న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాకు ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తుంది. నూతన ఆర్థిక సంవత్సరం కోసం అమెరికన్ కాంగ్రెస్ నిధులను సమకూర్చకపోతే.. అక్టోబర్ 1న అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ విధించే అవకాశం ఉన్నది. అదే గనుక జరిగితే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అమెరికన్ కాంగ్రెస్ నూతన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌కు ఇంకా ఆమోద ముద్ర వేయలేదు. బడ్జెట్‌కు ఆమోద ముద్ర పడితేనే అంతా సజావుగా సాగుతుంది. ఒకవేళ బడ్జెట్‌కు ఆమోదం లభించకపోతే అక్టోబర్ 1న షట్‌డౌన్ విధించాలని అమెరికా ప్రభుత్వం భావిస్తున్నది. అదేగనక జరిగితే.. ఫెడరల్ ఏజెన్సీలకు సంబంధించిన అత్యవసరం కాని పనులన్నీ ఆగిపోతాయి.
లక్షలాది మంది ఉద్యోగులను వేతనం లేకుండా సెలవుపై ఇళ్లకే పరిమితం చేయాల్సి వస్తుంది. అయితే, అత్యవసరాలైన మిలిటరీ ఆపరేషన్స్కుగానీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కుగానీ, మెడికల్ కేర్కుగానీ, ఫెడరల్ న్యాయవ్యవస్థపైగానీ ఎలాంటి ప్రభావం ఉండదు. కాకపోతే దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ పార్కులు, మ్యూజియంలు మూతపడే అవకాశం ఉంది.