న్యూయార్క్ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌కు ఉక్రెయిన్ వార్‌పై వాస్తవాలు వెల్లడించేందుకు సైనికాధికారులు, సలహాదారులు భయపడుతున్నారని అమెరికా పేర్కొంది. ఉక్రెయిన్ యుద్ధం సాగుతున్న క్రమంలో పుతిన్‌కు ఆయన సిబ్బందితో సంబంధాలు దిగజారాయని వైట్‌హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ కేట్ బెడింగ్‌ఫీల్డ్ అన్నారు.
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా సైన్యం ఎంత పేలవంగా పనిచేస్తున్నదో..ఆంక్షలతో రష్యా ఆర్ధిక వ్యవస్ధ ఛిద్రమవుతున్న తీరును పుతిన్‌కు ఆయన సలహాదారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని తాము భావిస్తున్నామని అన్నారు. పుతిన్‌కు వాస్తవాలు చెప్పడంలో సీనియర్ సలహాదారులు సైతం భయపడుతున్నారని పేర్కొన్నారు. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోగుతో పుతిన్ సంబంధాలు దెబ్బతిన్నాయని, రెండు వారాల నుంచి ఆయన ఎక్కడా కనిపించడం లేదని వైట్‌హౌస్ పేర్కొంది.
రక్షణ మంత్రిత్వ శాఖ నాయకత్వాన్ని పుతిన్ విశ్వసించడం లేదని పుతిన్‌కు, రక్షణ శాఖ మధ్య టెన్షన్ నెలకొందని తెలిపింది. రష్యన్ బలగాల దాడిని ఉక్రెయిన్ క్షేత్రస్ధాయిలో దీటుగా తిప్పికొడుతున్న క్రమంలో అమెరికా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రష్యన్ బలగాల దూకుడుకు కళ్లెం పడటంతో పాటు కీవ్‌కు సమీపంలోని ఇర్పిన్ సహా పలు పట్టణాలను తిరిగి ఉక్రెయిన్ చేజిక్కించుకుంది.