Sunita Williams | న్యూయార్క్: సాంకేతిక కారణాలతో అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, విల్మోర్లను భూమిపైకి తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్న వేళ కొత్త సవాళ్లు వెలుగులోకి వచ్చాయి. వారు భూమికి తిరిగొచ్చాక గురుత్వాకర్షణ శక్తి(గ్రావిటి)తో పోరాడాల్సి ఉంటుందని తెలుస్తున్నది. భూ వాతావరణానికి అలవాటు పడేందుకు పలు కఠిన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని విల్మోర్, సునీతా విలియమ్స్ వెల్లడించారు.
ఇటీవల సీఎన్ఎస్ వారిద్దరిని అంతరిక్షం నుంచి ఇంటర్వ్యూ చేసింది. నెలలకు పైగా మైక్రో గ్రావిటీ పరిస్థితుల్లో బరువు లేని స్థితిలో గడిపామని, భూమికి తిరిగొచ్చాక తమ శరీరం పలు శారీరక మార్పులకు గురవుతుందని వ్యోమగాములు తెలిపినట్టు సీఎన్ఎన్ పేర్కొంది. ‘గురుత్వాకర్షణ శక్తి ఎంతో కఠినమైనది. మేము భూమిపైకి తిరిగొచ్చాక దాన్నే ఎదుర్కోవాల్సి ఉంటుంది. భూమి గురుత్వాకర్షణ శక్తి అన్నింటిని కిందికి లాగుతుంది. శరీరంలో ఉండే ద్రవాలు కిందికి లాగబడతాయి. ఆ పరిస్థితుల్లో పెన్సిల్ ఎత్తడం కూడా వ్యాయామంతో సమానం’ అని విల్మోర్ తెలిపారు.
శరీరం గ్రావిటీ కారణంగా మార్పులు చెందుతున్నప్పుడు అసౌకర్యంగా, భారంగా ఉంటుంది. భూ వాతావరణానికి అనుగుణంగా ఉండటం సవాళ్లతో కూడుకున్నదని విలియమ్స్ వెల్లడించారు. ‘ఆ పరిస్థితులకు అడ్జస్ట్ కావడం ఎంతో కష్టం. వేగంగా సంకోచించే కండరాల చర్యను తిరిగి పొందడం చాలా కఠినమైనది’ అని విలియమ్స్ తెలిపారు.