సైనిక దాడులకు సంబంధించి రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఉక్రెయిన్‌పై పోరు చివరి దాకా కొనసాగుతుందని లావ్రోవ్ పేర్కొన్నారు. తమ అసలు లక్ష్యం ఉక్రెయిన్ ఆక్రమణే అని చెప్పకనే చెప్పారు. పశ్చిమ దేశాల్లోని కొంతమంది అధినేతల తలకాయలను అణు యుద్ధం ఆలోచన తొలిచేస్తున్నదని, తమ మిలిటరీ ద్వారా వారిని అణచివేస్తామన్నారు.
రష్యా వైఖరిపై జెలెన్స్కీ కూడా అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. రష్యా ఇంకా దాడులు జరుపుతూ తమ దేశ ఆక్రమణకు ప్రయత్నిస్తే ఎదురుదాడి తప్పదని హెచ్చరించారు. రష్యా భూభాగాలపై కూడా ఉక్రెయిన్ సైన్యం దాడులు ప్రారంభిస్తుందని సంకేతాలిచ్చారు. రష్యా దాడుల్లో నాశనమైన ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి ప్రతీ పైసాను ఆ దేశం నుంచే వసూలు చేస్తామని పేర్కొన్నారు. ఉక్రెయిన్ పౌరులు తమ పోరాటాన్ని ఎప్పటికీ వదలబోరని పునరుద్ఘాటించారు
మాస్కో, మార్చి 3: ఉక్రెయిన్‌పై రష్యా దాడుల పర్వం గురువారం కొత్త మలుపు తీసుకొన్నది. ఉక్రెయిన్‌పై తమ పోరు చివరి దాకా కొనసాగుతుందని రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ పేర్కొన్నారు. తమ అసలు లక్ష్యం ఉక్రెయిన్ ఆక్రమణే అని చెప్పకనే చెప్పారు. రష్యాపై అణు యుద్ధానికి పశ్చిమ దేశాలు సన్నద్ధం అవుతున్నాయని ఆరోపించారు. తమ మిలిటరీ ద్వారా వారిని అణచివేస్తామన్నారు. రష్యా వైఖరిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రష్యా ఇంకా దాడులు జరుపుతూ తమ దేశ ఆక్రమణకు ప్రయత్నిస్తే ఎదురుదాడి తప్పదని హెచ్చరించారు. రష్యా భూభాగాలపై కూడా ఉక్రెయిన్ సైన్యం దాడులు ప్రారంభిస్తుందని సంకేతాలిచ్చారు. డోన్బాస్, లూహాన్స్కు స్వాతంత్రం కోసమేనంటూ రష్యా తొమ్మిది రోజుల క్రితం మిలిటరీ చర్యను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
‘అణు’యుద్ధం కోసం వాళ్లు తహతహ
ఉక్రెయిన్ను పూర్తిగా ఆక్రమించుకొనేంత వరకు తమ దాడులు ఆగవని లావ్రోవ్ స్పష్టం చేశారు. డోన్బాస్, లూహాన్స్ ప్రాంతాలకు స్వాతంత్య్రం కోసం అంటూ పుతిన్ ప్రకటించిన మిలిటరీ చర్య అసలు లక్ష్యాన్ని పరోక్షంగా వెల్లడించారు. ఉక్రెయిన్‌వ్యాప్తంగా రష్యా దాడులు చేస్తున్నప్పటికీ తమ లక్ష్యం ఆక్రమణ కాదని రష్యా ఇప్పటి వరకు చెప్పుకొంటూ వస్తున్నది. తాజాగా లావ్రోవ్ ఓ ఇంటర్వ్యూలో ‘ఉక్రెయిన్‌పై మా పోరాటం చివరి దాకా ఆగదు’ అని వ్యాఖ్యానించారు. పశ్చిమ దేశాలు అణుయుద్ధం కోసం తహతహలాడుతున్నాయని విమర్శించారు. మూడో ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే అది కచ్చితంగా అణుయుద్ధమే అవుతుందన్నారు. ‘పశ్చిమ దేశాల్లోని కొంతమంది అధినేతల తలకాయలను న్యూక్లియర్ వార్ ఆలోచన తొలిచేస్తున్నది. అందుకు సన్నద్ధం కూడా అవుతున్నారు’ అని లావ్రోవ్ ఆరోపించారు. కానీ, రష్యాకు ఆ ఉద్దేశం లేదన్నారు. ఉక్రెయిన్‌పై తమ చర్యను లావ్రోవ్ సమర్థించుకొన్నారు. ఉక్రెయిన్‌లో సమస్య పరిష్కారానికి చర్చల కోసం రష్యా సిద్ధంగా ఉందన్నారు. అయితే అప్పటిదాకా దాడులు ఆపాలన్న ఉక్రెయిన్ డిమాండ్‌ను ఆయన తోసిపుచ్చారు. ఉక్రెయిన్ మిలిటరీ స్థావరాల ధ్వంసం కోసం దాడులను కొనసాగిస్తామన్నారు.
ప్రతిఘటనకు సిద్ధంకండి
రష్యా దాడులతో దెబ్బతిన్న ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి ప్రతీ పైసాను ఆ దేశం నుంచే వసూలు చేస్తామని జెలెన్స్కీ అన్నారు. గురువారం ఆయన ఉక్రెయిన్ ప్రజలను ఉద్దేశించి వీడియో ప్రసంగం విడుదల చేశారు. రష్యా తప్పక మూల్యం చెల్లించుకొంటుందని పేర్కొన్నారు. యుద్ధం తర్వాత ఉక్రెయిన్ను పునర్నిర్మిస్తామని చెప్పారు. ‘మీరు ధ్వంసం చేసిన ప్రతి ఇంటిని, ప్రతీ వీధిని, ప్రతీ నగరాన్ని పునర్నిర్మిస్తాం. ఇందుకయ్యే ఖర్చును మీ నుంచే వసూలు చేస్తాం’ అని రష్యాను ఉద్దేశించి అన్నారు. రష్యా ఇంకా దాడులను పెంచి ఆక్రమణకు యత్నిస్తే తాము కూడా ఎదురుదాడి చేస్తామన్నారు. రష్యా భూభాగాలపై దాడులు చేయనున్నట్టు సంకేతాలిచ్చారు. ‘మేం కోల్పోయేది ఇక ఏం లేదు’ అని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌కు ప్రపంచ దేశాల నుంచి ఆయుధాలు అందుతున్నాయని చెప్పారు. ‘ఉక్రెయిన్ ఆక్రమణకు రష్యా ఏండ్ల కొద్దీ ప్రణాళికలు రచించింది. శత్రువు కుట్రలను ఉక్రెయిన్ ప్రజలు వారంలోనే భగ్నం చేశారు. ప్రతి ఆక్రమణదారు తప్పక గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇది. ఉక్రెయిన్ను ఆక్రమించాలని చూస్తే తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌కు మిలిటరీ సాయాన్ని పెంచాల్సిందిగా పశ్చిమ దేశాలను మరో ఇంటర్వ్యూలో కోరారు. ఆయా దేశాలు గగన తలాలను మూసివేయాలని, లేకపోతే విమానాలు అప్పజెప్పాలన్నారు. ఇప్పుడు కలిసి పోరాడకపోతే దేవుడు క్షమించడని, రష్యా మరిన్ని ఐరోపా దేశాల మీదకు దాడులకు దిగుతుందని హెచ్చరించారు.