లాస్ఏంజెల్స్ : అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌ను కబళించిన భారీ కార్చిచ్చు ఆ దేశానికి భారీ నష్టాన్ని మిగిల్చింది. ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా మరణాల సంఖ్య ఐదే ఉన్నప్పటికీ భారీగా ఆస్తి నష్టం సంభవించింది. 2 వేలకు పైగా విలాసవంతమైన భవనాలు బూడిదయ్యాయి. కాలిఫోర్నియాకు మునుపెన్నడూ లేనంతగా ప్రకృతి వైపరీత్యం కారణంగా 4.89 లక్షల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్టు ఆక్యూవెదర్.ఐఎన్‌సీ ప్రకటించింది. అంతేకాకుండా ఈ విపత్తు వల్ల ఏర్పడిన పొగ, ఇతర విష వాయువుల కారణంగా పౌరులకు భవిష్యత్‌లో అనారోగ్య సమస్యలు ఏర్పడటంతో పాటు ఈ ప్రాంత పర్యాటకంపై ప్రభావం పడుతుందని తెలిపింది.
హాలీవుడ్ ఐకానిక్ కట్టడాలను కూడా మంటలు చుట్టుముట్టే ప్రమాదం ఏర్పడింది. తాజాగా గురువారం రాన్యాన్ కాన్యాన్, వాటిల్స్ పార్క్ మధ్య 20 ఎకరాల్లో కార్చిచ్చు వ్యాపించినట్టు అధికారులు ప్రకటించారు. హాలీవుడ్ చిహ్నంతో పాటు, ఏటా ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరిగే డాల్బీ థియేటర్‌కు కూడా ఈ సన్‌సెట్ ఫైర్ ముప్పు పొంచి ఉంది. కొందరు హాలీవుడ్ సెలబ్రెటీల గృహాలు ఇప్పటికే కార్చిచ్చులో దగ్ధం అయ్యాయి. సంపన్నులు, సెలబ్రిటీలు అధికంగా నివసించే లారెల్ కాన్యన్ బైలేవార్డ్, ముల్హోలాండ్ డ్రైవ్‌లోని పలు నివాసాలను అధికారులు బుధవారం సాయంత్రం ఖాళీ చేయించారు. లాస్ఏంజెల్స్, దాని పరిసరాల్లో ఉన్న వెంచురా కౌంటీలో ఆరు ప్రదేశాల్లో మంటలు చెలరేగుతున్నాయి.
కార్చిచ్చు ప్రమాదాల్లో మృతుల సంఖ్య ఐదుకు చేరుకుంది. ఇప్పటివరకు 1,37,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బుధవారం మధ్యాహ్నానికి దేశంలో 15 లక్షల మంది విద్యుత్తు సౌకర్యం లేక అంధకారంలో మగ్గారు.