంటామని పేర్కొంది.