Donald Trump | వాషింగ్టన్, ఆగస్టు 26: పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం మరింత ముదురుతున్నదని, మూడో ప్రపంచ యుద్ధం సంభవించే ప్రమాదముందని అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్, ఇజ్రాయెల్ బలగాల మధ్య భీకరపోరు మొదలైన కొన్ని గంటల్లోనే ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమాసియా సంక్షోభాన్ని ఎదుర్కొనటంలో అమెరికా విధానంపై ట్రంప్ అనుమానాలు వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాలిఫోర్నియా బీచ్‌లో హాయిగా నిద్రపోతున్నాడని మండిపడ్డారు. ‘స్లీపీ జో’ అంటూ ‘ఎక్స్’లో సందేశాన్ని పోస్ట్ చేశారు. అమెరికా నేతలు నిద్రమత్తులో ఉన్నారని, అందువల్లే మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 26: ప్రముఖ మెసేజింగ్ యాప్‌లలో ఒకటైన టెలిగ్రామ్ భారత్‌లో నిషేధానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. మోసాలు, జూదం వంటి అక్రమ కార్యకలాపాలకు ఈ యాప్‌ను వినియోగిస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై ప్రస్తుతం హోంశాఖ, ఐటీ శాఖ సహకారంతో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ) విచారణ జరుపుతున్నది.
టెలిగ్రామ్‌లో అక్రమ కార్యకలాపాలతో పాటు ఇది భారతదేశ ఐటీ నిబంధనలను పాటిస్తున్నదా అనేది విచారణలో తేలనుంది. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా టెలిగ్రామ్ పని చేస్తుందని విచారణలో వెల్లడైతే ఈ యాప్‌ను నిషేధించే అవకాశం ఉంది. కాగా, మానవ అక్రమ రవాణా, మోసాలు, సైబర్ బెదిరింపులు వంటి వాటిలో ప్రమేయం ఉందనే ఆరోపణలతో మూడు రోజుల క్రితం టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పవెల్ దురోవ్‌ను ఫ్రెంచ్ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.