కొవిడ్ మహమ్మారి పీడ ఇంకా విరుగుడు కాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని శనివారం ఆందోళన వ్యక్తంచేసింది. ప్రపంచవ్యాప్తంగా 8 శాతం అంటే 11 మిలియన్లకు పైగా కొవిడ్ -19 కేసులు పెరిగాయని వెల్లడించింది. చైనా, దక్షిణ కొరియా, యూకే, హాంకాంగ్ లాంటి దేశాల్లో కరోనా టెస్టుల సంఖ్య తగ్గినా.. కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు తెలిపింది.
డబ్ల్యూహెచ్వో కొవిడ్ టెక్నికల్ లీడ్ డాక్టర్ మరియా వాన్ కెర్ఖోవ్ మాట్లాడుతూ..కొవిడ్-19పై తప్పుడు ప్రచారం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. కొవిడ్ మహమ్మారి ముగిసిందనీ, ఇదే చివరి రూపాంతరం అంటూ తప్పుడు ప్రచారం జరిగిందన్నారు. దీంతో ప్రజలు నిర్లక్ష్యంగా ఉన్నారనీ, మళ్లీ కరోనా వ్యాప్తి ప్రారంభమైందన్నారు. ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న ఒమిక్రాన్ (Omicron) వెర్షన్లో రెండు సబ్ వేరియంట్లు బీఏ.1, బీఏ.2లున్నాయని చెప్పారు. ఇందులో బీఏ.2 వేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రకటించారు. ఇప్పటివరకూ మనం చూసిన సార్స్ సీఓవీ-2 వైరస్లోనే ఇది వేగంగా వ్యాప్తిచెందే సబ్ వేరియంట్ అని ఆయన వెల్లడించారు.