వాషింగ్టన్: పశ్చిమాసియా యుద్ధంతో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు మరో అదనపు భారం మీద పడింది. దిగుమతుల టారిఫ్‌ల పేరిట ఎడాపెడా పలు దేశాలపై ట్రంప్ సర్కార్ విధించిన అదనపు సుంకాలు రాజ్యాంగ విరుద్ధమని, అదనంగా వసూలు చేసిన మొత్తాలను తిరిగి వారికే చెల్లించాలంటూ యూఎస్ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అదనపు టారిఫ్‌ల వాపసు ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. కొత్తగా ప్రారంభించిన ఆన్లైన్ పోర్టల్ ద్వారా యూఎస్ కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో జరిగే ఈ వాపసు ప్రక్రియకు దిగుమతిదారులు, మధ్యవర్తులు తమ క్లెయిం దరఖాస్తులను ఉదయం 8 గంటల నుంచి సమర్పించవచ్చునని అధికారులు తెలిపారు. వారి క్లెయిం దరఖాస్తులు ఆమోదం పొందితే వాపసు ప్రక్రియను 60 నుంచి 90 రోజుల్లో పూర్తి చేస్తారు. న్యాయస్థానంలో ఉన్న డాటా ప్రకారం యూఎస్ ప్రభుత్వం 53 లక్షల షిప్మెంట్లకు 33 వేల మంది దిగుమతిదారులకు సుమారు 166 బిలియన్ డాలర్లు (రూ. 15.45 లక్షల కోట్లు) చెల్లించాల్సి ఉంది.