వాషింగ్టన్, టెహ్రాన్, జూన్ 11: క్షిపణి దాడులు, బాంబు పేలుళ్లతో పశ్చిమాసియా మళ్లీ దద్దరిల్లింది. ఇరాన్‌పై మరోసారి అమెరికా భీకర దాడులకు దిగింది. ఇరాన్‌లోని పలు లక్ష్యాలపై దాడులు చేసినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఆత్మరక్షణ కోసమే ఈ దా డులు చేశామని తెలిపింది. ఇరాన్ నిఘా వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, వాయు రక్షణ వ్యవస్థ స్థావరాలు లక్ష్యంగా అమెరికా గురువారం దాడులు కొనసాగించింది.
అమెరికా దాడులకు దీటుగా స్పందించిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కువైట్, బహ్రెయిన్‌లోని వాయు స్థావరాలు, అమెరికా నావికా దళం ఐదవ ఫ్లీట్ ప్రధాన కార్యాలయం సహా 18 అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసింది. అలాగే జోర్డాన్‌లోని అమెరికా వాయు స్థావరం అల్-అజ్రక్పై కూడా క్షిపణి దాడి చేసినట్టు ప్రకటించింది. హొర్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్టు ప్రకటించింది.
ఇరాన్‌పై ఈ రాత్రి భారీ దాడిచేయనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ప్రకటించారు. ఆ దేశంలోని ఖర్గ్ ద్వీపంతో పాటు చమురు, గ్యాస్ పరిశ్రమలపై పూర్తి నియంత్రణ సాధిస్తామన్నారు. ఇరాన్ మిలిటరీ సామర్థ్యాలను ఇప్పటికే తీవ్రంగా బలహీన పరిచామని ఆయన చెప్పారు. ‘అమెరికా ఈ రోజు రాత్రి ఇరాన్‌పై అత్యంత తీవ్రమైన దాడి చేయబోతున్నది. ఇరాన్ నావిక, వాయు, రాడార్, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్, ఇతర రక్షణ వ్యవస్థలు ఇప్పటికే తుడిచిపెట్టుకు పోయాయి.’ అని ఆయన పేర్కొన్నారు.