Mammoth Elephants | న్యూయార్క్, మార్చి 5: జురాసిక్ పార్కు సినిమాలో జరిగినట్టే.. నిజ జీవితంలోనూ సాధ్యపడుతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. అంతరించిపోయిన జంతువుల పునఃసృష్టిలో అమెరికా శాస్త్రవేత్తలు పురోగతి సాధించారు. మంచు యుగం నాటి మ్యామత్ (జడల ఏనుగు)ల డీఎన్ఏతో ఎలుకలపై జరిపిన ప్రయోగం విజయవంతమైంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒంటిపై దట్టమైన ఉన్ని కలిగిన ఎలుకలను అమెరికాకు చెందిన ‘కోలోసస్ బయోసైన్సెస్’కు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ ప్రయోగాన్ని ఏనుగులపై చేయాలని శాస్త్రవేత్తలు ప్లాన్ చేస్తున్నారు. 2028 నాటికి మ్యామత్లను మళ్లీ సృష్టిస్తామన్నఆశాభావంతో ఉన్నారు.
ఆసియాలో ఉండే ఏనుగుల డీఎన్ఏ 95 శాతం వరకు మ్యామత్లతో పోలి ఉంటాయి. అందువల్ల వీటిపై ప్రయోగాలు చేయాలని అనుకుంటున్నారు. అయితే, ఎలుకల్లో గర్భధారణ రెండు వారాలు మాత్రమే కాగా, ఏనుగుల్లో ఇది సుమారుగా రెండేండ్లు ఉంటుంది. సుదీర్ఘ కాలంపాటు ఉండే గర్భధారణ సమయాన్ని దాటుకొని మ్యామత్ల సృష్టి సాధ్యమేనా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ జీవులను సృష్టించడం వల్ల ఆర్కిటిక్‌లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే, ప్రయోగాల ద్వారా సృష్టించే మ్యామత్లు మంచు పరిస్థితులను సమర్థవంతంగా తట్టుకుంటాయా? నీటి ఎకోసిస్టమ్‌కు సరిపోతాయా? అన్నది ప్రశ్నార్థకం.