KP Sharma Oli : నేపాల్‌లో ఆ దేశ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలిని అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసింది. అయితే, తన అరెస్టును శర్మ ఓలి తీవ్రంగా ఖండించారు. రాజకీయ ప్రతీకార చర్యలో భాగంగానే తనను అరెస్టు చేశారని శర్మ విమర్శించారు. కేపీ శర్మ ఓలిని భక్తపూర్‌లోని తన నివాసం నుంచి నేపాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నేపాల్ నూతన ప్రధానిగా బాలేంద్ర షా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే శర్మ అరెస్టు జరగడం గమనార్హం.
గత ఏడాది నేపాల్‌లో ప్రభుత్వంపై తిరుగుబాటు జరిగిన సంగతి తెలిసిందే. దేశంలో అవినీతి పెరిగిపోయిందని, ప్రభుత్వం దిగిపోవాలని కోరుతూ గత సెప్టెంబర్‌లో జెన్-జీ యువత భారీ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హింస చెలరేగింది. ఈ హింసను ఆపేక్రమంలో అప్పటి ప్రధాని శర్మ ఓలి తీవ్ర మారణహోమానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ నేపాల్ ప్రభుత్వం ఇప్పుడు ఆయనను అరెస్టు చేసింది. ఇదే కేసులో మాజీ హోంమంత్రి రమేష్ లేఖక్‌ను కూడా ప్రభుత్వం అరెస్టు చేసింది. గత ఏడాది జరిగిన హింసపై దర్యాప్తు జరిపిన నేపాల్ హోం శాఖ తాజాగా వీరికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. స్పెషల్ కోర్ట్ జడ్జ్ గౌరి బహదూర్ కార్కి ఆధ్వర్యంలోని కమిషన్ ఆదేశాల మేరకు ఓలి, రమేష్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరితోపాటు అప్పటి ఐజీ చంద్ర కుబేర్పై కూడా కేసు నమోదు చేశారు.
ఈ ముగ్గురిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా, వీటికి గరిష్టంగా పదేళ్ల శిక్షపడే అవకాశం ఉంది. అయితే, తన అరెస్టుపై శర్మ ఓలి స్పందించారు. తన అరెస్టు రాజకీయ ప్రతీకార చర్య అని, దీనిపై చట్టబద్ధంగా పోరాడుతానని తెలిపారు. నిరసనల సందర్భంగా జరిగిన హింసలో తన పాత్ర ఏమాత్రం లేదని ఖండించినట్లు శర్మ ఓలి తరఫు లాయర్లు తెలిపారు. అప్పట్లో జరిగిన ఘర్షణల్లో 77 మంది మరణించారు. పలు ప్రైవేట్, పబ్లిక్ ఆస్తులు ధ్వంసమయ్యాయి.