వాషింగ్టన్, అక్టోబర్ 3: అమెరికాలో విధించిన షట్డౌన్ రెండో రోజు కూడా కొనసాగింది. ఈ షట్డౌన్ ఇలాగే కొనసాగితే వేలాది మంది ఫెడరల్ ఉద్యోగులను తొలగించాల్సి ఉంటుందని వైట్ హౌస్ వర్గాలు గురువారం హెచ్చరించాయి. రోజుకు సుమారుగా 400 బిలియన్ డాలర్లు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నాయి. అమెరికాలో షట్డౌన్ పారంభమై 24 గంటలు ముగిసినా రాజకీయ పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో దానికి పరిష్కారం లభించదేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ నిధులపై ఇరు వర్గాలు పట్టుబట్టి కూర్చున్నాయి. దీంతో ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులు ఇంటికే పరిమితం అయ్యారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా అక్టోబర్ 1 నుంచి తాత్కాలికంగా మూసివేశారు.
మరోవైపు పెన్సెల్వినియాలోని లిబర్టీ సెల్ నుంచి ఐకానిక్ జాతీయ సైట్ల నుంచి హవాయిలోని పెరల్ హార్బర్ వరకు ఇప్పటికే మూతపడ్డాయి. తొలగించాల్సిన ఉద్యోగుల సంభావ్య జాబితాను ట్రంప్ యంత్రాంగం ఇప్పటికే రూపొందించిందని వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి కరోలిన్ లీవిట్ తెలిపారు. ‘ఈ షట్డౌన్ కారణంగా ఏయే విభాగాల ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోతారన్న విషయంపై ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ అధికారులు వివిధ శాఖలతో చర్చలు జరుపుతున్నారు. అలా తొలగించే వారి సంఖ్య వేలల్లో ఉండచ్చు’ అని ఆమె పేర్కొన్నారు. ఈ పరిస్థితి రావడానికి డెమొక్రాట్లే కారణమని ఆమె నిందించారు. ‘వారు పత్రాలు లేని వలసదారులకు ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలపై భిన్నాభిప్రాయాలపై రాజకీయాలు ఆడుతున్నారు’ అని ఆమె ఆరోపించారు.
అక్రమ విదేశీయులు వైద్య ప్రయోజనాలను పొందాలని మీరు అనుకుంటున్నారా? అని ఆమె ప్రశ్నించారు. మన దేశంలో దుర్బల స్థితిలో ఉన్న అమెరికా పౌరులకు మాత్రమే వైద్య ప్రయోజనాలను పొందాల్సి ఉందని, కానీ ఇంతకుముందు అధ్యక్షుడిగా చేసిన జో బైడెన్ హయాంలో వేలాది మంది అక్రమ చొరబాటుదారులు ఈ ఉచిత ప్రయోజనాలను పొందారని ఆమె ఆరోపించారు. కాగా, బుధవారం అర్ధరాత్రి నిధుల గడువును చట్ట సభ్యులు దాటవేయడంతో అమెరికా ప్రభుత్వం పాక్షికంగా మూతపడింది. దీంతో అనేక ఏజెన్సీలకు బడ్జెట్ లేకుండా పోయాయి. అనేక విభాగాలు అంతరాయాలను ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వంలో అత్యవసరమైన సేవలు కొనసాగుతున్నాయని నివేదికలు తెలిపాయి.
షట్డౌన్ భయం కారణంగా అమెరికాలో వేలాది మంది ఉద్యోగులు గురువారం ఇళ్లకే పరిమితమైపోయారు. అదే సమయంలో ట్రంప్ పనిచేసే హక్కు గురించి సామాజిక మాధ్యమంలో పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా తన అభిమానులను పొగడ్తలతో ముంచెత్తిన ఆయన అక్రమ వలసదారులకు డెమొక్రాట్లు ఆరోగ్య సంరక్షణ నిధులను ఇవ్వాలనుకుంటున్నారని వారిపై ఆరోపణలు గుప్పించారు. ‘డెమొక్రాట్లు మీ ఆరోగ్య సంరక్షణ డబ్బును అక్రమ విదేశీయులకు ఇస్తున్నారు’ అని ఆరోపించిన ట్రంప్.. దానిని ‘రాజకీయ స్కామ్’గా ఎగతాళి చేశారు. సమాఖ్య కార్యక్రమాలను తగ్గిస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఫెడరల్ ప్రభుత్వాన్ని పునర్ వ్యవస్థీకరించేందుకు అనుకోని అవకాశం లభించిందన్నారు. ‘వాళ్లు తెలివితక్కువ వాళ్లు కాదు కాబట్టి బహుశా వారు నిశ్శబ్దంగా, త్వరగా అమెరికాను గొప్పగా మార్చాలని కోరుకునే మార్గం ఇదే కావచ్చు’ అని పేర్కొన్నారు.
అమెరికాలో త్వరలో గడువు తీరిపోనున్న ఆరోగ్య ప్రయోజనాలను పొడిగించాలని విపక్ష డెమొక్రాట్లు కోరగా, రిపబ్లికన్లు తిరస్కరించారు. అలా చేస్తే ఖజానాపై భారం పడుతుందని వారు అన్నారు. దీంతో డెమొక్రాట్లు బిల్లుపై సుముఖత చూప లేదు. అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల్లో ట్రంప్ పార్టీకి మెజారిటీ ఉన్నప్పటికీ సెనేట్లో తగిన మెజార్టీ లేకపోవడంతో స్టాప్ గ్యాప్ ఫండింగ్ బిల్లు నెగ్గలేదు. కీలకమైన స్టాప్ గ్యాప్ ఫండింగ్ బిల్లుకు సెనేట్లో ఆమోదం లభించ లేదు. దీంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి షట్డౌన్ అమలులోకి రావడంతో అత్యవసరం కాని ప్రభుత్వ సేవలు, కార్యకలాపాలు నిలిచిపోయాయి. 1981 తర్వాత ఇది 15వ షట్డౌన్ కాగా, గత ఏడేండ్లలో ఇది రెండోసారి. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైనప్పుడు 2018లో షట్డౌన్ ప్రకటించారు. అది 35 రోజుల పాటు కొనసాగింది. అమెరికా చరిత్రలో అదే ఎక్కువకాలం కొనసాగిన షట్డౌన్. ఇప్పుడూ అదే పరిస్థితి పునరావృతం అవుతుందేమోనని ఆ దేశ పౌరులు భయపడుతున్నారు.